వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకన్న పాదాల్లోంచి బ్రహ్మమొహం

By Staff
|
Google Oneindia TeluguNews

సరే మీరంటున్నట్టుగానే వందేళ్లకో, వెయ్యేళ్లకో కులాలన్నీ నశించిపోయాయనే అనుకుందాం. అప్పుడు తెలుగు వాళ్లంతా ఏ తెలుగు మాట్లాడుకుంటారు? ఆంధ్ర తెలుగా, రాయలసీమ తెలుగా, తెలంగాణ తెలుగా? అందరూ ఎలాంటి బట్టలు వేసుకుంటారు? బిల్‌గేట్స్‌ కోటు టైయా? శాస్త్రిగారి జందెం పిలకా? మా అమ్మ లంబాడి గంగావత్‌ ద్వాళీ కాంఛ్‌డీ పెఠియా? బెస్తెంకన్న జాలరి గోచా? తెలుగువాళ్లంతా ఏం పాడుకుంటారు? శ్రీరామ దండకం, గాయత్రి మంత్రమా? లేక మైకేల్‌ జాక్సన్‌ పాటలా లేక గోండు రేలారేలా మాదిగ చిందు గీతాలా? కులాలన్నీ పోతే గొల్లవాడి ఒగ్గుకథా, మాదిగవాడి చిందుబాగోతం, వండ్రంగి రుంజ కథా, చాలకి మడేల్‌ కథా, గోండుల గుసాడీ, థింస నృత్యాలు, మేదరటి బుట్టలూ, కుమ్మరి కుండలూ, ఫకీర్‌ విరోచనాలు తగ్గే విబూదిమందూ- ఇంఆక బహు రకాల ఆదివాసుల, కులాల జ్ఞానమూ, భాషలూ, కళలూ అన్నీ నాశనమైపోవా? కులాలు నశించిపోతే భారతీయులందరూ బ్రాహ్మలైపోతారు గదా లేదా బిల్‌ క్లింటన్‌ కొడుకులైపోతారు గదా? పోవాల్సింది కులమా? కులగర్వమా? కులద్వేషమా? భారతదేశంలో (నాకు తెల్సినంత వరకు) సాహిత్యంలో ఉద్యమాలు దళిత బహుజన సాహిత్యం వరకు, స్త్రీ వాద సాహిత్యం వరకు వచ్చి ఆగిపోయాయి. ఒక్క తెలుగులోనే దళిత బహుజన సార్వజనీనత నుంచి విడిపోయి మాదిగ కవిత్వంగా, మాల కవిత్వంగా, లంబాడీ కవిత్వంగా, ముస్లిం కవిత్వంగా, వెరసి తెలంగాణ కవిత్వంగా ఎదిగింది. ఈ కవిత్వం ముఖ్యంగా తమ సంస్కృతినీ దానికి మూలమైన తమ కులవృత్తినీ ఆధారం చేసుకుని వచ్చింది. ఇంకా గోండు, కోయ, సవర, కోలామ్‌, యానాది, ఎరకల, క్రిస్టియన్‌, చిందు బాగోతుల, బైండ్ల, లంబాడీ, బైరూపుల, ముష్టికుంట్ల, కుమ్మరి, గొల్ల, భట్రాజుల, గౌండ్ల, దూదేకుల- నానా కులాల నానా జాతుల సాహిత్యం, కళలూ నానా రకాలుగా వచ్చినప్పుడే దేశానికి ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే దేవుడు అనే ఎజెండా దానంతటదే మరణిస్తుంది.

మొట్టమొదటి సారి తెలుగుదేశానికి బెస్త కవిత్వాన్నందించిన వాడు గోసంగి కవీ, తెలంగాణ గుండెకాయ, నల్లగొండ బిడ్డ ఎం. వెంకట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే- పైన పేర్కొన్న కుల కవిత్వాలన్నీ కొంత కులభాషను వినియోగించుకుని కవిత్వ భాషను సృష్టిస్తే ఎం. వెంకట్‌ పూర్తిగా తెలంగాణ భాషనూ, కులభాషనూ వినియోగించుకొని ప్రపంచంలోని ఏ నల్లకవికీ తీసిపోని కవిత్వం సృష్టించాడు. కొన్ని ఆయన బెస్త కవితా పాదాలు: కందూరి నాడి పడికి, చెర్లమొలలకు వలపూసలు గట్టితే, ఎటవాలు కత్తిని అలుగెత్తిందని, బతుకు జాలి కింద గంగమ్మకు, పరిగెనీటి మీద పడుకున్న కోపులో, కదలిన దిక్కుల్లా ఎడబొచ్చె, అమ్మగల్లాడుతుంది నేల, ఎలుముకు చుట్టుకుంటున్న కాలంతోనే, ఎవని అడిశెనాన కొట్టుకున్రో, తేగం పేర జువాలు బోయినట్టు, చెవుల్లో ఈ డ్రెస్సులన్నీ ఎత్తేసి, జంత్రితో నడుస్తున్న మీటరు బద్దలు, చిక్కంలోంచి నన్ను నీవు- ఇలాంటివి చాలా ఇంకా మట్టాకాశాల మొదటి పుస్తకం, కాలాన్ని ముందుగానే మురక చూసే ముత్రాసి దాన్ని, కన్నీటి కళ్లాలు, బ్రహ్మమొహంలోంచి పాదాలు లాంటి కవితా పాదాలకు లెక్కేలేదు.

