వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథామర్మం తెలిసిన రచయిత

By Pratap
|
Google Oneindia TeluguNews

"A short story is a short piece of fiction aiming at unity of characterization, theme and effect" అని కథకు నిర్వచనంగా చెప్పుకుంటాం. అదే సమయంలో కథ కాల్పనిక సాహిత్యం కూడా. కాల్పనిక సాహిత్యం ఊహాశక్తికి సంబంధించింది. రచయిత ఊహాశక్తి ఉత్తమ కాల్పనిక సాహిత్యాన్ని అందిస్తుంది. ఆ కాల్పనికత వాస్తవికతకు సంబంధించింది. సంఘటనలను యధాతథంగా కాకుండా సంఘటనల వెనక గల కార్యకారణాలను, పరిణామాల పయనానికి వెనక పనిచేసే శక్తులను, విధానాలను చెప్పేది వాస్తవికత. ఐదు అంశాలు సమానమైన పాళ్లలో ఒదిగితే ఉత్తమ కథారచన ఆవిర్భవిస్తుంది. అవి, characters, setting, plot, conflict, theme.ఈ ఐదు కూడా సమపాళ్లలో కుదిరినప్పుడు ఉత్తమ కథాసృజన జరుగుతుంది.

పర్కవెల్లి యాదగిరి కథలు నన్ను ఏకబిగిన చదివించడానికి కారణమేమిటని ఆలోచించినప్పుడు నాలో ముప్పిరిగొన్న ఆలోచనలను ఆ ఐదింటి పరిధిలో చెప్పాలనిపించింది. యాదగిరి నాకు కొత్త. ఆయనతో నాకు ముఖపరిచయం కూడా లేదు. మొబైల్‌ ఫోన్‌లో నన్ను తరమడానికి చేసిన సంభాషణలు మాత్రమే నా అనుభవంలోకి వచ్చాయి. ఆయన నేపథ్యం కూడా నాకు తెలియదు. కానీ, కథలన్నీ చదివిన తర్వాత ఆయన నాకు చిరకాలంగా పరిచయం ఉన్నట్లే అనిపించింది. అందుకు కారణం, ఆయన కథానిర్మాణంలోని మెలుకువలను పట్టుకున్నారు. కథ ఎంత బిగువుగా ఉండాలో అంత బిగువుగా రాయడం ఆయన తెలిసిన విద్య అనిపించింది. ఈ మధ్య నాకు కథలు చదువుతుంటే విసుగు కూడా వస్తున్నది. అటువంటి స్థితిలో నేను కథాసాహిత్యాన్ని చదవడమే మానేశాను. మళ్లీ ఓసారి యాదగిరి నన్ను ఆ వైపు దృష్టిని మళ్లింపజేశారు.

శిల్పం లేదా శైలి అనే మాట ఎత్తితే చాలా మంది కథారచయితలు విరుచుకుపడుతున్నారు. అది ఏదో బ్రహ్మపదార్థమని కూడా అనుకుంటున్నారు. పఠనయోగ్యంగా ఉండడం కథకు ఉండాల్సిన ప్రథమ లక్షణమని నేను అనుకుంటూ ఉంటాను. పఠనయోగ్యతను సాధించడానికి అవసరమైనవే పైన చెప్పిన ఐదు అంశాలు. ఆ ఐదు అంశాలు చక్కగా కుదరడమనేది చూసుకుంటే అది శిల్పమవుతుంది. అయితే, ప్రతీ రచయితకూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ముందు కథాశిల్పాన్ని సాధిస్తే, ఆ తర్వాత ప్రత్యేమైన శైలిని సాధించుకోవచ్చు. యాదిగిరిది ప్రత్యేకమైన శైలి అని చెప్పలేం గానీ అన్నీ సమపాళ్లలో కుదిరిన ఉత్తమ కథలుగా మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే, చాలా కాలం తర్వాత చక్కటి తెలంగాణ కథలను చదివిన అనుభూతిని ఆయన కథలు కలిగిస్తాయి. వస్త్వైక్యం కుదురుకుని ఆయన కథలు రచయిత ఉద్దేశించిన లక్ష్యాన్ని అంటే, థీమ్‌కు సంబంధించిన కేంద్ర బిందువుకు చేరుకుంటాయి, రచయిత ఉద్దేశించిన ఆలోచన వైపునకు తీసుకుని వెళ్తాయి.

