• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అల్లం రాజయ్య కథల్లో సారమా, భాషా..

By Pratap
|
Allam Rajiah
భాషకు-ప్రజలకు, భాషకు-సాహిత్యానికి మధ్య వున్న సంబంధాల విశ్లేషణ తెలుగు సాహిత్యంలో లేదు. ఎ.కె.ప్రభాకర్‌ 'తెలుగులో మాండలిక కతా సాహిత్యం' అనే పరిశోధనా గ్రంథం ద్వారా ఆ కొరత తీరుస్తున్నారు. పరిశోధనలకు కొత్త ఒరవడి దిద్దుతున్నారు.

''భాషా-సాహిత్యమూ రెండూ సామాజికాలే. సమాజంలో రాజకీయార్థిక రంగాల్లో మార్పు జరిగినప్పుడల్లా భాషా సాహిత్యాల్లో సైతం మార్పులు చోటు చేసుకుంటాయి'' అనే స్పష్టమైన అవగాహనతో ప్రభాకర్‌ తెలుగు మాండలిక కథా సాహిత్యాన్ని విశ్లేషించినారు. ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయంలో 'మాండలికం' తీరు తెన్నులను, మాండలికానికి, యాసకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని విశ్లేషించినారు. మాండలికమంటే ఏమిటో నిర్వచించినారు. ఇందులో మాండలిక భేదాలు ఏర్పడానికి గల కారణాలేమిటో కార్యకారణ సంబంధాలతో చెప్పినారు. మాండలికాలు ఏర్పడటానికి చారిత్రక, ప్రాంతీయ, సాంఘిక కారణాలుంటాయి. ఈ విషయాలను ఆయన సోదాహరణంగా వివరించినారు. ఇదంతా భాషాశాస్త్ర దృష్టితో మాత్రమే కాకుండా సామాజిక నేపథ్యం నుంచి చేయడం ఎ.కె.ప్రభాకర్‌ విశిష్టత. మాండలిక సాహిత్యం ఆవిర్భవించడానికి గల కారణాన్ని ఆయన విశ్లేషించిన తీరు ఆమోదయోగ్యమైంది. ''సాహిత్య రచనకు ఉపయోగించే ప్రామాణిక భాషకు (సాహిత్యభాష), అందుకు నోచుకోని మాండలిక భాష (ప్రజల భాష)కు సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ సంఘర్షనలో నుంచి కొత్త సాహిత్య భాష ఏర్పడవచ్చు. ప్రజల వ్యవహారంలో ఉండి సాంస్కృతిక జీవితంలో ముడిపడి ఉన్న భాషకు సాహిత్య భాషతో సంఘర్షణ జరిగినప్పుడు ప్రామాణిక భాషలోని సాహిత్యానికి సమాంతరంగా జ్రల సాంస్కృతిక భాషలో కూడా సాహిత్యం వెలువడవచ్చు. మాండలిక సామిత్యం ఆ క్రమంలో పుడుతుంది'' అని చెప్పినారు ఆయన. ఈ రకంగా ప్రభాకర్‌ తర్వాతి అధ్యాయంలో ప్రజల కోసం వచ్చిన మాండలిక కథా సాహిత్యాన్ని విశ్లేషించడానికి పునాది వేసుకున్నారు.

