India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరిగిపోని ' చేరా' తలెన్నో

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేరాగా పిలువబడే డాక్టర్‌ చేకూరి రామారావు హృద్రోగంతో మృతి చెందారు. ఆయన వయసు 80 ఏళ్లు. 1934 అక్టోబర్‌ 1న ఖమ్మంలోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ(తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభద్రులయ్యారు.

తెలుగు వాక్యం-పదవర్ణ సహితం అంటూ తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధనఅనతి కాలంలో అందరి మన్ననలు పొంది వివిధ విశ్వ విద్యాలయాల పాఠ్యాంశంగా, ఇతర పోటీ పరీక్షలు, ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా నిలిచింది. ఆ పుస్తకాన్ని ఆచార్య జెరల్డ్‌ బి.కెలీ (1928-1987)నిరంతర స్మృతికి అంకితమివ్వడం ఒక విశేషం. ఆయన తెలుగు భాషకు, వ్యాకరణానికి, సామాజిక భాషాపరిశోధనకు చేసిన సేవకు కృతజ్ఞతగా సముచిత గౌరవాన్ని ఈ విధంగా చేకూరి రామారావు గారు కలుగజేసారు. తెలుగు లో వెలుగులు చాల లోతైన పరిశీలానావ్యాసాల సంకలనం రచించి ఆచార్య నాయని కృష్ణకుమారికి అంకితమిచ్చారు.

ఆంధ్ర సారస్వత పరిషత్‌ 1982 లో దానిని ముద్రించింది. సంప్రదాయ వ్యాకరణ విద్యకు, ఆధునిక భాషా శాస్త్రానికి మధ్య సహేతుకంగా హేతుబద్ధ సేతువును నిర్మంచడంలో చే.రా. మాష్టారు సఫలంచెందారు. సాహిత్య విమర్శ - పరామర్శ పేరిట వివిధ కవుల, ప్రక్రియల, వాదాల, విధానాల, కవిత్వ ఉద్యమాలపై '' చేరాతలు ''గా మనకు అందించి ఎంతో మేలుచేసారు. ఆయా కవుల కవితాతత్వం అరటిపండు వలచినట్లు చేసారు. ఈ పుస్తకాన్ని చేరా అభినందన సభ పేర జరిగిన సందర్భంగా సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటీ మార్చి 2003 లో వెలుగులోకి తెచ్చింది.

Kapila Ramakumar on Chekuri Rama Rao

మొదటి ప్రచురణ 1991 లో జరిగినా రెండవ ముద్రణ భాగ్యం ఖమ్మానికి దక్కింది. ఆర్టిస్టు మోహన్‌ మాటల్లో '' నెమలీకలు రెండూ, సీతాకోక చిలకరెక్కలు పదకొండూ,బంతిపూలరేకులు పన్నెండూ, చిటికెడు వెన్నెలా, స్పూను విషాదశ్త్రు తుషారాలు తుంపి, ఈ సిబ్బెలో వేసి, రెండు కిలో రాళ్ళు ఆ సిబ్బెలో వేసి మూడుముప్పావలా అని తేల్చే ఈ తూనికలూ, కొలతల మంత్రి ఎవడండీ బాబూ అనుకున్నాం. అనుకున్నట్లే కవుల కంప్లైంట్‌ బాక్స్‌లొచ్చాయి. కమాన్‌ బైటికిరా చూసుకుందాం అనే గొడవలయ్యాయి. వాద వివాదలన్నిటినీ సాహితీప్రపంచం సరదాగా చూసింది. సీరియస్‌గా ఫాలో అయింది.

