వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీవాద పరిమితులు

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం ఒక ఉప్పెనలా వచ్చింది. విప్లవ సాహిత్యోద్యమంపై స్త్రీవాద సాహిత్యం ప్రశ్నలు సంధించింది. సమాజంలోని స్త్రీ వివక్షపై ప్రశ్నలు వేసింది. తన ఐడెంటిటీని నిలబెట్టుకుంది. అయితే, దీనికీ పరిమితులున్నాయనే విషయం గుర్తించడం నేటి అవసరం. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదానికి రెండు అంశాల్లో పరిమితులున్నాయి. ఒకటి- ప్రస్తుతం చెలామణి అవుతున్న స్త్రీవాదంతో పల్లె స్త్రీలకు పాత్ర లేకపోవడం, వారి సమస్యలను పట్టించుకోకపోవడం. రెండు- తెలంగాణా స్త్రీల పాత్ర ప్రస్తుత స్త్రీవాద సాహిత్యంలో నామమాత్రం కావడం. మొదటి అంశం విషయంలో ఇప్పటికే కొద్దో గొప్పో చర్చ జరిగింది. రెండో అంశం విషయంలో ఇప్పుడిప్పుడే ఆలోచన మొదలైంది. తెలంగాణా సాంస్కృతిక, సామాజిక మూలాలు కోస్తాకు భిన్నమైనవనే ఆలోచన పదును దేరిన తర్వాత ఈ ఆలోచన మొదలైంది. ఇందుకు తగినట్లుగానే స్త్రీవాద సాహిత్యంలో తెలంగాణా స్త్రీల పాత్ర చాలా తక్కువ. ఉన్న ఒకరిద్దరు కూడా కోస్తాంధ్ర స్త్రీల వాదనలను, వారి ప్రయోజనాలను కాపాడేవారిగానే మిగిలిపోయారు.

నిజానికి, స్త్రీవాద సాహిత్యం తెలుగులో ఇప్పటి వరకు నెరవేర్చిన ప్రయోజనం ఏమిటనే ప్రశ్న వేసుకుంటే ప్రాంతీయ ఆలోచన ఆవిర్భావానికి గల కారణాలేమిటో అర్థమవుతాయి. కారణాల గురించి ఆలోచించే ముందు ప్రస్తుత స్త్రీవాద ప్రయోజనం ఏమిటి? దీనికి ప్రాతిపదిక ఎక్కుడుంది అనే ప్రశ్నలు కూడా వేసుకోవాలి. ఆధునిక వచన సాహిత్యం మొదలైన తర్వాత కోస్తా తెలుగు కథా రచయితలు, నవలాకారులు తెలుగు సమాజంలో స్త్రీ విద్యావంతురాలు కావడం, ఉద్యోగాలు చేయడం గురించి మాట్లాడుతూ వస్తున్నారు. స్త్రీ స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. గోపీచంద్‌ వంటి రచయితలు ఈ రోజు స్త్రీవాద రచయితల కన్నా ముందుకు వెళ్లి రచనలు చేశారు. స్త్రీ స్వేచ్ఛ గురించి ఆయన అప్పుడే తమ కథల్లో మాట్లాడారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్పు చెందడాన్ని కోస్తా వచన సాహిత్య ప్రక్రియ బోధిస్తూ వచ్చింది. స్త్రీకి ఉన్న సంకెళ్లను తెంపేస్తూ వచ్చింది. సమాజంలో స్త్రీ మొబిలిటీ అవసరాన్ని అది నొక్కి చెప్పుతూ వచ్చింది. సామాజిక అవసరాల దృష్ట్యా, కుటుంబ అవసరాల దృష్ట్యా స్త్రీని కుటుంబం నుంచి బయటి ప్రపంచంలోకి తెచ్చే ప్రయత్నం ఆ సాహిత్యంలో జరిగింది. నవల, కథ అనేవి ఆధునిక ప్రక్రియలు కాబట్టి అధునిక సమాజం అందించిన అవకాశాలను తెలియజేసే ఆ అవకాశాలను అందుకోవడానికి ఈ ప్రక్రియలు స్త్రీ స్వేచ్ఛను తెలియజెప్పే మంచి సాధనాలయ్యాయి. మధ్య తరగతి చదువుకున్న స్త్రీలకు అవి చేరాయి. స్త్రీ తన కాళ్ల మీద తాను నిలబడాల్సిన అవసరాన్ని అవసరాన్ని ఇవి చెప్పాయి. ఇందుకు ఆటంకాలుగా వున్న జెండర్‌ ప్రాధాన్యాన్ని ఈ రచనలు తగ్గిస్తూ వచ్చాయి. ఇందులో భాగంగా సెక్స్‌ స్వేచ్ఛ గురించి మాట్లాడాయి.

