శ్రమైక జీవన సౌందర్య దీపిక

ఒంటిగాడైన శంకరయ్య మందిలో పడే పరిణామ దశల చిత్రీకరణే ఈ నల్లవజ్రం. వైయక్తిక బాధల నుంచి విముక్తి పొంది సమష్టి కష్టాలను కడతేర్చడానికి శంకరయ్య ఉద్యుక్తుడవుతాడు. ఈ క్రమంలో గని కార్మికుల కష్టాలు, అధికారుల అవినీతి, యూనియన్ నాయకలు దళారీతనం, ఇత్యాది ఎన్నో అంశాలు వస్తాయి.
శంకరయ్య తన నివాసం నుంచి పనిచేసే స్థలానికి సైకిల్ తొక్కి తొక్కి పోయే వరకు కాళ్లు ఈడ్చుకత్తయి., దాని కోసం టెనింక్ లైన్ నుంచి వనింక్ లైన్‌కు ట్రాన్స్‌ఫర్ కోసం పడరాని పాట్లు పడుతాడు. ఎండకెండి వానకు తడిసి పిట్టలేరిగి దుమ్ముగొట్టి తెల్లబడి పోయిన ఎర్రజెండా కింద కంపెనీ యాజమాన్యానికి తొత్తులై, కార్మికుల, యాజమాన్యాల మధ్య దళారులుగా వ్యవహరిస్తూ, కార్మికులను దగా చేసే యూనియర్ లీడర్ల కాళ్లా వేళ్లా పడ్తాడు. ఫలితం ఉండదు. చివరి ప్రయత్నంగా హాస్పిటల్‌లో ఉన్న జనరల్ మేనేజర్‌కు రక్తం ఇస్తాడు. అతను మరణిస్తాడు. శంకరయ్య ట్రాన్స్‌ఫర్ ట్రాన్స్‌ఫర్ దగ్గరే ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ గొడవతో, కాళ్లు గుంజడం వల్ల బాయికి వెళ్లకపోవడంతో అయే నాగాలతో ఎండలో ఎండడం, వానలో తడవడం, చలిలో వణకడం జరిగిపోతాయి. చలికాలంలో అగ్గి రాజుకుంటుంది. రక్తం ఇచ్చినా ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో శంకరయ్య తోటి కార్మికులు యూనియన్ లీడర్‌ను నిలదీస్తారు. గుండెలో రగులుతున్న కోపాన్ని వెళ్లగక్కుతారు. పర్యవసానంగా శంకరయ్య అక్రమంగా అరెస్టవుతాడు. దాంతో బాయిల పనులు బందవుతాయి. సమ్మె ఫలిస్తుంది. మామూలు బొగ్గు లాంటి శంకరయ్య నల్లవజ్రం అవుతాడు అదీ కథ.
ఇందులో శంకరయ్య ట్రాన్స్‌ఫర్ సమస్యే సమ్మెకు కారణమవుతుందా అనే ప్రశ్న ఉదయించకమానదు. కార్మికుల గుండెల్లో మండుతున్న అగ్నిని కప్పేసిన నివురును శంకరయ్య ట్రాన్స్‌ఫర్ గోడవ ఊదేసింది. ఆ అగ్ని ప్రజ్వరిల్లింది. మంటై లేచింది. చాలా కాలంగా కంపెనీ పోలీసుల సాయంతో ఎంతో నిర్బంధం చేసింది. పని భారాన్ని పెంచడం, డ్యూటీ సమయం అయిపోయినా పని చేయమని ఒత్తిడి చేయడం, రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం, బావుల్లో వెంటిలేషన్ ఏర్పాట్లపై శ్రద్ధ చూపకపోవడం, పనిస్థలాల బాగు కోసం ప్రయత్నించకపోవడం - కేవలం ఉత్పత్తిపైనే శ్రద్ధవహించడంతో గత కొద్ది కాలంగా కార్మికుల్లో తీవ్రమైన అసంతృప్తి చోటు చేసుకున్నది.
