వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ 'సలాం హైదరాబాద్‌'పై సదాశివ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sadisiva on Lokesh's Salam Hyderabad
'విష్ణు ఆజ్ నై చూఁ హికాయత్ మీకునద్' "పిల్లనగ్రోవి ఏదో కథ చెప్తున్నది విను" అంటూ జగత్ప్పసిద్ధమైన తన మస్నవీ కథలు చెప్పటం మొదలు పెట్టినాడు మోలానా రూమీ. వెదురు పొదలోంచి వేరు చేయబడిన వెదురు ముక్క మూగగా పడి ఉన్నది. ఉలుకద - పలుకదు. ఎవరైనా పలికించాలని ఊదితే బర్ - బర్ అనే సవ్వడే కాని ఒక్క సుస్వర వెలువడదు. అన్నీ అపస్వరాలే. ఎవరైనా వెక్కిరిస్తే, పరిహసిస్తే సహించుకుంటుంది. సర్దుకుపోయి పడి వుండటం అలవాటయింది దానికి. సహించటం ఎంత కాలం? సర్దుకుపోవటమైనా ఎంత కాలం? తన మూలాన్నే కాకుండా తనకు కాకుండా చేసిరి కదా అని లోలోపలే కుమిలికుమిలి ఏడ్చింది. ఎంతగా ఏడ్చిందంటే ఎడద చిల్లులు పడింది. అప్పుడు పలికిందయ్యా! అన్నీ సుస్వరాలే. సప్తస్వరాల సరాగాలతో తన సంగతులు పలికింది. పదిలంగా వున్న తన పొదను చూసుకొని పరవశించి కథలు చెప్పింది. ఆ కథలే మోలానా రూమీ మస్నవీ.

"సలాం హైదరాబాద్" అనే ఈ కమ్మల్లో "పైదాయిషీ హైదరాబాదీ పరవస్తు లోకేశ్వర్" ఎవో కథలు చెప్తున్నాడు వినండి.

తాను పుట్టి పెరిగింది పల్లెటూరే అయినా, పట్టణమైనా దాని మట్టిని, మట్టివాసను, ఆ మట్టిలో పుట్టిపెరిగినవాళ్లను, మనిషైనవాడు మనసు నిండా ప్రేమిస్తాడు. లోకేశ్వర్‌కు ప్రేమించటం, ఆదరించటం, గౌరవించటం తెలుసు. అసలు హైదరాబాద్ నగరం నిర్మాణమే ప్రేమ మీద ఆధారపడి వున్నది. కులీ కుతుబ్షా తన ప్రేయసి భాగ్‌మతి పేర నిర్మించిన నగరం భాగ్యనగరం. "హైదర్ మహల్" అనే గౌరవనామంతో భాగ్‌మతి కులీకుతుబ్షా జనానాలో చేరిన తరువాత భాగ్యనగరం హైదరాబాద్ అయింది. చార్‌మినార్ హైదరాబాద్‌కు అలంకారం. లోకేశ్వర్ చిన్నప్పుడే చార్‌మినార్ చూసి సంబరపడ్డాడు. దాని ఆకారం అతని మస్తిష్కాల్లో నిలిచిపోయింది. హైదరాబాద్‌లో ముషాయిరా జరిగినా జహాందార్ అఫ్సర్ అనే సుప్రసిద్ధ ఉర్దూ కవి తాను రాసిన "చార్‌మినార్" అనే కవిత తప్పక వినిపించేవాడు.

"చార్‌మినార్ కే ఇస్ షహర్ మె రహనే వాలో
చార్‌మినార్ కా మత్లబ్ క్యా హై?"

ఆ ప్రశ్నతో మొదలవుతుంది అతని ఆ కవిత. చార్‌మినార్ అంటే దాని భావమేమి? అని కవి ప్రశ్న. లోకేశ్వర్ చార్‌మినార్ అంటే ఏమిటో ఈ కమ్మల్లో చెప్పే ప్రయత్నం చేసినాడు. హైదరాబాద్ అన్నపూర్ణ. ఎక్కడికెక్కడి వాళ్లో వచ్చినారిక్కడికి. వచ్చి స్థిరపడినారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లోంచే కాక హబ్షీలు, నీగ్రోలు, అరబ్బులు - ఇలా ఎన్నో జాతుల వాళ్లు వచ్చినారు. వాళ్ల సంతానమిప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడి వున్నది. ఎవరి వృత్తిలో వాళ్లు వృద్ధి పొందుతూ హైదరాబాద్ నగరాన్నే కాక హైదరాబాద్ రాష్ట్రాన్ని బాగుపరిచే ప్రయత్నం చేసినారు. తాము బాగుపడ్డారు. సాధ్యమైనంత వరకు నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచే ప్రయత్నం చేశారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయినారు. మూలవాసుల ఉద్యమాలన్నిటిలో పాల్గొన్నారు. ఉత్తరాది నుంచి వచ్చిన కొందరు ఉర్దూ కవులు, పండితులు మాత్రం ఇక్కడి ఉర్దూను ఈసడించుకున్నారు. అప్పుడే హైదరాబాదులో "నాన్ ముల్కీ గో బ్యాక్" అనే నినాదం మొదటిసారి వెలువడింది. తరువాత వచ్చినవాళ్లు కొందరు ఇక్కడివాళ్ల సంస్కారాన్ని, భాషను, యాసను పరిహసించి తామే గొప్పవాళ్లమన్నట్లు ప్రవర్తించినారు.

