జాక్‌పాట్ కొట్టిన రావురి భరద్వాజ
హైదరాబాద్: జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ రావూరి భరద్వాజ జాక్‌పాట్ కొట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల నజరానా అందచేసింది. రవీంద్రభారతిలో గురువారం సాయంత్రం ఆయనను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. రాష్ట్ర అధికార భాషా సంఘం, రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 10 లక్షల రూపాల చెక్కును అందచేయగా, అధికార భాషా సంఘం తరఫున అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ లక్ష రూపాయల చెక్కును, రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరఫున మంత్రి వట్టి వసంతకుమార్ మరో లక్ష రూపాయల చెక్కును అందచేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. భవిష్యత్తు తరాలకు రావూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగుభాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ, యువతకు నేటి తరం ప్రేరణగా నిలవాల్సి ఉందన్నారు. త్వరలోనే మరో జ్ఞానపీఠం అవార్డు తెలుగువారికి దక్కాలని ఆయన ఆకాంక్షించారు. జూన్ నుండే ‘తెలుగుబాట' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డు రావడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణమని సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు. నోబెల్ బహుమతితో సమానమైన జ్ఞానపీఠ అవార్డు తెలుగువాడికి రావడం గర్వకారణమని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.
జ్ఞానపీఠ అవార్డు తనకు రావడం ‘ఈశ్వరేచ్చ' అని రావూరి భరద్వాజ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సన్మానాన్ని అందుకున్న తర్వాత రావూరి స్పందిస్తూ - తెలుగుభాష, తెలుగు సంస్కృతి వికాసానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగువారికి గర్వకారణమన్నారు. తాను కష్టాల్లో మునిగి ఉన్న సమయంలో ఐదు రూపాయలు సాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లుకు జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికైన ‘పాకుడురాళ్లు' పుస్తకాన్ని అంకితం చేశానని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications