• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బియస్ రాములు కథ: నిర్మల

By Pratap
|

పదో తరగతి అయిపోయాక నిర్మల జగిత్యాలలోనే ఉండి కాలేజీ చదువుకుంటే మంచిదని హైదరాబాద్‌లో ఉన్న అన్నా, వదినల ఉద్దేశ్యం. తల్లి, కూతుళ్లకు హైదరాబాద్‌లో కొడుకు, కోడలు దగ్గర్నే అందరం ఉంటే మంచిదని ఆశ. సెలవుల కోసం హైదరాబాదు రమ్మన్నారు గాని, హైదరాబాదులో ఉండనిస్తరో లేదో... ఇదే పెద్ద పరీక్షలా భయపడుతోంది నిర్మల. నాన్న బతికి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు.

అందరు హైదరాబాదులో ఉంటే ఖర్చు ఎక్కువ. జగిత్యాలలోనే ఉండి చదువుకుంటే మంచిది. తమ పిల్లలను కూడా హైదరాబాదు స్కూల్లో జాయిన్‌ చేయకుండా జగిత్యాలలోనే అమ్మ దగ్గర్నే ఉంచితే మంచిదని అన్నా వదినల ఆలోచన.

వదినకోసం అమ్మ హైదరాబాద్‌ పోయిన్నుంచి అన్నయ్యనించి ఉత్తరమేలేదు. అన్నా, వదిన ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలను చూసుకునేందుకు అమ్మను పిలిపించుకున్నారు. నిర్మలకు పదో తరగతి పరీక్షలు ఉన్నప్పటికీ పోకపోతే కొడుకు ఎన్ని మాటలు అంటాడోనని భయంతో వెళ్లిపోయింది. వాళ్లు తనకోసం హైదరాబాదు తీసుకు పోవటానికి రాకపోయినా బస్సు చార్జీలైనా ఎం.వో చేస్తారనుకుంది... ఎస్‌ఎస్‌ఎస్సీ పరీక్షలు బాగా రాశామని సంతోషంతో చివరి పరీక్ష దాక వాటన్నిటిని మరిచిపోయింది నిర్మల.

రాజేశ్వరి తన పెద్దకొడుకు రమేషుకు నిర్మలను చేసుకోవాలనుకుంటున్నది. తన కళ్లముందు ఎదిగిన పిల్ల. కూతురు నీరజలాగే ఇంట్లో అలివైపోయిన పిల్ల. చెప్పిన పనల్లా చేస్తుంది. అటు చదువుకుంటూ బీడీలు కూడా చేయడం నేర్చుకుంది. ఊళ్లో సంబంధం అన్నీ కలసివస్తయి. నీరజ పెళ్లయినంక అత్తగారింటికి పోయినా తనకు వెలితి ఉండదు. వేరే కొత్త కోడలైతే ఎట్లా ఉంటదో తెలియదు. ఈ కాలపు ఆడపిల్లలు ఎదురు మాట్లాడ్డం ఎక్కువ. తన ఇద్దరు కూతుళ్లు అంతే. నిర్మల అలా కాదు... అనుకుంది రాజేశ్వరి.

నీరజతో తమకు దూరపు చుట్టరికం వుందని నిర్మలకు తెలుసు. ఇంత దగ్గరి చుట్టరికం వుందని మాత్రం తెలియదు.

తమ ఇంట్లోనే ఉంటూ ఎస్‌ఎస్‌ఎస్సీ పరీక్షలు రాయడానికి నీరజ తల్లి రాజేశ్వరి నిర్మలను ఒప్పించింది. నిర్మల వెంట ఉంటే నీరజ బాగా చదువుకుంటుందని రాజేశ్వరికి తెలుసు.

BS Ramulu's short story Nirmala

''జల్ది అన్నం పెట్టు అత్తా...'' గారాబం పోతూ తొందర చేసింది నిర్మల.

''మురిసి పోకున్రి, ఇంకో పరీకక్షుంది'' నవ్వుతూ అంది రాజేశ్వరి.

''లాస్ట్‌ పరీక్షదేముంది. ఫస్ట్‌క్లాసు తప్పది అత్తా'' ఉత్సాహంగా అంది నిర్మల.

''నాక్కూడా క్లాసు వస్తదే'' కృతజ్ఞతగా నిర్మలకేసి చూస్తూ తల్లితో అంది నీరజ.

''అత్తా... మేం మాట తప్పలేదు. మరి నువ్వుకూడా మాట తప్పద్దు. మేం పాసయితే మాకు లంగా, జాకీట్‌, ఓణీ పెడతానన్నవు. ఉత్తుత్తగా అన్న అని తప్పించు కోవద్దు ఆఁ!'' అంది నిర్మల.

''నామాట మీద గంత నమ్మకంలేదానే? అంత లావైతే యియ్యాల్లనే పోయి మన దుకాన్ల తీసుకో ! కుట్టుకూలి కూడా నేనే యిస్తా సరేనాయే...'' నవ్వుతూ కొసరి కొసరి వడ్డించింది రాజేశ్వరి.

ఆ మాటతో నిర్మలకు ఎగిరి గంతు వేయాలనిపించింది.

''నీరజా... ఇయ్యాల్ల పరీక్షయినంక సక్కగ దుకాన్లకే పోదామే'' అంది నిర్మల.

''అదే గాక వేరే ప్రోగ్రాంలున్నయి... మర్చిపోయినవా?'' అంటూ గుర్తుచేసింది నీరజ.

ముఖ్యమైన స్నేహితురాళ్లు కలిసి ఈరోజు సాయంత్రమే గ్రూపు ఫొటో దిగుదామనుకున్నరు. సాయంత్రం సినిమాకు పోదాం అనుకున్నరు. తన దగ్గర డబ్బులు లేవన్న విషయం గుర్తొచ్చి నిర్మలకు చిన్నతనంగా ఉంది. దాంతో ఉత్సాహం తగ్గి గంభీరమై పోయింది.

''ఇంతలోనే ఏమైందే అట్లా అయిపోతివి?'' ