• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జేబులో సున్నితపు త్రాసు వేసుకుతిరిగే వ్యక్తి

By Staff
|

''తెల్లారి లేస్తే తొంభయి సరుకులు కొంటుంటాం మనం. కానీ ఏ వస్తువు మీదా డిస్కౌంట్‌ డిమాండ్‌ చెయ్యం. పుస్తకాల విషయానికొచ్చేసరికి మాత్రం రాయితీ కావాలని పట్టుపడతాం. ఈ పరిస్థితిలో మార్పు వస్తే పుస్తక వాణిజ్యరంగం స్వరూప స్వభావాలే మారిపోతా''యని వ్యాఖ్యానించారు రాజేశ్వరరావు. ''ఏ వ్యాపారమయినా తీసుకోండి - సగానికి సగం రాబడి లేని వ్యాపారం ఏదీ లేదు. అలాగే ఒక్కో చోట ఒక్కో వెల పెట్టి అమ్ముకోవడం మిగతా సరుకుల విషయంలో సాధ్యం కావచ్చు గానీ పుస్తకాలకు ఆసేతు హిమాచలం యూనివర్సల్‌ ప్రైసింగ్‌ తప్పనిసరి. బిస్కెట్‌ ప్యాకెట్ల మీదా సిగరెట్‌ పెట్టెల మీదా కూడా ఆ రాష్ట్రంలో అయితే అంత ఈ రాష్ట్రంలో అయితే ఇంత అని ధరలు వేసి ఉంటాయి. పుస్తకాలకు అలాంటిదెక్కడయినా చూశారా? ఈ రంగానికి సహజంగా ఉన్న వాణిజ్యపరమైన పరిమితి ఇది. ఒకరకంగా చూస్తే కేవలం వ్యాపార దృక్పథంతో ఎవరూ పుస్తకాలు అమ్మలేరు - ప్రచురించలేరు. అంతకుమించిన ఆదర్శవాదం కాస్తోకూస్తో లేకుండా ఎవరూ ఈ రంగంలో అడుగుపెట్టరు. కానీ సమాజంనుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, సంఘాలూ, సంస్థల నుంచి కానీ ఈ రంగానికి రావలసినంత ఆదరణ లభించడం లేదు. మన పుస్తక వాణిజ్యంలో నాణ్యతస్థాయి అత్యల్పంగా ఉండడానికి ఇదో ముఖ్య కారణం'' అని రాజేశ్వరరావు విమర్శించారు.

''చిరిగిన చొక్కా అయినా తొడుక్కో - మంచి పుస్తకం కొనుక్కో,'' అని ఎవరో మహానుభావుడు అన్నాడట. మీకో చిత్రం చెబుతాను. మా వ్యాన్లు కోస్తా జిల్లాల్లో తిరిగినప్పుడు అమ్మకాలు అంతగా ఉండడం లేదు. అక్కడ ప్రజల కొనుగోలు శక్తి బాగా ఎక్కువే. కానీ పుస్తకాలు మాత్రం కొనడం లేదు. అదే రాయలసీమ తెలంగాణా జిల్లాల్లో తిరిగితే ఆదరణ అపారంగా లభిస్తోంది. ఆ ప్రాంతాల్లో ప్రజల ఆర్ధిక సామర్థ్యం రెలెటివ్‌గా తక్కువ. ఈ విడ్డూరాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో బోధ పడడంలేదు'' అన్నారు రాజేశ్వరరావు. ''ఇంతకన్నా విచిత్రమనిపించే - విషాదకరమయిన విడ్డూరం ఇంకొకటి చెప్తా వినండి! పేపర్‌ భారీగా కొని గోడవున్లలో దాచిపెట్టి ఆరునెల్ల తర్వాత మార్కెట్‌లోకి వదిలిపెడితే లక్షలు కుమ్ముకోవచ్చు. అసెంబ్లీకో, పార్లమెంటుకో ఎన్నికలు వచ్చి పడ్డాయనుకో - పంట పండినట్లే! రెండుమూడింతలు లాభాలు దూసుకోవచ్చు. కానీ అదే పేపర్‌ మీద జనానికి ఉపయోగపడే పుస్తకాలు ముద్రించి, నాణ్యమయిన బైండింగ్‌ చేసి మార్కెట్‌లో పెట్టి చూడు - అమ్మకాలు అంతంతమాత్రం! అన్నీ అమ్ముడు అయినా కూడా లాభాల శాతం ఎంత? బహుస్వల్పం. విశాలాంధ్ర లాంటి సంస్థకి రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉంది. తొమ్మిదో పదో బ్రాంచీలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ అండదండలున్నాయి. ఏదో చేసి మా ప్రచురణలు మేం అమ్ముకోగలం. కానీ ఔత్సాహిక ప్రచురణ కర్తల మాటేమిటి? ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే రచయితలు - ప్రచురణకర్తలు - విక్రేతలు - ప్రభుత్వ అధికారులు - ముఖ్యంగా గ్రంథాలయ సంస్థల బాధ్యులు సమష్టిగా కృషి చెయ్యవలసి ఉం''దని రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

''మా విషయానికి వస్తే, ఏదయినా ప్రచురణకు సోల్‌ డిస్ట్రిబ్యుషన్‌ మాకే ఇస్తే 50 శాతం డిస్కౌంట్‌ అడగడం మా పద్ధతి. ఇందులో మాకెంత మిగుల్తుందో మాకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళకి వివరిస్తూనే వున్నాం. ఒక్క డిస్ట్రిబ్యూషన్‌లో మాకు పదిశాతం మార్జిన్‌ కూడా దక్కని సందర్భాలు అనేకం. పోతే, విశాలాంధ్ర సంస్థ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లాంటిది. ఇందులో ఏసీ కోచ్‌లూ ఉన్నాయి. సెకండ్‌క్లాస్‌ స్లీపర్‌ కోచ్‌లూ ఉన్నాయి. ప్రజాప్రయోజనం ప్రధానంగా పరిగణించే ప్రచురణలకు సంబంధించి మేం అంత ఎక్కువ డిస్కౌంటు కావాలని నిర్బంధించడం లేదు. ఈ విషయం ప్రచురణకర్తలకూ రచయితలకూ కూడా తెలుసు. ఆయా పుస్తకాల రచయితల మెరిట్‌ ఆధారంగానే నియమనిబంధనలు పెడతాం తప్ప, నియమాల కోసం నియమాలు ఉండవుకదా'' అన్నారాయన.

ఆరునెలల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రాజేశ్వరరావు ఒక చేతిని, ఓ కాలు సగంవరకూ కోల్పోయారు. రెండు నెలలు మాత్రమే విశ్రాంతి తీసుకుని జనవరి నెల మధ్యనుంచే ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తున్నారు. ''ఈ సంస్థ బాధ్యత నా చేతుల్లోకి వచ్చేసరికి దాని వార్షిక టర్నోవర్‌ ఇరవైలక్షలు. పాతికేళ్ళకాలంలో ఈ ఫిగర్‌ను రెండున్నర కోట్ల రూపాయలకు చేర్చగలిగాం. ఇదంతా నా ఒక్కడి ఘనతేనని ఎప్పుడూ అనుకోలేదు - అనలేదు. ఏదో 'నేను సైతం' అని మాత్రమే అనుకుంటుంటాను. నా వైకల్యం శరీరానికి మాత్రమే పరిమితం. నా అస్తిత్వానికంతటికీ అది పాకకూడదు - పాకనివ్వను. కాళ్ళూచేతులూ ఉన్నా లేకపోయినా రాజేశ్వరరావు రాజేశ్వరరావే!'' అని ధీమాగా మాట్లాడగలిగే వ్యక్తికి మూడు ప్రముఖ సంస్థలు అవార్డులనివ్వడంలో ఆశ్చర్యం ఏముంది?''.

ఒక్క విషయం చెప్పాల్సి ఉంది. మా ఆవిడ జ్యోతిర్మయి - ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఐదుకల్లు సదాశివన్‌గారి కుమార్తె - నాకు ఎల్లప్పుడూ సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌స్పిరేషన్‌గానే ఉంటూ వచ్చింది. ఇటీవల మరీ ముఖ్యంగా. మా పిల్లలు కూడా తమ వంతు సహకారం సంపూర్ణంగా ఇస్తున్నారు. గతంలో కన్నా మరింత మెరుగయిన రీతిలో, సమర్ధంగా పనిచేసి చూపించాలన్న పట్టుదల, కసి నాలో నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న లైబ్రరీలకు ఇవ్వడం కోసం పదిహేను పుస్తకాలను కేవలం పదిరోజుల వ్యవధిలో ముద్రించి విడుదల చేశాం. నా ఆత్మవిశ్వాసం నానాటికీ పెరుగుతోంది'' అంటున్న రాజేశ్వరరావును అభినందించి ఆదరించకుండా ఉండగలమా?!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X