పైగా ఎదురు తిరిగిన కార్మికులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడం, అది కాకపోతే డిస్మిస్ చేయడం జరిగింది. యూనియన్స్ (చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకం) కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో కార్మికుల్లో అశాంతి పెరిగింది. సమ్మెలకు దిగీ దిగకమునుపే పోలీసులు రంగప్రవేశం చేసలి ఎక్కడ కార్మికులను అక్కడే భయభ్రాంతులను చేసేవారు. ఆ విధంగా కొంత కాలం సమ్మెలు జరగకుండా చూడగలిగింది కంపెనీ. కానీ, శంకరయ్య, పోశంల అరెస్టులతో పరిస్థితి విషమించి తారుమరైంది.
కంపెనీ, యూనియన్లు, పోలీసులు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. కార్మికుల్లో రాజుకున్న అసంతృప్తి అంటుకున్నది. అంతేకాకుండా వెయ్యావుల గొల్లలయిన యూనియనోళ్లు కర్ర ఇరగకుండా పాము చావకుండా కార్మిలను సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో కార్మికుల్లో పోరాటపటిమను పాదుకొల్పడానికి, కార్మికుల సమస్యలపై సమిష్టిగా కలుపుకుని రావడానికి కొందరు పనిచేస్తున్నారని చెప్పడానికి నవలలో కొన్ని నిదర్శనాలున్నాయి. శంకరయ్య ట్రాన్స్‌ఫర్ సమస్యను ఊతగా గైకొని వారు కార్మికుల్లో స్థానం సంపాదించడానికి కృషి చేస్తారు. ఈ విషయాన్ని వాచ్యంగా చెప్పకపోవడం పవన్ కుమార్ ప్రతిభ కనబడుతున్నది.
తన అరెస్టు నుంచి జరిగిన సమ్మె నుంచి శంకరయ్య ఎంతో నేర్చుకున్నాడు. విడుదలై వచ్చిన తర్వాత తన ట్రాన్స్‌ఫర్ గురించి తన సహచరులు ప్రస్తావిస్తే - నాకు మిమ్మల్నందరినీ సూత్తాంటే ఏం జెప్పాల్నో తోత్తలేదు. గింతమంది ముంగట నేన్నడు మాట్లాడి ఎరుగ. గిప్పుడు నా వొక్కని సంగతి పక్కకు పెట్టి మనందరి సంగతి ఇసారం జెయ్యిండ్రి. టెనింక్ లైన్ల నుంచి వనింక్ లైన్లకస్తే బాథలు తీర్తాయా. ఈడ దూరానికి కాళ్లు గుంజుకపోతే ఆ మరోటి మరోటి ఉంటది. ఇగ గట్ల అందరికీ ఏవో వో తఖిలీబులు ఉండనే ఉంటయి. నెరీ ఏడాది నుంచి బాయి పనోల్ల మీద పగబట్టినట్లు జేత్తండ్రు. రాచ్చసి బాయి పనిల పుట్టెడు బండ కిందికి పోవాలె. ఆడ మనకు పుట్టెడు కట్టాలున్నాయి. గయ్యన్నీ... అనగలిగే స్థాయికి శంకరయ్య ఎదిగాడు. ఇప్పటి శంకరయ్య నల్లటి ముఖంలో పీక్కుపోయిన దవడలు గల ముఖంలో బొగ్గు పెల్లల మధ్య అగ్గిలాగా అతని కండ్లు మెరుస్తున్నయి.
ఎస్ఆర్ పవన్ కుమార్ జనుల జీవద్భాషను పట్టుకున్నాడు. ప్రజల భాషలో ప్రజల కోసం ఆయన నల్లవజ్రం నవల రాశాడు. ఇందులో జనుల నిత్య జీవన గమనంలో అనాలోచితంగా, ఆయాచితంగా వెలువడే సామెతలు, నానుడులు కోకొల్లలు. తలె అమ్మి సెప్పులు కొనుక్కునే జాడ కాదు, ఇంత బతుకు బతికి ఇంటెనుక సచ్చినట్టు, ఎవరికి పుట్టినవ్ బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఏడ్చినట్టు, సాయి సంసారే కని లచ్చిదొంగ, గాడిద పుండుకు బూడిద మందు - పవన్ కుమార్ పేద కార్మికుల బతుకుల అధ్యయనానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే
- కాసుల ప్రతాపరెడ్డి












Click it and Unblock the Notifications