ఒక స్త్రీ అవివాహితురాలిగా సెక్స్‌లో పాల్గొంటే పెద్ద తప్పు పట్టాల్సిన పని లేదని వ్యాఖ్యానించాయి. వి. రాజారామమోహన్‌ రాయ్‌ కథలను ఈ కాంటెస్ట్‌లోనే చూడాల్సి వుంటుంది. మామూలుగా చూస్తే కొంత సెక్స్‌ను కలబోసిన కథలుగా ఇవి కనిపిస్తాయి. కానీ, అవి ఇచ్చే సందేశం స్త్రీల నిత్య జీవన మనుగడకు సంబంధించింది. సమాజంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, పైమెట్లు ఎక్కడానికి సెక్స్‌ అవసరాలను కట్టుబాట్లకు భిన్నంగా తీర్చుకున్నా ఆమోదయోగ్యమేనని ఆయన తన కథల్లో చెప్తారు. కోస్తాంధ్ర సాహిత్యంలో ఇదొక ట్రెండ్‌. ఇంత వరకు స్త్రీ గురించి పురుషుడు మాట్లాడాడు. ఇదంతా స్త్రీల గురించి రాసినప్పటికీ పురుషుడు పురుషుడికి ఉద్దేశించిన సాహిత్యమే. సమాజంలో స్త్రీ ఎదుగుదలకు ఆటంకం కుటుంబంలోని పురుషులు. కుటుంబంలోని పురుషుడు తన కుటుంబానికి చెందిన స్త్రీ నలుగురిలో తిరిగితే బాధపడే స్థితి నుంచి బయట పడాలి. స్త్రీ విషయంలో పురుషుడు తన మానసిక సంకెళ్ల నుంచి బయట పడ్డానికి ఈ సాహిత్యం పని చేసింది. ఇప్పుడు స్త్రీలు తమ గురించి తామే మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్త్రీలే తమ గురించి తాము మాట్లాడడానికి ఇటువంటి సాహిత్యమంతా ఒక భూమికను తయారు చేసింది. ఇప్పుడు స్త్రీలు సెక్స్‌ స్వేచ్ఛ గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు.

సెక్స్‌ కట్టుబాట్ల నుంచి స్త్రీ బయట పడితే, ఒక రకంగా స్త్రీత్వం నుంచి బయట పడితే అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు దూకవచ్చు. ఇప్పుడు జరుగుతున్నదదే. వైవాహికేతర సంబంధాలు తప్పు కాని స్థితి ఒకటి ఒక ప్రాంతానికి చెందిన వారిలో స్థిరపడి పోయింది. స్త్రీలు సాహిత్యంలో సెక్స్‌ స్వేచ్ఛ గురించి మాట్లాడ్డం తగ్గి సమాజంలో వారి స్థానం గురించి మాట్లాడే స్థితి వచ్చేసింది. అంటే, దీన్ని రాయప్రోలు సుబ్బారావు 'అమలిన శృంగారం' సిద్ధాంత ప్రతిపాదన నుంచి చలం రచనలకు ఆచరణలో పరిణామంగా చూడాలి. స్త్రీ తప్పని సరిగా బయటి సమాజంలో కాలు పెట్టాల్సి రావడం, దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను అధిగమించడానికి మానసికంగా సంసిద్ధులు కావడం కోసం కోస్తా ప్రజలు తమ కోసం తాము సృష్టించుకన్న సాహిత్యంగా దీన్ని చూడాల్సి వుంటుంది. ఇదే సమయంలో ఇది ఇతర ప్రాంతాల వారి దృష్టిలో ఒక 'లెజిటమసీ'ని కల్పించుకోవడం కోసం జరిగిన ప్రయత్నం కూడా. కోస్తా స్త్రీలు సమాజంలో ఎదిగిన స్థాయికి పురుషులు కూడా ఎదగలేదు. అందుకే స్త్రీవాదంపై జ్వాలాముఖి వంటి వారు నిప్పులు కక్కారు. ఒక రకంగా ఇది వారి పురుష అహంకారం కాదు. వారి 'వెనుకబాటుతనం'. సమాజంలో ఎదగడానికి, అవకాశాలను అందుకోవడానికి స్త్రీవాదం ఒక సాధనమనే విషయం స్ఫురణకు రాకపోవడం.

