వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-14

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రమాదంలో పడడం వేరు, ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వేరు. రాంరెడ్డి ప్రమాదాలను కొని తెచ్చుకునే రకం. చెరువు నిండి మత్తడి దంకినట్లుగా అతని గుండెలోని ఆవేశం పెదవులు దాటి పదునైన కత్తుల్లా దూసుకొస్తుంది. ఇదే చాలా మందికి రుచించని విషయం. నిజం నిష్టూరంగా ఎందుకుంటుందో, అది జీవితాన్ని ఎలా దగ్ధం చేస్తుందో తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకున్నాడు రాంరెడ్డి. చాలా సార్లు ఆవేశాన్ని అణచుకోవాలని, తన ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అనుకుంటాడు. చాలా వార్తావ్యాఖ్యలు వ్యాసాలు రాయకూడదని అనుకుంటాడు. ఏ క్షణంలో భూతం ఆవహిస్తుందో తెలియదు గానీ పదాలు ఈటెల్లా కాగితం మీద పరుచుకుంటూ ఉంటాయి.

జీవితంలో పైకి రావడానికి తన ఆవేశం పెద్ద అడ్డంకి అని ప్రతిసారీ అనుభవంలోకి వస్తున్నదే. అనుభవాల నుంచి కూడా నంగి నంగి మాట్లాడడం, అబద్ధాలను తేనె పూసి చెప్పడం అలవాటు కాలేదు. తన పుట్టుకే అటువంటిదని అతను బాధపడుతూ వుంటాడు. అదే నేరం రాజిరెడ్డి వద్ద చేశాడతను.

''అందె నారాయణ మా పార్టీ సభ్యుడని విప్లవ పార్టీ ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చింది? అలా ప్రకటించిన వెంటనే ఎలుకలు పిల్లిని చూసి కలుగుల్లోకి దూరినట్లు జనాలు ఇండ్లలోకి ముడుచుకుపోయారు కదా! ఇది ఉద్యమానికి నష్టమా, లాభమా?'' అని అడిగాడు రాంరెడ్డిని రాజిరెడ్డి. మాటలు నిప్పురవ్వల్లా వున్నాయి. తనదే సత్యమనే అహంకారం కూడా రాంరెడ్డికి లేదు. తన విషయాల మీద చర్చ జరిగి ఒక మహత్తర సత్యం వెలుగు చూస్తుందనే గుడ్డి నమ్మకం కూడా అతనికి లేదు. తనకున్నవన్నీ సందేహాలే. పాత సందేహాలకు తోడు కొత్త సందేహాలు పుట్టుకొస్తుంటే ఊపిరాడని స్థితిలో అతనున్నాడు. ఇప్పుడు తెలంగాణ వేదిక మరోసారి తనను చీకటి గదిలో బంధించి ఊపిరాడనీయడం లేదు. ఆ ఊపిరాడనీయని స్థితిలోనే రాజిరెడ్డి వద్ద తన నెత్తుటి మడుగులను పరిచాడు. వాటిని తొక్కుకుంటూ అతను వెళ్లిపోతుంటే రాంరెడ్డిలోని శక్తి యావత్తూ ఎవరో ఎత్తుకుపోయారనిపించింది.

అతని వెనకే నడుస్తూ- ''ఇండిపెండెంట్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్స్‌ని ఎందుకు బతకనీయరు?'' అని అడిగాడు. అతని మాట అతనికే వినిపించినట్లు లేదు. గొంతెండిపోయి మాట పెగలడం లేదు. నడుస్తున్న బాట అంతటా నెత్తురు మడుగులు కట్టిన దృశ్యాలు. ఒక కల, ఒక వాస్తవం- అంతా కలిసి ఒక అర్థం కాని మోడర్న్‌ ఆర్ట్‌. అర్థం లేకపోవడమేమటి, ఇదంతా మరో ప్రపంచావిష్కరణను కళ్ల ముందు నిలబెడుతుంటే అంటారు. కానీ తనకే ఏదో సందేహం. సందేహాలు మొలకలెత్తడమే తప్పయిపోయిన సమాజంలో ఒంటరిగా అతను. అటో ఇటో తేల్చుకోలేని సందిగ్దత. అలా ప్రకటించడం క్రెడిట్‌ ఎక్కడ పోతుందో ఆతురత, తొందరపాటు కాదా అనేది రాంరెడ్డి సందేహం. అన్ని సందేహాల మాదిరిగానే ఇది కూడా జవాబు దొరకని సందేహం.