ఏళ్ళు గడచినా చేరాతలపై మోజు తగ్గలేదు. ఆసాక్తి సన్నగిల్లలేదు. అన్ని వివాదాలను తట్టుకుని నిలబడ్డారు చేరా, కాలర్‌ పట్టి, గుండీని వూడదీసిన యాంగ్రీ యంగ్‌మన్‌ని కూడా నవ్వుతూ పలకరించి, సుతారంగా జవాబిచ్చారు. అందులో రీజన్‌ కనిపించింది. ఉద్రేకం నిల్‌. పక్షపాతం బొత్తిగాలేదు. కవి, మహిళ,దళిత, లెఫ్ట్‌ అండ్‌ రైట్‌తో పనిలేదు. కేవలం కవిత్వంతోనే పని. లోపలి పేజీల్లోకి వెళ్ళండి. చేరా కనబడతారు చెరగని చిరునవ్వుతో.'' చేరా గారి కవిత్వానుభవం సంకలనం చదివిన మన మోహన్‌ మాస్టార్కి మార్కులేదాం అంటూ కితాబివ్వటం గమనించతగినది. 2001 లో ప్రచురించబడిన సంకలనం కవిత్వంపై చేరాతలలో ఎంపిక చేసిన వ్యాసాలు యిందులో చోటుచేసుకున్నాయి.

ఇక '' స్మృతికిణాంకం ''అనేది సాహిత్యాన్ని నెమరు వేసుకోటంలోనూ, సాహితీమూర్తులను తలచుకోటంలోనూ ప్రాధాన్యత కలిగిన స్మరణ వ్యాసాల సంపుటం 200 లో వెలుగులోకి వచ్చింది దీనిని హేతువాద మిత్రులు, సాహితీ ప్రియులైన కోటపాటీ మురహరిరావు,నర్రాకోటయ్యలకు సంస్మరిస్తూ చేరా తన బాల్యాన్ని, అక్కడి నుండి సాగిన తన సాహితీ ప్రయాణంలో ఎన్ని మలుపులూ, కుదుపులూ, సాహితీ వ్యాసంగం పూసగుచినట్లు తన అనుభవాలను ఒకచోట చేర్చారు చేరా మాష్టారు. ' సాహిత్య మహిళావరణం ' పేర కేవలం మహిళా కవులు, రచయితలను వారు తెలుగు సాహిత్యానికి సంబంధించే వారు నెరపిన ఉత్తేజకరమైన సృజన అన్ని పార్శ్వాలనుండి తడిమి వారి గొంతుకలో పలుకుతున్న స్వర తీవ్రతను బేరీజు వేయటంలో, సమతుల్యతను, నిర్మొహమాటాన్ని ప్రదర్శించి వారి వెన్నుతట్టి, ప్రోత్సహించి, మార్గాలు చూపి, కొన్ని ముఖ్య ఘట్టాల్ను పదిలపరిచిన సంకలనం ఓల్గా లాంటివారు స్వీకరించిన విశ్లేషణ వ్యాస సంపుటం 2001 లో స్వేచ్చ ప్రచురణల ద్వారా పాఠకలోకాని అందింది.

తదుపరి మనకు కనిపించేది సాహిత్య వ్యాస ' రింఛోళి ' (సమూహము,గుంపు అనే అర్థం)2001 లోనే వచ్చిన మరొక సాహిత్య, సాహిత్య విమర్శనాల వ్యాస సంకలనం బేతవోలు రామ బ్రహ్మంగారికి అంకితమిచ్చిన రింఛోళి పలువురి ప్రశంసలను అందుకుంది. ప్రాచీన కావ్యాల పరిచయాలనుండి, ఆధునిక కావ్యాల పలుకరింపులదాకా కోవేల సంపత్కుమారాచార్య ' చేరానుశీలనం ' తో మొదలుగాబడి, పురాణ, ప్రబంధ, చంపూ, ముత్యాలసరాలు, శ్రీశ్రీ, ఆరుద్రల వరకు, సాహిత్య విమర్శనాపద్ధతులు,మార్క్సిస్టు విమర్శనాపద్ధతులు, ప్రజల భాషావికాసంతో సాహిత్యం, గ్రాంథిక, వ్య్వహారా భాషాశైలులు ఎన్నో ఇక్కడ తడమి మనకు అధ్యనం నిమిత్తం చేరా గారందించారు.

2002 లో వెలువడిన సాహిత్య ' కిర్మీరం' (రంగుల కలయికలా, కాంతిచ్ఛటలు) చేరా గారు ద్రష్ట, కవిస్రష్ట, విమర్శకుడు మూడూ అంశాల కలసిన వారి వ్యాస సంకలనం ఓ రంగుల సాహితీ తివాసీలాంటిది. ఈ సంకలనంపై కంఘంపాటి సుశీల గారు ముందుమాటలో ' చేరాతలన్నీ వేటికవి విడివిడిగా చదువుకుని ఆనందించవచ్చు (అది మీ యిష్టం) అనుస్యూనత లేకుండా వుండటంలో-మళ్ళీ పోలిక పెడుతున్నాను! '' smorgasbord '' లా వుంటుంది ( అన్ని రుచులు విడివిడి items తొ కూడిన scandinavian buffet) మరొక పుస్తకం ''భాషానువర్తనం'' 2000లో చేరా పబ్లికేషన్‌ పేర ముద్రించబడింది.

వాడుక భాషా, భాషా శాస్త్రాల సమతుల్యత, తేదాలు, సందర్భాలు, ఉచితానుచితాలు, వాదం, వివాదం,అనువాదం, అనే శీర్షికలతో డా. సీతారాం ముందుమాటతో యెన్నో అంశాలు మనకు బోధకమవుతాయి. '' భాషా శాస్త్రం - భాషలోని లోపాలు తెలియచేయటం, వ్యాసరచన నేర్పగల ఉపాధ్యాయూడుగా, పరభాషా బోధకత, సాహితీ కళాభినివేశం, మనస్తత్వ శాస్త్రజ్ఞత, నృసాస్త్ర వేత్తగా, అవసరం మేరకు మతబోధకుడుగా, చరిత్ర రచయితగా తత్త్వవేత్తగా, భాషా ప్రసార సంబంధ యింజనీరుగాను నిర్వర్తించడం పాఠ్య ప్రణాళిక అని చార్లెస్ ఎఫ్‌. హాకిట్‌ రాసిన ''A course in modern linguistic(1958) '' పరిచయ అధ్యాయంలో '' అనేకమంది భాష గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవలసిన వృత్తిపరమైన అవసరం వున్నది ' అని పై ఉదాహరణలు ఉటంకించాడు. అవిగాక మరెన్నో వున్నాయనికూడ తెలుస్తున్నది ''. అందుకే ఒకరు ' నీకు వాడుక భాష గురించి ఏమీ తెలియదు ' అని అంటే '' పోవోయ్‌ నీకు అసలు భాషా శాస్త్రం అంటేనే ఏమీ తెలియదు ' అని వాదులాడుకునే రోజుల్లో యిలాంటి వ్యాస సంకలనాలు మనకు అందించారు చేరా మాష్టారు.

2003 లో చేరా అభినందన కమిటీ, ఖమ్మం వారు ' భాషాపరివేషం ' - బాషానుభవ వ్యాసాలు అనే గ్రంథం వెలువరించారు. ఇందులో ఆధునిక ప్రమాణ భాషా స్వరూపం రచనకు కొన్ని సూచనలు, వ్యాకరణ శ్లేష, - సందేహాలకు సమాధానాలు, భాషా శైలి-రచనా భేదాలు, రెండు విమర్శలు - ఒక సమాధానం, యిలా పలు భాషాపరమైన, రచనాశైలికి సంబంధించి అమూల్యమైన వ్యాసాలు అందిన 'చేరా' మన (మరణం 24 జూలై 2014)మధ్య లేకపోయినా వారి మార్గదర్శకత్వం భావి కవులకు, రచయితలకు ఎంతో ఉపయోగం. వాటిని పాటించి, తమ రచనలను మెరుగుదిద్దుకోవటమే మనమిచ్చే నివాళి.

వ్యాస కూర్పు: కపిల రాంకుమార్,
ఖమ్మం 507 002 9849535033

English summary
Kapila Ramakumar pays homage to Telugu literary personality and a linguist Chekuri Rama Rao, popolarly known as Chera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X