రెండో అధ్యాయంలో 'తెలుగు సాహిత్యంలో మాండలికం' అనే అంశాన్ని విశ్లేషించినారు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో, మాండలికాల గురించి వివరిస్తూ పోయినారు. ప్రభాకర్‌ విశ్లేషణకు పోరాట నేపథ్యం, ఫలితంగా వెలువడిన సాహిత్యం ఆయనకు కేంద్రబిందువు అయింది. '' 40ల్లో తెలంగాణ రైతాంగ పోరాటంలో వెలవడ్డ సాహిత్యానికి ఈనాటి సాహిత్యానికీ వస్తువు-రుపాల్లో పెద్ద తేడాలేదు గానీ ఈ సాహిత్యానికి కావలసిన సైద్దాంతిక బలాన్ని విరసం అందించింది. మాండలికం, అందునా తెలంగాణా మాండలికం బలమైన శక్తితో పోరాట స్ఫూర్తితో సాహిత్యంలోకి చొచ్చుకొచ్చింది. కథలే కాకుండా నవలలు పూర్తిగా ప్రజల భాష (మాండలికం)లో వెలుగు చూశాయి'' అని అనడం అందుకే. మొత్తంగా మాండలికానికి ప్రజల భాషకు ఒక అభేదాన్ని పాటిస్తూ, ప్రజల భాషకు విప్లవోద్యమాలకు మధ్య గల సంబంధాన్ని పటిష్టపరుస్తూ ప్రభాకర్‌ పరిశోధన సాగింది. ప్రజల పక్షాన నిలిచి వారికోసం రాసే రచయిత ఒక 'మహత్తర లక్ష్యసాధన' కోసం మాండలికంలో రచనలకు ఉపక్రమించినాడనే విషయాన్ని ప్రభాకర్‌ తన పరిశోధనా గ్రంథంలో చెప్పే ప్రయత్నంచేసినారు. అయితే వెంటనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. మాండలిక సాహిత్యమంతా ఉద్యమాల అవసరాలకోసం మాత్రమే రాలేదని ఆయన సరిగానే గుర్తించినారు. ''తమ ప్రాంతీయ భాషలో ఉన్న పదాలనూ సౌందర్యాన్ని కాపాడుకోవాలనే భాషాభిమానంతో కూడా యశోదారెడ్డి లాంటి వాళ్లు (తెలంగాణ) మాండలికంలో కథలు రాశారు'' అని చెప్పినారు.

'మాండలిక సాహిత్యం-కథ' అనే మూడో అధ్యాయంలో రచయిత పరిధి - పరిమితి, లక్ష్యాలు- ప్రయోజనాలు, పరిణామక్రమం, పాట, వచన కవిత, నాటకం-నాటిక-ప్రజాకళారుపాలు, మాడలిక కథ, వ్యాప్తి అంశాలను విశ్లేంచినారు. కథా సాహిత్యంలో మాండలికం వాడకంపై విమర్శలు ఎదురు కావడానికి గల సామాజిక కారణాలను ప్రభాకర్‌ పట్టుకున్నారు. మాండలిక భాషలో సాహిత్యం వెలువడాల్సిన అనివార్యతను, ఉద్యమాలు కల్పించిన తీరును ఆయన కార్యకారణ సంబంధాలతో వివరించినారు. ఆంధ్రదేశంలోని మిగతా ప్రాంతాల మాండలిక కథకు, తెలంగాణ మాండలిక కథకు మధ్యగల తేడాను ఆయన చూపించినారు. ''తెలంగాణ మాండలిక కథకు తక్కిన ప్రాంతాల కథల కన్నా భిన్నంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతపు సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం తెలంగాణ మాండలిక కథకు విశిష్టతను సాధించి పెట్టింది'' అంటారు ప్రభాకర్‌.

