• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీశ్రీ సొంతగొంతులో 'మహాప్రస్థానం'

By Staff
|

తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ వేసిన ముద్ర, ప్రభావం సామాన్యమైనవి కావు. తాను రాసిన భావకవిత్వాన్ని 'ప్రభవ' గా ప్రచురించినా, అదే పద్ధతిలో కవిత్వం కొనసాగించినా శ్రీరంగం శ్రీనివాసరావు ఏ సంప్రదాయవాదిగానో, మరోలాగో, మిగతా కవుల్లో కలిసిపోయి వుండేవాడు. టైఫాయిడ్‌ జ్వరం రావడమో, తాను పడిన కష్టాలో, తన కవిత్వం ప్రజల్లోకి వెళ్లాలనో, కవిగా పేరు తెచ్చుకోవాలనో, ఎలాగ భావించినా 'మహాప్రస్థానం' వల్లనే తన ప్రత్యేకతను నిలుపుకోగలిగాడు శ్రీశ్రీ.

'మహాప్రస్థానం'లో ఉన్న భాష సరళమైంది కావడం, వస్తువు కార్మిక, కర్షక వర్గానికి చెందినదై వుండట, వస్తు నవ్యతతో పాటు భావ నవ్యత వుండటం వల్లనే ఈ గేయ సంపుటి నిలిచిందని భావించలేం. 'మహాప్రస్థానం' గేయాల్ని చదివే సామాన్య పాఠకుడు కూడా ఆ గేయాల లయ వల్ల ఆకర్షితుడవుతాడు. అయితే, శ్రీశ్రీ స్వయంగా తన గేయాల్ని చదివితే వినేవాళ్లకు అంత ఉత్సాహం కలుగుతుందా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం భిన్న విధాలుగా వుంటుంది. ఎలా ఉన్నప్పటికీ శ్రీశ్రీ 'మహాప్రస్థానం' నాలుగు విధాలుగా ప్రస్థానానికి గురైంది. చేతిరాతతో అచ్చుకావడం, ముద్రణలో రావటం, దృశ్య చిత్రీకరణలో గేయాలుగా రూపొందటం, వీటన్నిటికీ మించి కవే స్వయంగా చదివితే లండన్‌ నగరంలోని 'విదేశాంధ్ర ప్రచురణ'ల వారు రికార్డు చేసి కేసెట్ల రూపంలో విడుదల చేయడం... ఇన్ని ప్రత్యేకతలున్న శ్రీశ్రీ 'మహాప్రస్థానం'లో నిజానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు దాగి వున్నాయి. శ్రీశ్రీ సొంత గొంతుతో కేసెట్లుగా రూపొందించడం, సొంత రాతతో ముద్రించటం గొప్ప విషయాలా? గొప్పతనమనేది ఆయా వ్యక్తుల్ని బట్టి, స్వభావాల్ని అనుసరించి, కాలమాన పరిస్థితులను, సందర్భాలను బట్టి మారుతుంటుంది. కనుక, దానికి విలువ కట్టడం కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాల్తోనే ముడిపడి వుంటుంది. కాకపోతే, 'సొంతగొంతు'లో శ్రీశ్రీ 'మహాప్రస్థానం' రూపాంతరం చెందిన విషయాల్ని మాత్రం తెలుసుకోవటం అవసరం. 'సొంతగొంతు' అనగానే 'ధ్వని' అనే అర్థం తీసుకోవటం కాదు, ఆ గేయ సంపుటి రూపొందటంలో శ్రీశ్రీ స్వీయ చొరవను కూడా పరిగణనలోకి తీసుకోవటం దీనిలో మిళితమై వుంది.