కథ సమస్య నుంచి పుడుతుంది. సమస్య కారణంగా జనించే సంఘర్షణ కథను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అది వ్యక్తుల మధ్య సంఘర్షణ కావచ్చు. రెండు ఆలోచనాధోరణుల మధ్య సంఘర్షణ కావచ్చు. ప్రధాన పాత్ర ఇతర పాత్రలతో, ప్రాకృతిక శక్తులతో, సమాజంతో సంఘర్షిస్తాడు, వాటిపై పోరాటం చేస్తాడు. అంతేకాకుండా, పాత్రలోని రెండు విరుద్ధమైన ఆలోచనలకు మధ్య సంఘర్షణ కూడా కావచ్చు. ఈ రకంగా చూసినప్పుడు యాదగిరి కథల్లో ఇవి అత్యంత స్పష్టంగా, ప్రతిభావంతంగా కనిపిస్తాయి. రెండు విరుద్ధశక్తుల మధ్య వైరుధ్యం ఎంత బలీయంగా ఉంటే, రచయిత దాన్ని ఎంత బలీయంగా చిత్రీకరించగలిగితే కథ అంత అర్థవంతంగా, అంత బలంగా రూపుదిద్దుకుంటుంది. యాదగిరి రాసిన ఒకటో రెండో కథలను ఇక్కడ ఉదహరిస్తే అది అన్యాయం చేయడమే అవుతుంది, ఆయన అన్ని కథల్లోనూ అది ప్రస్ఫుటంగా, శక్తిమంతంగా కనిపిస్తుంది.

కథారచనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించడంలో కూడా యాదగిరి పట్టు సాధించినట్లు కనిపిస్తారు. ఆ రకంగా యాదగిరి కాలస్థల నిర్దేశాలు. దానికి తగిన plot కూడా ఆయన కథలను ఉత్తమంగా తీర్చిదిద్దాయి. సంఘటనల కూర్పు, పాత్రల చర్యలు ఇందులోకి వస్తాయి. కథను అవి రచయిత ఉద్దేశించిన వైపు తీసుకుని వెళ్లడానికి ఇవి పనికి వస్తాయి. ఆ పని యాదగిరి చాలా ప్రతిభావంతంగా చేశారు.

వాతావరణ కల్పనలో, పాత్రల మానసిక చింతనలో, ఎగుడుదిగుళ్ల సామాజిక అంతస్థుల చిత్రణలోనే కాకుండా భాషలోనూ, వ్యక్తీకరణలోనూ ఆయన వైవిధ్యం కనబరిచారు. తాను తీసుకున్న సమస్యను ఓ శ్రీశీస్త్రఱషaశ్రీ వఅసకు తీసుకుని వెళ్లడానికి వాటిని సమయోచితంగా వాడారు. ‘సౌందర్యమోహనం' కథను ‘శిల్లరజిత్తు', ‘శికారి' వంటి ఇతర కథలతో పోల్చి చూస్తే ఆయన కథారచనలో పాటించిన సమయోచిత వైవిధ్యం, వ్యక్తీకరణ తీరు, కథన రీతి మనకు అర్థమవుతాయి. ఆ సమర్థత వల్ల యాదగిరి కథలకు అద్భుతమైన క్లుప్తత ఒనగూరింది. క్లుప్తత అనేది నిడివికి సంబంధించింది కాదు. కథ నిడివితో సంబంధం లేకుండా బిగువును సాధించడానికి అవసరమైన రచనానైపుణ్యానికి సంబంధించింది. అది జ్ఞానసంబంధమైన బరువును దించుకుని, పాత్రల్లోకి రచయిత పరకాయ ప్రవేశం చేసినప్పుడు సాధ్యమవుతుంది. తాను ఉద్దేశించిన పాత్రలు, అవి జీవిస్తున్న పరిస్థితులు, అవి పడుతున్న మానసిక సంఘర్షణలు, ఇతరులతో చేస్తున్న పోరాటాలు తానై అనుభవించాలి. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి, ఒక పరిస్థితి నుంచి మరో పరిస్థితికి, ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి, ఒక కులం నుంచి మరో కులంలోకి వెంటవెంటనే పరకాయ ప్రవేశం చేస్తూ వెళ్లాలి. అంటే, రచయిత సమాజంలోని అన్ని అవస్థలను ఏకకాలంలో అనుభవించాలి. తాను సృష్టించిన పాత్రల పరిమితులు, ఆ పాత్రల కాలస్థల నిర్దేశాలు, మానసిక అవస్థలు రచయితకు తెలిసి ఉండాలి. ఏ మాత్రం పక్కకు జరిగినా కథ చేయి దాటిపోయి బౌద్ధిక ఆధిపత్యం చోటు చేసుకుని, పాఠకులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ రకంగా చూసినప్పుడు యాదగిరి తెలంగాణలోనే కాకుండా తెలుగు సమాజంలో కూడా ఎన్నదగిన కథారచయిత అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.

 Kasula Pratap Reddy on Parkaveeli Yadagiri's short stories

2

యాదగిరి అన్నింటికన్నా ముఖ్యంగా సమాజంలో స్థిరపడిన కొన్ని భ్రమలను పటాపంచలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ వ్యాపారం వంటి సమకాలీన విషయాలకు సంబంధించిన భ్రమలను రచయిత తన కథల ద్వారా తొలగించారు. ఈ రెండు తెలంగాణ సమాజాన్ని పట్టిపీడిస్తున్న వైనాన్ని, బలహీనులను అణచివేస్తున్న తీరును, అనుత్పాదక రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న వ్యక్తులు, శక్తులు ఉత్పాదక రంగంలోని వ్యక్తులపై, శక్తులపై చేస్తున్న బలప్రయోగాన్ని ఆయన సమర్థంగా చిత్రించారు. రచయితగా తాను ఎక్కడ కూడా అసందర్భంగా ప్రవేశించకుండా ఆ సామాజిక రుగ్మతలను ఎత్తిచూపారు యాదగిరి. దాదాపుగా సమస్యలన్నింటిలోనూ ఈ రెండు విడదీయలేనంతగా కలిసిపోయాయి. అప్పులు ఇవ్వడం, భూవ్యాపారం చేయడం అనేవి కొత్త రూపాలను, కొత్త సారాన్ని ఇముడ్చుకున్న తీరును రచయితగా అర్థవంతంగా చిత్రించారు. అర్థిక సంస్కరణల అమలు తొలి దశ దాటి, రెండో దశలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఉత్పాదక రంగానికి ప్రాధాన్యం తగ్గి, అనుత్పాదక రంగానికి ప్రాధాన్యం పెరగడమనే లక్షణం సమాజంలో ఏ విధమైన అసమానతలకు దారి తీస్తుందో, ప్రజలను ఏ విధంగా పరాయికరణకు గురిచేస్తుందో, తాను నిలబడ్డ గడ్డ మీది నుంచి ప్రజలను ఏ విధంగా తొలగించి వేస్తుందో ఆయన కథలన్నీ చెబుతాయి.

మరో భ్రమను కూడా యాదగిరి కథలు బద్దలు కొట్టాయి. ఇటీవల నేను ఓ సర్వే నివేదిక ఫలితాలను చదివాను. అలవోకగానే అయినా అది బుర్రను పురుగులా తొలుస్తూనే ఉంది. అసలు విషయాన్ని చాటింపు వేసి చెప్పాలని అనిపిస్తూ ఉంటున్నది. అదేమంటే, నగరంలో పేదరికం పెరుగుతూ, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్నది అనేది. అంటే, గ్రామాలు అభివృద్ధి చెందాయనే ఆలోచనను అందించడానికి ఆ సర్వే ప్రయత్నించింది. నాకెందుకో ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్లు అనిపించింది. నగరాల్లో మురికివాడలు పెరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం, నగరాలు జనాభా బరువుతో కృంగిపోతున్న విషయం కూడా తెలియంది కాదు. యాదగిరి కథలు ప్రజలు నిలువనీడను కోల్పోతూ, తమకు ఆదరువుగా నిలిచిన పంట పొలాలను అనివార్యమైన స్థితిలో వదులుకుంటూ నగరాలకు దారి పడుతున్న సామాజిక చలనాన్ని చిత్రించాయి. పేద ప్రజలు మాత్రమే కాదు, రైతులు కూడా భూములను కోల్పోయి నగరాల్లో అభద్రతతో కూడిన రంగాల్లోకి ప్రవేశించే విలోమ ప్రక్రియను ఆయన తన కథల్లో చిత్రించారు.