తెలంగాణ నాశనమైంది. కులవృత్తులు బోరున విలపిస్తున్నాయి. వడ్రంగి బాడిశె, కమ్మరి తిత్తీ, కంసాలి పొయ్యీ, కుమ్మరి సారె, సాలె మగ్గం, బెస్త వల, మాదిగ ఆరే మాయమైపోయినాయి. జనాన్ని వ్యవసాయ కూలీలుగానో, పట్నాలకు పంపి హైటెక్‌ కూలీలుగానో మార్చి వేస్తున్నది అభివృద్ధి. అటు కేంద్ర అభివృద్ధి పథకాలు గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గానీ ప్రజల సంస్కృతుల్ని పూర్తిగా మర్చిపోయాయి కాబట్టి ఒక ఘోర దారుణం జరిగిపోతున్నది. ఇక ఇప్పుడు జరగాల్సింది ఆర్థిక పోరాటాలు కాదు, సాంస్కృతిక యుద్ధాలే, రాజకీయ యుద్ధాలు. ఎం. వెంకట్‌ 'ఎన' కవితా సంపుటితో తెలంగాణ సాంస్కృతిక యుద్ధంలో ముందున్నాడు.

'ఎన' అంటే బెస్తవాని వలలోని చేపలు పడే భాగం. ఎనేస్కోని కూసున్నవంటే సిద్ధంగా ఉన్నానని అర్థం. ఎం. వెంకట్‌ ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో తెలవాలంటే ఖచ్చితంగా 'ఎన' చదవాల్సిందే. మనకర్థం గాని బెస్తపాదాల్ని ఆయననో మరో బెస్త మిత్రున్నో అడిగి తెలుసుకోవాల్సిందే.

చెరువులు ఎండిపోయి, మధ్య దళారీలు ఎక్కువయ్యి, తన కులవృత్తి నాశనమవుతుంటే, ఆకలితో, అవమానంతో లబోమని విలపిస్తున్న మామూలు బెస్తవాడు- ఎం. వెంకట్‌. 'మృగశిర కన్నీళ్లు', కట్టమైసమ్మ కండ్లల్ల మర్మంగా మబ్బులేజూసి చెర్ల మొలలకు వలపూసలు గట్టితే సినుకు సినుకులో నా గుండె గుణకారాలు, తొడలు రెక్కలు తడిసి నీటి మూలుగులైతుంటే జెండాలు పట్టుకొని చాపలు ఎదుర్రొమ్మున గుద్దె, ఎవడి వేలు ఉంగరంలో నీలిరాయి అయిందో గంగమ్మ, 'జాల': తుపాన్ని తుమిష్క చేసి విసిరిన నా వలలో మెరిసిన బంగారు పతకాలు దరికెక్కాక నా కంటి కొనల్లోంచి రాలుతున్న నత్తగుల్లలు, నా బుట్టలో రొయ్యలకు ఎగిరిపోయే డాలర్‌ రెక్కలు, బెస్తవాని దుఃఖంలోంచి పుట్టిన మహాగ్రహం- 'కడసారి మోసుకొస్తున్నాం' అనాదిగా మీ అరచేతి తీర్థంలో శవాలమై తేలినా నేలతల్లి సాక్షిగా ఎన్నో ధాన్య సముద్రాలు ఈదిన గజ ఈతగాళ్లం మేం, తరతరాల సమ్మెట దెబ్బలకు అంతరాంతరాల్లో పగిలిన మేము మోసుకొస్తున్నాం కడసారిగా మీకు తోలు తిత్తుల్లో తులసి నీళ్లు.