అదిగో, ఆ కొందరి కారణంగానే అందరిపట్ల పరాయి భాలం యేర్పడింది. ఆ తరువాత జరిగిన కథంతా తెలిసిందే. ఈ కమ్మల్లో లోకేశ్వర్ ఆ ముచ్చట్లన్నీ వైనంవారీగా చెప్పుకవచ్చినాడు. మాటిమాటికీ నేను ఈ కమ్మలు అంటున్నా ఇది ఒక దీర్ఘ నవల. ఇందులో హైదరాబాద్ నగర పూర్వ సంస్కృతి, ఈ తరంవాళ్లకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరించబడినవి. లోకేశ్వర్ చూచిన హైదరాబాదును మన కళ్ల ముందుంచినాడు. అతని తొలి బాల్యం, మలి బాల్యం హైదరాబాదు గల్లీల్లోనే గడిచింది. గనుక అప్పటి ఆటలు, పాటలు, ఆచారవ్యవహారాలు, ఇరానీ హోటళ్లు, సర్వర్లు - వంగివంగి "క్యా హుకుమ్ హై, సర్కార్?" అని వినయంగా ప్రశ్నించే సంప్రదాయం - "ఏక్ చాయ్, ఏక్ మే దో చాయ్, దో మే తీన్ చాయ్, మలైదార్ పౌనా, పాయ్, పాయేకా షోర్బా, నిహారీ ఔర్ కుల్చా, ఖిచిడీ ఔర్ ఖీమా, బిర్యానీ, తందూరీ రోటీ - ఇవన్నీ లోకేశ్వర్‌కు ఇప్పటికీ నోరూరిస్తాయి. ఇవన్నీ తిన్న మాలాంటివారికీ నోరూరిస్తాయి.

ఇవే కాక అనేక చారిత్రకాంశాలు, మహలఖా బాయీ చందా వ్యక్తిత్వం, జాన్ మాల్కమ్‌తో ఆమె ప్రేమ వ్యవహారం, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమవ్యవహారం కూడా వున్నాయి ఇందులో. ఇదంతా హైదరాబాద్ చరిత్ర. ఇవన్నీ లోకేశ్వర్ చిన్ననాటి తీయని జ్ఞాపకాలు.

హైదరాబాదును చాలా ప్రేమించినాడు లోకేశ్వర్. బాధ్యతగల పెద్ద మనిషి ఎవరో "మా కారణంగా హైదరాబాదు నగరం అంత సుందరంగా తయారయింది. అంతకు ముందు అక్కడేమి వుండేది? సుమెంటు కాంక్రీటు భవనాలుండేవా? ఆకాశహర్మ్యాలుండేవా? మట్టిగోడల భవనాల గోడలే!" అని యెద్దేవా చేస్తూ వుంటే హైదరాబాదు నగరంలోనే కాదు, హైదరాబాదు రాష్ట్రంలో పుట్టి పెరిగినవాళ్లందరికీ ఆవేదన కలిగిస్తుంది. ఆనాటి మట్టిగోడల సౌధాలను, ఆ సౌధాల ముందుండే విశాలమైన ప్రాంగణాలు, ఆందమైన చెట్లను చూసినవాళ్లకు ఆ పెద్ద మనిషి మాటలు బాధ కలిగిస్తాయి.

ఒకప్పుడు మనదేశానికి ప్రధాన మంత్రిగా వున్న ఇంద్రకుమార్ గుజ్రాల్ హైదరాబాదుకు వచ్చి "నేను చూచిన అందమైన హైదరాబాదదేమయింది? ఇప్పుడున్నది సిమెంటు కాంక్రీటు భవనాల అరణ్యమే" అని తన విచారం వ్యక్తం చేసినాడు.

డా. గోవర్దన శాస్త్రి "సియాసత్" ఉర్దూ పత్రికలో "హైదరాబాద్ కా ఆంగన్ గాయబ్" అని ఒక వ్యాసం రాసినాడు. అప్పటి అందాలన్నీ లోకేశ్వర్‌కు తెలుసు. ఇప్పటి హైటెక్ వైభవాన్నీ చూస్తున్నాడు. ఈ నవలలో ఆ అందాలన్నీ పోయినవని ఆవేదన వ్యక్తమవుతున్నది.

ఎడదకు చిల్లు పడితేనే కదా సుస్వరాలు పలికేది. నా చెవులకివన్నీ సుస్వరాలే.

English summary
A prominent Telugu and Urdu writer Sadasiva spoke about the novel 'Salam Hyderabd' written by Paravasthu Lokeshwar on Hyderabad cultural history and movements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X