'మహాప్రస్థానం' గేయసంపుటిలో గేయాలు ఎలా వుండాలో శ్రీశ్రీ స్వయంగా రాసిన రాతను బట్టి 'మరో ప్రపంచం' మొదలు 'రథచక్రాలు' తుది అని అనుకోవాలి. కానీ సంపుటిలో 'మహాప్రస్థానం' మొదట వుంటుంది. దీనికి శ్రీశ్రీ ఇచ్చిన వివరణ-

'మహాప్రస్థానం' అన్నా 'మరో ప్రపంచం' అన్నా ఒకటే. 'మహాప్రస్థానం' కవితలో మొదటి పంక్తి 'మరో ప్రపంచం'. 'ఈ గీతాన్ని నేను 1934వ సంవత్సరం ఏప్రిల్‌ నెల 12వ తేదీనాడు రాశాను. రాయడానికి అయిదు నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు' అని శ్రీశ్రీ అన్నాడు.

ఇక శ్రీశ్రీ పేరు చెప్పగానే 'మహాప్రస్థానం' గేయసంపుటి ఎలా గుర్తుకు వస్తుందో, 'మహాప్రస్థానం' ను గుర్తు చేసుకుంటే చలం రాసిన 'యోగ్యతా పత్రం' అలాగే గుర్తుకు వస్తుంది. కానీ, తాను రాసిన 'మహాప్రస్థానం' ముందు మాటకి చలం పెట్టిన పేరు 'మహాప్రస్థానానికి జోహార్లు' అని. దాన్ని శ్రీశ్రీ 'యోగ్యతాపత్రం' అని మార్చుకున్నాడు. అంతేకాదు, చలం ఆ ముందు మాటలో చలం అనుమతితో శ్రీశ్రీ కొన్ని మార్పులు కూడా చేశాడు.

చలం రాసిన ముందు మాటలో 'శ్రీశ్రీ కవిత్వమూ, పాల్‌రాబ్సన్‌ సంగీతమూ ఒకటే అంటుంది సౌరిస్‌. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు...' అని వుంటుంది. నిజానికి చలం పాల్‌ రాబ్సన్‌ అని రాయలేదు, సైగల్‌ అని రాశాడు. సైగల్‌ పేరు తీసేసి ఆ స్థానంలో పాల్‌ రాబ్సన్‌ పేరును చేర్చాడు శ్రీశ్రీ. ఆమెరికాలోని నీగ్రో పాల్‌ రాబ్సన్‌. గొప్ప గాయకుడు. వామపక్ష అభిమాని. నీగ్రోల హక్కుల కోసం పాటను ఆయుధంగా చేసిన కంచుకంఠం పాల్‌ రాబ్సన్‌ది. వామపక్షీయుల పట్ల, వారి సిద్ధాంతాల పట్ల తనకు ఒక అవగాహన లేకపోతే సైగల్‌ స్థానంలో పాల్‌ రాబ్సన్‌ పేరును చేర్చేవాడు కాడు. కానీ, 'మహాప్రస్థానం' రాసేనాటికి తాను మార్క్సిస్టుని కాదనీ, తనకు మార్క్సిజం తెలియదని చెప్పుకున్నాడంటే శ్రీశ్రీ గురించి ఏమనుకోవాలి? ఏమీ అనుకోవాల్సని పని లేదు!! కవులు/రచయితలు తాము రాసేవన్నీ తెలిసే రాస్తున్నారనో, చూసే రాస్తున్నారనో, ఆచరించే అందిస్తున్నారనో, తాము సిద్ధాంతాలను నమ్మి, వాటిని తమ రచనల్లో నిబిడీకృతం చేస్తున్నారనో అనుకుంటే అది అలా అనుకునేవారి అమాయకత్వమే. ఆనందవర్ధనుడు చెప్పినట్లు 'కవి అపరబ్రహ్మ'గా కూడా మారగలడు. 'అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః/ యథాస్మై రోచతే విశ్వం తధేవం పరివర్తితే...' అని కదా! అయినంత మాత్రాన వాస్తవికతకు దూరంగా విహరిస్తారని కాదు, కొన్ని వాస్తవాలను కళారూపంగా మలిచి కళాజగత్తును సృష్టిస్తారు. ఆ కళను అందించేటప్పుడు సమకాలీన వ్యవస్థ స్వరూపం ప్రతిఫలించవచ్చు. తాను చదినవీ, విన్నవీ, కన్నవీ, తనపై చూపిన ప్రభావాలు తన రచనకి ప్రేరన కావచ్చు. అయినంత మాత్రాన ఆ కవిని/రచయితను ఓ సిద్ధాంత చట్రంలో బంధించేయటం సబబేనా? అయితే, శ్రీశ్రీ 'మహాప్రస్థానం'లోనే 'రోమాంటిక్‌ కాన్సెప్ట్‌కు సంబంధించిన గేయాలు కూడా కనిపిస్తాయి కదా! దీన్ని బట్టి తేలేదేమిటంటే, సమకాలీన సమాజ ప్రభావం నుంచి తప్పించుకోవటం కవులకు అసలు సాధ్యం కాదనేది. దానికి ఆ సమకాలీన ఉద్యమాల్లో పాల్గొనాలనేమీ లేదు. ఈ సందర్భంగా చలం రాసిన ముందు మాటలో 'సైగల్‌' స్థానంలో 'పాల్‌ రాబ్సన్‌' పేరును చేర్చడానికి కారణమేమై వుంటుందన్నప్పుడు కచ్చితంగా తనకున్న అవగాహన ప్రభావమే కావచ్చు. పైగా చలం ముందు మాట1940 జులై 17వ తేదీన రాసింది. గేయం రాసేనాడు లేని అవగాహన శ్రీశ్రీకి ముందు మాట రాయించుకునే నాటికి ఏర్పడి వుండవచ్చు కదా!