బెస్తవాడు సముద్రం మీదికి చాపలకు పోతే తిరిగొచ్చే వరకు నమ్మకం లేదు. నాకు తెలిసి కులవృత్తుల్లో ఇంతకంటే ప్రమాదకరమైన, సాహసోపేతమైన వృత్తి మరొకటి లేదు. ఆయన కోసం ఎదురు చూసే భార్య/ప్రేయసి కోసం రాసిన పోయెం- లైట్‌హౌజ్‌, బెస్తతల్లి 'గంగమ్మ', చేపలతట్ట మోస్తూ వంటి నిండా నీసు నింపుకొని ఉప్పు చారలతో మెరుస్తూ తీరం వెంట నడుస్తుంది సముద్రంలా, అయ్యను వెతుకుతూ తెప్పలా తేలిపోయింది అమ్మ. గుడిసెనూ, సత్తు గిన్నెల్నీ తుఫాను జప్తు చేస్తే నగరం నుంచి వచ్చిన అభివృద్ధి పథకాల వాళ్లు నష్టపరిహారం ఇవ్వడానికి 'మీకు ఏమైనా పంట భూములున్నాయా' అని అడిగితే 'లేదు సముద్రముంది' అంది అమ్మ అమాయకంగా. ఈ దేశపు కోటి సంస్కృతుల్లో ఎవడి పాదాలు నలుగుతున్నాయో చెప్పుతుంది 'బ్యాలట్‌ బాండ్‌: ఎవడెవడి ఏ వేదం మ్యానిఫెస్టో అయ్యిందో అయోధ్య సాక్షిగా మాకన్నీ తెలుసు. ఆధునికత కూతురు సైన్స్‌, దాని మొగుడు అభివృద్ధి, దాని పిల్లలు ప్రభుత్వాలూ, స్వచ్ఛంద సంస్థలూ, కాంట్రాక్టర్‌లూ- అంతా కలిసి దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీల జీవనశైలుల్నీ, సంస్కృతుల్నీ ఛిన్నాభిన్నం చెయ్యడం గురించి 'మెడ తెగిన కవి' కవితలో: గటక తాగిన మైసమ్మ, మఠంపల్లి లచ్చినర్సు, తెలంగాణ ప్రజల నమ్మకాలకూ, కోర్కెలకూ, దరిద్రానికీ, సంస్కృతికీ ప్రతీక జాన్‌పాడు సైదులు జాతర, పులిచింతల ప్రాజెక్టులో పడి మరణిస్తాయి. ఇంకా ఆయన ప్రేమ కవితలు ఊహా ఊర్వశుల జుట్టు పట్టి ఈడ్చొకొచ్చి నేల మీది మూడు రాళ్ల పొయ్యిలో పచ్చి చేపలు కాల్చి తినిపిస్తాయి.

దళిత బహుజన ఆదివాసి మైనారిటీ కవులందరికీ కవయిత్రులందరికీ ఉపయోగపడే శైలి ఈయనది. ముఖ్యంగా తన ప్రేయసి మీద రాసిన 'నీలి' కవితా శైలి, ఒక ప్రాచీన జానపద కవీ, ఒక ఆధునికాంతర కవీ కరిగిపోయి ఒకే కవయిత్రిగా మారే శైలి. ఎం. వెంకట్‌ నల్లగొండ చెరువులో కూర్చొని రాస్తున్నాడు కనుక ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. అయినా ఎం. వెంకట్‌ మన కోసం ఇంకా చాలా ప్రయోగాలు చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రయోగాలు చేయకుండా కొత్త సాహిత్యం, కళలు పుట్టవు కాబట్టి.

చివరగా- తెలంగాణ కవుల మీదా, కళాకారుల మీదా, రచయితల మీదా ఒక అదృశ్యదాడి జరుగుతున్నది. ఇది ప్రభుత్వ దాడి కంటే ప్రమాదకరమైనది. కొన్ని కులాల, ప్రాంతాల వారి సాహిత్యానికీ, కళలకీ పత్రికలు పెద్ద పీఠం వేసి తెలంగాణ రచయితల్నీ, కళాకారుల్నీ తుంగలో తొక్కుతున్నాయి.

ఇక సోకాల్డ్‌ దళిత బహుజన మేధావులూ, సాహిత్య సంస్థలూ, ఐక్య వేదికలూ వాళ్ల వాళ్ల బావుల్లో ఉండి దళిత బహుజన సాహిత్యాల్నీ, కళల్నీ ప్రచారం చేయడం లేదు. 'విరసం', జనసాహితి లాంటి సంస్థలు ఎక్కడ ఆగిపోయాయో, ఇవి కూడా అక్కడే ఆగిపోయాయి. చిట్టచివరిగా ఎవరు రాయగలరు 'ఎన'ను తెలంగాణ చెరువులో పుట్టి, చెరువులో నివసిస్తున్న ఒక బెస్తెంకన్న తప్ప. మీరు వచ్చే జన్మలోనన్నా బెస్తవానిగా పుట్టి బతికున్న చేపల కుప్పలపై బరిబాతల పొర్లాలనిపిస్తే మాత్రం ఆయన కవిత్వం చదవండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X