వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిప్పుల వాన షాజహానా కవిత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sajahana
''కొట్టాల్లో పశువులు/ ఫారాల్లో కోళ్లు/ చీకటి కొట్లలో మేము....'' అంటూ షాజహానా ముస్లిం మహిళల బతకులకు చిత్రిక కడుతోంది. కొట్టాల్లో పశువులు, ఫారాల్లో కోళ్లు కట్టిపడేసిన పశువులు, పక్షులు. ముస్లిం మహిళల బతుకులు కూడా అంతే. ముస్లిం స్త్రీల బతుకు వేదనను, హింసను కవిత్వంగా మలిచిన తొలి ముస్లిం తెలుగు కవయిత్రి బహుశా షాజహానానే. మనకు ఇంతకు ముందు ఒకరిద్దరు ముస్లిం తెలుగు కవయిత్రులు లేకపోలేదు. కానీ షాజహానా లాగా ముస్లిం స్త్రీని బాధల గాధలను కవిత్వీకరించి, వాటికి కారణాలు చెప్పి, ఆ సంకెళ్ల నుంచి బయటపడడానికి చేయాల్సిన అంతర్గత పోరాటం గురించి చెప్పిన తెలుగు ముస్లిం కవయిత్రి ఇప్పటి వరకు లేదు. ఆ రకంగా షాజహానా తొలి మేలుకొలుపు పాట.

ముస్లిం సంప్రదాయం అంటేనే బురఖా, నఖాబ్‌ గుర్తొస్తాయి. అవి బాహ్య రూపాలే కాదు, వాటి అంతర్గత లోగుట్టును కూడా విప్పిన కవయిత్రి షాజహానా.'మతమూ, తండ్రీ, మొగుడూ' తనకు సంకెళ్లు వేసి, తనను కేవలం మాంసపు ముద్దగా (వస్తువుగా) చేయడానికి ఆ బురఖాలు, నఖాబ్‌లు అనే స్పష్టమైన అవగాహనతో పలికింది షాజహానా. ఆమె కవిత్వం విడివిడిగా చదువుతున్న కలగని అనుభూతి ఒక దగ్గర ఒకేసారి చదివినప్పుడు కలిగే అనుభూతి తీవ్రతకు తేడా ఉంటుంది. నిప్పుల కణిక ఒంటి మీద ఒక్కొటొక్కడే పడుతున్నదానికి మొత్తం నిప్పుల రాళ్లు కురుస్తున్నదానికి మధ్య ఉన్న తేడా అది. ఆ నిప్పుల రాళ్ల వానను అనుభూతి చేయించి, మన మనసుల మంచుముద్దలను కరిగించడానికే అన్నట్లు షాజహానా కవితా సంకలనం 'నఖాబ్‌' వెలువడింది. ముస్లిం స్త్రీల అణచివేతకు ప్రతీక అయిన 'నఖాబ్‌'ను ఆమె ఈ సమాజం తొడుక్కున అనేకానేక ముసుగులను పీకి పారేసి ప్రశ్నిస్తుంది. తనను విముక్తం చేసుకునే ఆత్మధైర్యాన్ని ప్రకటిస్తూ ముస్లిం స్త్రీలందరికీ మనోబలాన్ని అందిస్తోంది షాజహానా.

మతం ఏదైనా సరే, స్త్రీల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుంది. ఆ మతం పేరు చెప్పి పురుష సమాజం స్త్రీని తన చెప్పుచేతుల్లో ఉంచుకొని తన అవసరాలను తీర్చుకుంటుంది. ఆలోచనలను పంచుకోవడానికే కాదు, నవ్వడానికి, ఏడ్వడానికి కూడా ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ లేదు. తన చుట్టూ ఉన్న స్త్రీలు మత సంద్రాయాల పేర అణచివేతకు గురవుతున్న విషయాన్ని షాజహానా చిన్ననాటి నుంచి చూస్తూ వస్తోంది. అప్పటి నుంచే ఆమె సంకెళ్లను తెంచుకోవడానికి అవసరమైన తిరుగుబాటు మనస్తత్వాన్ని పెంచుకుంటూ వచ్చింది. అనంతమైన ముస్లిం దుఃఖమంతా షాజహానా కవిత్వంలో కనిపిస్తుంది. 'ఎడ్ల మూతికి బుట్టలాగా/ గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నఖాబ్‌లు' అని ముస్లిం స్త్రీల దైన్యాన్ని చెబుతుంది. పశువుల కన్నా మించిన గుర్తింపు, ఉనికి తమకు లేదని ఆమె గుర్తించింది.

