• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాఠకుల రచయిత పతంజలి

By Staff
|

తెలుగు సాహిత్యంలో రాజకీయాలకు కొదవ లేదు. ముఠాలకు కొదవ లేదు. వీటిని ముఠాలనకూడదని ప్రముఖ కవి కె. శివారెడ్డి లాంటి వారు పదే పదే చెప్పుతుంటారు. కానీ, పరిస్థితి మాత్రం ఏ మాత్రం ఆరోగ్యకరంగా లేదు. ఆరోగ్యకరం కానప్పుడు శిబిరాలు పేర ఏర్పాటవుతున్న గ్రూప్‌లను ముఠాలనే పిలవాల్సి వుంటుందనేది కొందరి నిశ్చితాభిప్రాయం. ప్రచారార్భాటాలు కూడా మెండు. ఈ ప్రచార ఆర్భాటాలకు దూరంగా వుండే అతి కొద్ది మంది తెలుగు రచయితల్లో కె.ఎన్‌.వై. పతంజలి ఒక్కరు.

పతంజలి ఎన్నో కథలు, నవలలు, నవలికలు రాశారు. ఆయన రచనలు సమాజానికి చేదు మాత్రలు. తన వ్యంగ్య వైభవంతో నవ్విస్తూనే కంట తడి పెట్టించే అతి కొద్ది మంది రచయితల్లో పతంజలి ఎన్నదగినవారు. ఆయన జర్నలిస్టు జీవితాలపై 'పెంపుడు జంతువులు' నవల రాశారు. పోలీసులపై 'ఖాకీవనం' అనే నవల రాశారు.

పోలీసుకు తెలుగు సమాజంలో 'ఖాకీ' పర్యాయ పదం కావడానికి ఈ నవలే కారణం. అంత పదునైన రచనలు ఆయనవి. ఆయనది 'చూపున్న పాట' అనే కథాసంకలనం అచ్చయింది. 'పతంజలి భాష్యం' కొందరికి నిత్య పఠనీయ గ్రంథం కొందరికి. వివిధ ఆంశాలపై ఆయన ప్రతిస్పందనలను పదునైన భాషలో, తెలుగు నుడికారంలో, వ్యంగ్య వైభవంతో రికార్డు చేసిన పుస్తకం ఇది.

ఇవన్నీ ఒక ఎత్తయితే, 'వీరబొబ్బిలి', 'పిలక తిరుగుడు పువ్వు', మరో నవలిక సమాజంపై విసిరిన తీయని కత్తులు. తెలుగు సమాజంలోని అనేకానేక 'జబ్బులను' సమర్థంగా వ్యక్తీకరించి, పాఠకులను నవ్విస్తూనే కంట ఆలోచనల తెరను లేపే రచనలివి. పోలీసు, న్యాయవ్యవస్థలను ఆయన తన వ్యంగ్య వైభవంతో ఎండ గట్టిన రచనలివి. పత్రికారంగంపై కూడా విసుర్లున్నాయి. 'దెయ్యం ఆత్మకథ' గురించి చెప్పనే అవసరం లేదు. చాలా మంది ఈ కథలకు భుజాలు తడుముకున్నారు. హిపోక్రసీ అంటే పతంజలికి మంట. మనుషుల హిపోక్రసీ, అబద్ధపు జీవితాల గుట్టు రట్టు చేశారు పతంజలి.

రావిశాస్త్రికి తెలుగు సాహిత్యంలో ఇద్దరే వారసులున్నారు. ఒకరు- బీనాదేవి, మరొకరు- పతంజలి. బీనాదేవి రావిశాస్త్రి కన్నా ముందుకు వెళ్లలేకపోయారు. అయితే, గరువును మించిన శిష్యుడు పతంజలి. రావిశాస్త్రిని దాటి ఎదిగిన రచయిత ఆయన. రావిశాస్త్రి అంటే పతంజలికి ఎనలేని అభిమానం. అయితే, పతంజలి రచనలను పెద్దగా విశ్లేషించనవారు లేరు తెలుగులో. దానికి కారణం తెలుగులో సాహిత్య విమర్శ ఎదగాల్సినంత ఎదగలేదు. పతంజలి రచనలు అర్థం కాకపోవడం వల్ల విశ్లేషణలు రాలేదనే విషయాన్ని పతంజలి అంగీకరించరు. 'మనకున్న విమర్శకులే తక్కువ' అని ఆయన అన్నారు. ఒక్కో రచయితవి, కవివి రెండేసి, మూడేసి ఇంటర్వ్యూలు అచ్చయ్యాయి. కానీ పతంజలి ఇంటర్వ్యూలు అచ్చు కాలేదు. కొందరు ఇంటర్వ్యూ కూడా చేశారాయనను. కానీ, అవి అచ్చు కాలేదు. దీనికి కారణమడిగితే- 'నేను జర్నలిస్టు కావడం వల్లనేమో' అని ఆయన జవాబిచ్చారు. ఆయన 'ఉదయం' దిన పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. ఇంకా చాలా పత్రికల్లో పని చేశారు. ఒక సాహిత్యకారుడికి జర్నలిజం కూడా అడ్డం వస్తుందనేది పతంజలి ఉదంతం తెలియజేస్తోంది.

ఈయన రచనలు తప్పకుండా చదివి తీరాల్సినవి. ఆయన విమర్శకులకు దూరమైన సామాన్య పాఠకులు మరీ చేరువ. ఒక రచన చదివితే అన్నీ చదివి దాకా వదలలేం. ఆయన రచనల గొప్పతనం. ఆయన పాఠకులు రచయితే గాని విమర్శకుల రచయిత కారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X