ఇక, యాదగిరి కథల్లో మానవ సంబంధాల ఉన్నతీకరణ అనేది చూస్తాం. సమాజంలోని అమానవీయమైన ధోరణులకు, మానవీయ ధోరణులకు మధ్య సంఘర్షణను చిత్రిస్తూ మానవ సంబంధాల ఉన్నతీకరణదశలను యాదగిరి తన కథల్లో చిత్రిక కట్టారు. మనుషులు అన్ని వేళలా ఒకే రీతిగా స్పందించరని, ఒకే రీతిగా ఉండరని చెబుతూ పరిస్థితులు వారిని ఎలా నడిపిస్తాయో చూపించారు. పరిస్థితుల ప్రభావం, ఆదే కాలమహిమ కనిపించని శక్తిగా పనిచేస్తూ సమాజాన్ని ఏ వైపు నడిపిస్తుందనే విషయాన్ని ఆయన కథల ద్వారా చూపించారు.

భాషకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించాల్సిందే. యాదగిరికి భాషావాడకానికి సంబంధించిన విశేషమైన తెలివితేటలు ఉన్నాయని అనిపిస్తుంది. తెలంగాణ భాషను ఎంత పఠనయోగ్యంగా, రుచీపచీ ఉండేట్లుగా వాడవచ్చునో ఆయన కథలను చదివితే అర్థమవుతుంది. కేవలం క్రియారూపాలను మాత్రమే మార్చి, బరువైన సంస్కృత పదాలను వాడితే పంటికింద రాయిలా ఉండడమే కాకుండా తెలంగాణ భాషాగౌరవం కూడా తగ్గుతుంది. యాదిగిరి వంటి ప్రతిభావంతులైన రచయితల చేతుల్లో దాని గౌరవం పెరుగుతుంది. కథాప్రక్రియకు సంబంధించి తెలంగాణ భాషా ప్రయోగానికి యశోదారెడ్డి, జాజుల గౌరవాన్ని సంతరించి పెట్టారు. ఇప్పుడు పర్కవెల్లి యాదిగిరి కూడా.

3

మొత్తంగా యాదగిరి కథల గురించి నేను చెప్పాల్సినంత చెప్పలేదేమో అని కూడా అనిపిస్తున్నది. కానీ, తెలంగాణ కథలకు జవజీవాలున్నాయని చెప్పడానికి ఆయన కథలు నిదర్శనంగా నిలుస్తాయి. అంతేకాదు, అనుభవవాదాన్ని ఆయన కథలు పూర్వపక్షం చేస్తాయి. రచయిత లోచూపు ఇతరుల అంతరంగాలను, జీవితాలను కూడా నిబద్ధతతో, నిజాయితీగా అర్థం చేసుకున్నప్పుడు మంచి సాహిత్యాన్ని సృజించగలడని కూడా యాదగిరి కథాసాహిత్యం అనుభవంలోకి తెస్తుంది. తెలంగాణలో చాలా మంది కథారచయితలు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత, అంటే గుర్తింపు వచ్చిన తర్వాత అలవోకగా కథలు రాయడాన్ని పనిగా పెట్టుకున్నారు. దానివల్ల ఆ కథారచయిత ప్రత్యేకమైన శైలిని సంతరించుకునే దశకు చేరుకోవడం సాధ్యం కాదు. అత్యంత అరుదుగానే అయినా, ఇంత వరకు రాసిన కథలకు తీసిపోని కథలను రాయడానికి మాత్రమే యాదగిరి పూనుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఎక్కువ కథలను రాయాలనే లౌల్యానికి గురి ఆయన గురి కారనే విశ్వాసం నాకు ఉంది.

(పర్కవెల్లి యాదగిరి కథల సంపుటికి రాసిన ముందుమాట)

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Parkavelli Yadagiri's Telugu short stories are well crafted and depicted social issues like real estate and finacial barrowings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X