భారతదేశంలో ముస్లిం ముప్పేట అణచివేతకు, దాడికి గురవుతోంది. ఆ దాడులకు సంబంధించిన స్పష్టమైన అవగాహన, దాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉందని షాజహానా తన కవిత్వంలో పలికిస్తుంది. ముస్లిం సమాజంలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకున్న ఆమె హిందూ మతోన్మాదంపై, తెలంగాణ ప్రజలు గురవుతున్న వివక్షపై కూడా ప్రశ్నలు సంధిస్తోంది. తన మాతృభూమి ఇదేనని ప్రకటించుకోవాల్సిన బరువు ముస్లిం పురుషుడికి ఉన్నట్లుగా ముస్లిం స్త్రీకి కూడా ఉందని షాజహానా గుర్తించింది. తమ కాళ్ల కింది మట్టిని పెళ్లగిస్తూ ఉనికినే ప్రమాదంలో పడేస్తున్న హిందూ మతోన్మాదం భారతదేశంలోని ముస్లిం సమాజానికి పెనుభూతంగా పరిణమించింది. అందుకే 'నా అల్లా/ నా పురుషుడు/ నా మతమూ పెట్టే హింసే అనుకుంటే/ నీ దేముడు/ నీ పురుషుడు/ నీ మతమూ.../ గుడ్డల్ని చీరి పీలికలు చేసినట్టు/ మా దేహాల్ని'' చీలుస్తున్నాయని షాజహానా అంటోంది. ''నేను నా దేహానికే కాదు/ నా దేశానికి బాధొచ్చినా/ సహించలేని దాన్ని' అని అంటూ 'మమ్మల్ని ఈగల్లా మత వాదులన్న ముద్రతో సతాయించొద్దు' అని అడుగుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పటి నుంచి ముస్లిం సమాజంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతన్న భౌతిక, సాంస్కృతిక దాడులు భారతదేశంలోని ముస్లింలను కూడా వెంటాడుతున్నాయి. ముస్లిమేతర సమాజం నుంచి కుచ్చుకునే ప్రశ్నల ముళ్లు ముస్లింలను ఆత్మన్యూనత భావనలోకి, అపరాధ భావనలోకి నెట్టే విషయాన్ని షాజహానా వ్యక్తీకరించింది. 'నాకు పక్కింటికి/ బిన్‌ లాడెన్‌ సరిహద్దయ్యిండు/ మీ వోడేనటగా... / నల్లకాడ అంటగట్టిన/ సమజ్‌ గాని పరేషానీ'ని అంటూ తను అపరిచిత అయిన వైనాన్ని కవిత్వీకరించింది షాజహానా.

షాజహానా కవిత్వం గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది - ముస్లిం సమాజంలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం, స్త్రీలను ముస్లిం పురుషుల ఆధిపత్య సంకెళ్ల నుండి విముక్తం చేయడం కోసం చేసే పోరాటాన్ని. ఈ పోరాట పటిమను ఆమె శతాబ్దాల దుఃఖం నుంచి పెనుగులాడి పెనుగులాడి సాధించుకుంది. మతం, ముస్లిం పురుషుడు, హిందూ సమాజం, హిందూ పురుషుడు వేసిన సంకెళ్లను పటపటా తెంపేసి రెక్కలను విదుల్చుకుని స్వేచ్ఛా గీతం పాడాలని తన స్త్రీలకు ఉద్బోధిస్తోంది. బురఖాలను, నఖాబ్‌లను చించేసి యుద్ధానికి సిద్ధమైన వీరవనితలా షాజహానా తన కవిత్వం ద్వారా కనిపిస్తుంది.

చివరగా ఒక మాట - ఇటీవల మా మిత్రుడు వెంకటరెడ్డి ఇంగ్లీషు పాఠాలు చెప్పడానికి అఫ్గనిస్థాన్‌ వెళ్లాడు. అతని ఇక్కడికి వచ్చాక ఒక మాట చెప్పాడు. బురఖాలు, నఖాబ్‌లు వేసుకొని ముస్లిం స్త్రీలు వచ్చారట. వాటిని తీసేసి క్లాసులోకి రావాలని తాను చెప్పాడట. వెంటనే స్త్రీలందరూ ముసుగులను తీసి అవతల పేడసి వచ్చారట. ఈ సంఘటన ముస్లిం స్త్రీలలోని స్వేచ్ఛా కాంక్షను బయటపెడుతుంది. తాము అనుభవిస్తున్న బతుకుల నుంచి బయటపడాలనే కాంక్షను వెల్లడిస్తుంది. షాజహానా కవిత్వం ఇటువంటి స్త్రీలందరికీ ఊతం ఇస్తుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Sajahana, a Telugu poet, reflects in her writings the agony of Muslim women. Muslim women are facing trouble with the unwanted rules and regulations socially, Sajahana says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X