ఏ ప్రభావంతో శ్రీశ్రీ 'మహాప్రస్థానం' రాసి వుండొచ్చుననే దానికి పరిశోధకులు, పరిశీలకులు, తదితరులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తీకరించారు. 'శ్రీశ్రీ మహాప్రస్థానం రాసేనాటికి మార్క్సిస్టు కాడు. ఆనాడు శ్రీశ్రీ తాను అభ్యుదయ రచయితననీ చెప్పుకోలేదు' అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పటమేమిటి? శ్రీశ్రీ 1970లో సృజన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా 'మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం గూర్చి తెలియనే తెలియదు. నేను మార్క్సిజం తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే, రాజకీయం ద్వారా కాదు' అని అన్నాడు.

మరి శ్రీశ్రీ 'మహాప్రస్థానం' ఇంత గొప్పగా రాయటానికి గల నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు- ఫ్రెంచివారి జాతీయ గీతం, హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ 'షురూ హువా హై జంగ్‌' అనే పాట, నజ్రుల్‌ ఇస్లాం విప్లవ గీతం, ఎడ్గార్‌ ఎలన్‌ పో గేయాలు, గురజాడ, కవికొండల గేయాలు ప్రభావం ఉందని శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని సినారె తన సిద్ధాంత గ్రంథంలో ఉటంకించారు.

లండన్‌ నగరంలో వెలువడిన శ్రీశ్రీ స్వీయ దస్తూరి గల 'మహాప్రస్థానం' గేయ సంపుటికి 'నా మాట' రాస్తూ, ఆనాటి ప్రపంచ పరిస్థితులకు స్పందించాననీ- 'ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారనీ, దీనికి వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కాసారి వెనక్కు తిరిగి చూసుకొంటే, మహాప్రస్థాన గీతులలోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాధృచ్చికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది' అంటాడు శ్రీశ్రీ. 15-12-80న ఇది రాశాడు. అయితే ఇదే శ్రీశ్రీ స్వయంగా (సొంతరాతలో) 'కర్షక కార్మిక మహోద్యమం జయించి తీరుతుందన్న విశ్వాసం నా మహాప్రస్థానానికి ప్రాతిపదిక అని మద్రాసులో 11-12-81న రాశాడు. ఏది ఏమైనా, శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాన్ని సృష్టిస్తే, మహాప్రస్థానం గీతం శ్రీశ్రీని శాశ్వతం చేసిందనటంలో అతిశయోక్తి లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more