తెలంగాణాలో ఈ పరిస్థితి లేదు. స్త్రీవాదం గురించి మాట్లాడే స్త్రీ రచయితలు ఒకరిద్దరు కూడా కోస్తాంధ్ర స్త్రీవాదుల వరుసలో చివర నిలబడ్డారు. ఇదే సమయంలో తెలంగాణా పురుష రచయితలు కొంత మంది ఇంకా విప్లవోద్యమ సాహిత్యం దగ్గరే వుండిపోతే కోస్తా స్త్రీ రచయితలతో గొంతు కలిపారు. దీనికి సాంస్కృతిక, సామాజిక అంతరాలు కారణం. విద్య అనేది కోస్తాలో చాలా ముందుగా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది పాఠకులను ఉద్దేశించిన వచన సాహిత్య ప్రక్రియ కూడా అక్కడి నుంచే విరివిగా వెలువడింది. ఇప్పుడు కోస్తాలో ఈ విధమైన సాహిత్యం నిర్వర్తించాల్సి పాత్ర ఎంత మాత్రమూ లేదు. దీంతో వారి కార్యరంగమంతా తెలంగాణాకు మారింది. వారి అవసరాల కోసం ఉద్దేశించిన స్త్రీవాద సాహిత్యాన్ని ఇక్కడ పురుష విమర్శకులు భుజాన మోస్తున్నారు. ఆ మేరకు వీరికి ప్రయోజనాల్లో కొంత వాటా దొరికితే దొరకవచ్చు. ఇందుకు అనుగుణంగానే స్త్రీల కోసం పని చేసే ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జివోలు) ఇక్కడే ఎక్కువగా తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. వీరు చేసే పనిలో ప్రాంతీయ వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంటుంది. ఇటీవల అస్మిత అనే సంస్థ అచ్చు వేసిన 'మహిళావరణం' అనే బృహద్గ్రంథం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఈ స్థితిలో కోస్తా స్త్రీవాదుల సమస్యలు, తెలంగాణా స్త్రీల సమస్యలు ఒక్కటి కావనే విషయం ఇక్కడి స్త్రీ రచయితలు, పురుష రచయితలు, విమర్శకులు గుర్తించాల్సిన అవసరం వుంది.

అంతేకాకుండా, కోస్తా స్త్రీలు స్త్రీకి సెక్స్‌ స్వేచ్ఛ గురించి, కుటుంబం నుంచి విముక్తి గురించి మాట్లాడుతుంటే తెలంగాణా రచయితలు చాలా మంది విప్లవ కథలు రాస్తూ పోయారు. (మొదటి నుంచి తెలంగాణా కథ తెలంగాణాలోని సామాజిక సంబంధాల గురించి, ఉద్యమాల గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చింది. సమాజంలో పైమెట్లు అధిరోహించడానికి అవసరమైన మధ్యస్థ సాహిత్య సృష్టి చాలా తక్కువగా జరగింది) ఈ పరిధిలోనే వారు తమ సాహిత్య సృష్టి చేసే ప్రయత్నం చేశారు. పురుషులు కూడా స్త్రీపురుషుల మధ్య వైవాహికేతర సంబంధాల గురించి కోస్తాతో పోల్చుకుంటే 'వెనుకబాటు తనాన్నే' ప్రదర్శించారు. అల్లం రాజయ్య 'అతడు' కథలో నక్సలైట్‌ లీడర్‌కి, అతన ద్వారా చైతన్యం పొందిన మహిళకు మధ్య పెరిగిన మానసిక సాన్నిహత్యం గురించి మాత్రమే రాశారు. ఇరువురి మధ్య సెక్స్‌ సంబంధం వుందనే విషయాన్ని ఆయన రాయలేదు. ఒక రకంగా కోస్తా రచయితల దృష్టితో చూస్తే ఇది తప్పే. కానీ, తెలంగాణా రచయితలు మానసికంగా అందుకు ఇంకా సిద్ధపడలేదనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. అలాగే, తుమ్మేటి రఘోత్తమరెడ్డి 'పనిపిల్ల' కథపై వివాదం చెలరేగడం కూడా ఈ దృష్టితోనే చూడాలి. (పనిపిల్ల కథ స్త్రీవాదానికి వ్యతిరేకమైందనే వివాదం చెలరేగింది). ఈ దృష్ట్యా తెలంగాణా వచన ప్రక్రియల్లోని స్త్రీపురుష సంబంధాలను, స్త్రీ పాత్రలను, సామాజిక సంబంధాలను కొత్త కోణం నుంచి అధ్యయనం చేయాల్సి వుంటుంది. తమను తాము వెతుక్కోవడానికి, తమ ఐడెంటిటీని అన్వేషించడానికి తెలంగాణా రచయితలు ప్రయత్నించాల్సి అవసరం వుంది. ఈ దిశగా రచనలు చేయాల్సిన అవసరం వుంది. కోస్తా స్త్రీవాదుల వెంట నడిస్తే చివరకు మిగిలేది ఏమీ వుండదు. వారి ప్రయోజనాల కోసం గొంతు కలపడం మాత్రమే అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X