అప్పుడెప్పుడో అశోకా థియేటర్‌ హాల్‌లో తెలంగాణపై చర్చగోష్టి నిర్వహించడంతో ప్రారంభమైన ఊపు భువనగిరి, వరంగల్‌ సభలతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇప్పుడు దానికి స్పీడ్‌బ్రేకర్లు అడ్డు. తెలంగాణ ఉద్యమానికి ప్రజాస్వామికమనే తోక వచ్చి ప్రయాణం ఆగిపోవడమనేది అతనికి రుచించడం లేదు.

ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు ఉన్న పరిమితులేమిటి, అదెలా సుదీర్ఘ సాయుధ పోరాటంలో భాగమే గానీ, ప్రజాస్వామిక ఉద్యమాల్లో భాగం కాదని, జార్ఖండ్‌లానో, ఛత్తీస్‌ఘడ్‌లాగానో ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడానికి పనికొచ్చేది కాదని పెద్దగా విశ్లేషణ అవసరం లేకుండానే అర్థమైపోయింది. దాంతో గుండె కోత. అదే విషయాన్ని రాంరెడ్డి తాను పని చేస్తున్న పత్రికకు విశ్లేషణాత్మకంగా రాశాడు. ఇంకేముంది? ఎంత మంది అతనిపై పండ్లు పటపట కొరికారో, ఎందరు కనపడకుండా ఉరితాళ్లు సిద్ధం చేశారో తెలుసుకోలేకపోయాడతను. మాట్లాడకుంటే గుండె మంట, మాట్లాడితే ఎదుటివారితో పగ. అది మామూలు పగేం కాదని చాలా రోజుల తర్వాత అనుభవంలోకి వచ్చింది. పెయ్యంతా చీరుకుపోయి రక్తమోడుతున్న బాధ. తాను నడుస్తున్న తోవంతటా రక్తం చుక్కలు రాలుతున్న వెత. దీనికి ఆది లేదు, అంతం లేదు. గుక్క పట్టి ఏడ్వడం తప్ప మిగిలిందేమిటి? అది వొడ్సిపోయేది కాదు.

సలసల కాగుతున్న రక్తకాసారం. ఒలికి కుండలకొద్దీ రక్తం ఎండిపోకుండానే మరో గాయం. తాను నడుస్తున్న తోవంతా గాయాల తోవే. రక్తం మడుగులు దాటుకుంటూ హైదరాబాద్‌ నుంచి ఊరికో, ఊరి నుంచి హైదరాబాద్‌కో తిరగడం ఎంత బాధాకరం. అలా తాను ప్రయాణిస్తున్న బస్సో, టూ వీలరో ఆ ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి దిగుతుంటే ఎప్పటికీ మాసిపోని జ్ఞాపకం. గాయం సలుతుంటే ఎక్కడమూ దిగడమూ. దాని మీంచి అటో ఇటో చేరుకున్నాక వారం రోజులు కలవరింతలు, పలవరింతలు, వంద డిగ్రీల జ్వరం. మెదడు పట్టని గుండె బాధ. గుండెకు పట్టని మెదడులోని పురుగులు.
................ ............................. ......................................

చీకట్లో దూసుకొస్తున్న కాన్వాయ్‌.
సొంత వూరి నుంచి రాజధాని నగరానికి పయనం. వాహనాల హెడ్‌లైట్లతో చీకట్లను చీలుస్తూ ఆ ప్రయాణం.
ఆ కాన్వాయ్‌లోని ఏ కారులో మంత్రి ఉన్నారో కూడా తెలియని కట్టుదిట్టమైన ఏర్పాట్లు.
ఎవరూ ఎలా ఉన్నారో, ఎవరు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియదు. కానీ రాజధానికి తొందరగా చేరుకోవాలనే ఆతురత మాత్రం అందరి ముఖాల్లోనూ కనిపిస్తున్నది.

ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిర్ణీత వ్యవధి కన్నా రెండు గంటలు ఆలస్యం. యాదగిరిగుట్టలో తప్పనిసరై ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి రావడం వల్ల ఈ జాప్యం.

హోం మంత్రి వద్దని మరో శాఖను తీసుకున్నాక కొంత రిలీఫ్‌.

తాను చదివిన బోనగిరి రోడ్డుకిరువైపులా చూస్తూ. బోనగిరి గుట్టను ఒకసారి ప్రేమగా చూపులతోనే పలకరిస్తూ మంత్రి. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన బోనగిరి అనుభవాలను నెమరేసుకుంటూ... గతమంతా కళ్ల ముందు కదులాడుతుంటే గమ్మత్తైన మత్తు. మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుండనని అనుకుంటూ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X