ప్రభాకర్‌ ప్రధానంగా తెలంగాణ మాండలిక కథను తన పరిశోధనా గ్రంథంలో విశ్లేషించినారు. 'తెలంగాణ మాండలిక కథ'ను విశ్లేలించడానికి ఆయన ఒక అధ్యాయాన్నే ఎంచుకున్నారు. ఈ అధ్యాయంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఫలితంగా వెలువడిన సాహిత్యాన్ని ప్రత్యేక దృష్టితో విశ్లేషించి, వివరించినారు. మిగతా ప్రాంతాల సాహిత్యాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని వివ్లేషించడానికి ఒకే రకమైన ప్రమాణాలు పనికి రావంటున్న నేటి తెలంగాణ సామిత్య విమర్శకుల వాదనకు ఈయన విశ్లేషణ బలాన్నిస్తుంది. ఆంధ్రలో వచ్చిన సాంస్కృతిక, భాషా ఉద్యమాల తాకిడితో గాని, తత్కారణంగా సంభవించిన మార్కులతో గానీ తెలంగాణకు సంబంధం లేదనే విషయాన్ని ఆయన చెప్తూనే దాని వల్ల తెలంగాణ సాహిత్యం మిగతా సాహిత్యానిక భిన్నంగా ఎలా ఉందో ప్రభాకర్‌ వివరించినారు. ''800 ఏళ్ల క్రితం పాల్కురికి ప్రజాసాహిత్యానికి పెట్టిన ఒరవడి తెలంగాణలో తర్వాతి కవులకు వారసత్వంగా సంక్రమించింది'' అనే ప్రతి పాదన చేసి, ఆ వారసత్వం ఎలా కొనసాగిందో చెప్పినారు. తెలంగాణ కథ కూడా సురవరం ప్రతాపరెడ్డి నుంచి ఎలా ముందుకు సాగిందో వివరించినారు. ఆ తర్వాత ప్రభాకర్‌ 1970 తర్వాత తెలంగాణలో వచ్చిన మాండలిక కథ గురించి వివరంగా విశ్లేషిస్తూ పోయినారు. ప్రజల పక్షాన నిలిచిన రచయిత ప్రజల భాషను వాడుకున్న తీరును ఆయన చెప్పినారు.

'మాండలిక కథ ప్రజాసాహిత్యం' అనే అయిదో అధ్యాయంలో ప్రభాకర్‌ తెలంగాణ కథ రూపుదిద్దుకున్న తీరును వివరించినారు. ''కథకున్న మౌఖిక ధర్మాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితుల్లో ప్రజల కోసం ప్రజల నుంచి ప్రజలకు అనే ఆశయంతో ప్రజాసాహిత్య సృజనలో భాగంగా 1970 తర్వాతే తెలుగులో కథను మరోసారి మౌఖికం చేసే ప్రయత్నం జరిగింది'' అని వివరించినారు. ఈ క్రమంలో అల్లం రాజయ్య చేసిన ప్రయోగాన్ని ఉదహరించినారు. అల్లం రాజయ్య మాండలికంలో సాహిత్య సృజన చేస్తున్న సమయంలో మాండలికం వాడచ్చునా, లేదా అనే చర్చ విపరీతంగా జరిగింది. ఈ చర్చ చాలవరకు భాషపైనే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని-''భాష వస్తువుల ద్వారా ప్రజలకు ద్గరయిన మాండలిక కథా సాహిత్యంలో మౌఖిక సంప్రదాయానికి చెందిన రూపాన్నీ, ప్రగతిశీలమైన వస్తువునీ పక్కన పెట్టి కేవలం భాష గురించి చర్చలు చేయడం పాక్షికదృష్టే అవుతుంది'' అన్నారు ప్రభాకర్‌. నామిని కతలు క్రమక్రమంగా సారహీనమవుతూ తెలంగాణ కథ సారవంతంకావడానికి గల ప్రధాన కారణాన్ని చెప్పిన తీరు ప్రభాకర్‌ నిశిత పరిశీలనా దృష్టికి నిదర్శనం

మొత్తంమీద, తెలుగులో మాండలిక కథారచన ప్రజాఉద్యమాలతో ముడిపడి జరిగిన తీరును ప్రభాకర్‌ తన పరిశోధనా గ్రంథంలో ఆమోదయోగ్యంగా చెప్పినారు. తన విశ్లేషణ ద్వారా ప్రభాకర్‌ తెలంగాణ దృష్టికోణాన్ని విస్తృతం చేస్తున్నారు. తెలంగాణ తోవలోని అడ్డంకులను తొలగిస్తున్నారు. ప్రభాకర్‌ వెలవరించిన 'తెలుగులో మాండలిక కథ సాహిత్యం' సాహిత్య పిపాసువులందరూ చదవాల్సిన పుస్తకం

- కాసుల ప్రతాపరెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A researcher in Telugu literature, AK Prabhakar analyses the usage of dialect in Telugu short story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more