• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గగనాల కెగసిన గాలిదుమారం - 'రావణజోస్యం'

By Staff
|

ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వస్తూ అర్థాంతరంగా ఆగిపోయిన పెద్ద కథ 'రావణ జోస్యం' పెద్దగాలి దుమారాన్నే లేవదీస్తోంది. ఈ కథ ప్రచురణను నిలుపు చేయించిన ఘనత మత ఛాందసుల సొంతమైన సంగతి 'ఇండియాఇన్ఫో' పాఠకులకు తెలిసిందే. దేవుడిపేరు చెప్పి ఆరాధనా స్థలాలను నేలమట్టం చేసినవాళ్ళకిదో పెద్ద లెక్కకాదు. ఇలాంటి కథను ప్రచురణకు ఎంపిక చేసిన పాపానికి నామిని సుబ్రహ్మణ్యంనాయుడు లాంటి ప్రముఖ రచయిత, సీనియర్‌ జర్నలిస్టు, సంపాదకుడిపై చెయ్యి చేసుకోవడం ఈ బాపతు జనం సంస్కరస్థాయికి అక్షరాలా తగినట్లే ఉంది.

ఈ పరిణామం పట్ల బుద్ధిజీవులూ, మేధావులూ, రచయితలూ, కళాకారులూ ఖండఖండాంతరాలనుంచి స్పందించి ఖండన ప్రకటనలు జారీ చేశారు. అక్కడితో 'మొక్కుబడి' తీరిపోయివుంటే మరోసారి 'రావణ జోస్యం' గురించి రాయవలసిన పనే ఉండేదికాదు. అలా జరగకపోవడమే చిత్రం. ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రచురించలేకపోయిన ఈ కథను పుస్తకరూపంలో విడుదల చేశారు కొందరు ఔత్సాహికులు. జరిగిన సంఘటనకు నిరసనగా జరిగిన సమావేశాల్లో ఆ పుస్తకాలను పంచారు. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లోనూ అమ్మకానికి పెట్టారు. దాంతో ఈ గాలి దుమారం గగనాలకెగసింది. పరమ సౌజన్యమూర్తి డి.ఆర్‌.ఇంద్ర మేస్టారు. కానీ 'నబ్రూయాత్‌ సత్యమప్రియం' అని మాత్రం అనుకోలేదు. లోక విరోధం వచ్చి పడితే పడింది లెమ్మనుకొని యధార్ధవాదిగా ఉండేందుకే నిశ్చయించుకున్నారు.

'రావణ జోస్యం' కథ నేపథ్యం వివరిస్తూ మేస్టారు కొన్ని హెచ్చరికలు చేశారు. వాటిల్లో ముఖ్యమైనదొకటుంది. 'దౌర్జన్యం పట్ల మౌనం వహించడమంటే దౌర్జన్యాన్ని ప్రోత్సహించడమే'నని ఇంద్ర మనల్ని పహరా హుషారు చేస్తున్నారు. అలాగే 'సాంఘిక చైతన్యం, ఆత్మగౌరవం లోపించిన జాతికి భవిష్యత్తు శూన్యం' అని మేస్టారు మనకో చేదు నిజం చెప్పారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ''దాడులూ, దౌర్జన్యాలూ చేసి రచయితలూ, కళాకారులు సమాజ వాస్తవాల్ని ప్రజలకి తెలియచెయ్యకుండా వాస్తవాల పీక నొక్కెయ్యగలం అనుకోవడం ఓ భ్రమ'' అని ఇంద్ర ఢంకా బజాయించి మరీ చెప్పారు. అందుకు ఆయన్ను అభినందించి తీరాల్సిందే.

పోతే, 'రావణ జోస్యం' కథ విషయంలో ఎందుకింత రభస జరుగుతుందో అర్ధం కావడం లేదని ఆశ్చర్యం ప్రకటించిన మిత్రులు కూడా ఉన్నారు. ఇరవయ్యో శతాబ్దపు చిట్టచివరి సంవత్సరంలో వచ్చిన కథ 'రావణ జోస్యం'. కానీ ముద్దు కృష్ణ 'అశోకం', కొడవటిగంటి కుటుంబరావు 'అశోకవనం' వచ్చి దాదాపు ఆరేడు దశాబ్దాలు కావస్తోంది కదా! అలాగే దాదాపు పాతికేళ్ళ కిందటే రంగనాయకమ్మ - గాంధీ కలిసి ఇదే ఆంధ్రజ్యోతి వీక్లీలో 'ఇలాగే జరిగింది', 'ఇదీ రామాయణం' పేరిట రెండు పెద్ద కథల్లాంటివి రాసిన సంగతీ, వాటి ప్రాతిపదికమీదే రంగనాయకమ్మ 'రామాయణ విషవృక్షం' రూపొందిన సంగతీ కూడా చాలామందికి తెలిసినవే.

'రావణ జోస్యం' లాంటి చిన్న పుస్తకానికి రెండు ముందు మాటలు రాయించిన ప్రచురణ కర్తలు గర్వించదగిన ఈ గతాన్ని కూడా ప్రస్తావించిఉంటే మరింత బాగుండేది. ఈ కథలోని 'సాహిత్యవిలువలు' గురించి చర్చించడానికిది సరైన సమయం కాదు. అయితే ముద్దు కృష్ణ, కుటుంబరావు, రంగనాయికమ్మల రచనలకు మించిన విలువలేమీ ఇందులో లేవనే చెప్పాలి. ఆరకంగా చూస్తే 'రావణ జోస్యం' టిపికల్‌, మీడియోకర్‌ రచన మాత్రమే. ఆమాటకొస్తే తెలుగులో కానీ, మరేఇతర ప్రాంతీయ భాషలోకానీ వచ్చిన ఏ రామాయణం తీసుకుచూసినా అందులో 'అవాల్మీకం' అనిపించే పోకడలు పదులు వందల సంఖ్యలో కన్పిస్తాయి. వాటినన్నింటినీ కూడా 'సరిదిద్దడం' సాధ్యమయ్యే పనేనా? అంతకుమించి అలా చేయడం వల్ల ఆయా రచనలకు గాని, భాషలకు గాని, మన సంస్కృతికి గానీ మంచేమన్నా జరుగుతుందా? ఈ విషయాలని ఒక్కసారి అందరూ ఆలోచించాలి.

"రావణ జోస్యం కథ గురించి కొంచెం" అంటూ ఏడు పేజీల్లో చలిచీమల్లాంటి అక్షరాలతో ముందుమాట రాసిన వైశాలిగారు కాస్తంత బ్యాలెన్స్‌ అలవర్చుకోవడం అత్యవసరం. కుక్కలనూ పతివ్రతలనూ ఒకే గాటన కట్టి విరుచుకుపడ్డం - అటు కుక్కల పరంగా చూసినా, ఇటు పతివ్రతల పరంగా చూసినా ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఫెమినిస్టుల జార్గన్‌ వాడక తప్పడం లేదు, మన్నించండి-పతివ్రతలు పురుషభావజాలం ప్రభావంలో పడి ఉన్న బాధితులని వైశాలిగారికి కొత్తగా నేర్పించాలా? వాళ్ళమీద పెంచుకోవలసింది కంటెంప్ట్‌ కాదని ఆమెకి బోధించాలా? ఆగ్రహాన్నయినా, ఆదర్శాన్నయినా, ఔచిత్యానికి, హద్దులకీ లోబడే ప్రదర్శించడం పరిణతి అనిపించుకుంటుంది. ఇంద్ర మేస్టారు తమ 'బాస్‌'కి ఈ విషయం వివరించగలరు.

పోతే మరో విషయం - మేస్టారు తను సమకూర్చిన నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం లాంటి విషయాలు ప్రస్తావిస్తూ "ఎంతో ఘన చరిత్ర కలిగిన" ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆ విలువలకు కట్టుబడనందుకు చింతించారు. "తన పత్రికా స్వాతంత్య్రాన్నీ, ఆత్మగౌరవాన్నీ తానే ఉరితీసుకు"న్నందుకు ఆయన ఆ పత్రికపై జాలి పడ్డారు కూడా. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలను జ్ఞాపకం చేసుకోవలసి వుంది. దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం మాట. పాలగుమ్మి పద్మరాజుగారు రాసిన 'రామరాజ్యానికి రహదారి' అనే సీరియల్‌ ఆంధ్రజ్యోతి వీక్లీలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. సదరు సీరియల్‌లో వినోదాత్మకత, జనరంజకత్వం లోపించినట్లు పాఠకులు బావించి నిరసించిన కారణంగానే జ్యోతివీక్లీ యాజమాన్యం ఆ నవల ప్రచురణను మధ్యలోనే ఆపేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత అది ఎమెస్కో ప్రచురణగా వచ్చి అపారమైన ఆదరణకు పాత్రమైంది. అది వేరే విషయం. పోతే పది పదిహేనేళ్ళ కిందట అదే పత్రిక గుంటూరు శేషేంద్రశర్మ రాసిన 'కామోత్సవ్‌' సీరియల్‌ను నడిమధ్యలో నిలిపేసింది.

అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ సీరియల్‌ ప్రచురణకు వ్యతిరేకంగా పెద్ద గొడవే జరిగింది. ధనికవర్గాల సెక్స్‌ సరదాలు, డ్రగ్స్‌ - తాగుడు వ్యసనాల గురించి ఈ సీరియల్‌లో 'యుగకవి శేషేంద్ర' సవిస్తరంగా రాసిన సంగతి పాఠకులకు తెలుసు. అది మరీ అవధులు మించిపోయిందన్నది 'అరసం' అభ్యంతరం. మొత్తానికి 'కామోత్సవ్‌' కూడా అర్ధాంతరంగా నిల్చిపోయింది. ఇప్పుడు 'రావణజోస్యం' కూడా ఈ కోవకే చేరుకుంది. మెజారిటీ ప్రజల మనోభావాలు తనకు మాత్రమే తెలిసినట్లు భావించే ఒక వర్గం చేసిన రభస ఈ పరిణామానికి దారి తీసింది. మొత్తంమీద పాఠక జన సందోహమే కానీండి, రచయితల సంఘాలే కానీండి, మత ఛాందసులే కానీండి, బాహ్యశక్తులు మన పత్రికల యాజమాన్యాలను ప్రభావితం చేయడమనే దురాచారం క్రమేపీ పాతుకుపోయింది. 'రావణజోస్యం' ఎపిసోడ్‌ ఇందుకు తాజా నిదర్శనం మాత్రమే.

ఇది ఒక్కరోజులో ఏర్పడిన పరిస్థితి కాదు. ఒకే దెబ్బతో దీన్ని తుడిచిపెట్టేయడం సైతం సాధ్యంకాక పోవచ్చు. ఈ పరిణామం రచయితల, జర్నలిస్టుల, పత్రికల యాజమాన్యాల సొంత వ్యవహారం కానేకాదన్న అవగాహన ఏర్పడవలసి వుంది. 'కుహనా లౌకికవాదం' అనే వంకర సమాసాన్ని అడ్డం పెట్టుకొని ఈ అవగాహన మీద దాడికి తెగించేవాళ్ళను సాంస్కృతిక సాధనాల ద్వారా నిరోధించాల్సి వుంది. ఈ తరహా దాడులకు రామాయణంతో గానీ, సాహిత్యంతోగానీ దూరపు చుట్టరికం కూడా లేదు. నామిని మీద చెయ్యి విసిరిన భుజబలోద్ధతుల్లో ఎంతమంది నిజంగా రామాయణం చదివారు? 'రావణజోస్యం' లాంటి అసాధారణ రచనను అంచనా వేసే సామర్థ్యం వాళ్ళలో ఒక్కరికయినా ఉందంటారా? అన్నిటికీమించి ఆంధ్రజ్యోతి సంపాదకవర్గం విజ్ఞతకన్నా ఈ బలగర్వితుల విచక్షణ మెరుగయినదనడానికి ఏమైనా ఆధారాలున్నాయా? - ఇవీ తెలుగు రచయితలు సాహిత్యోపజీవులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు. ఈ చర్చలో పాల్గొని మీరూ మీ అభిప్రాయం చెప్పండి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more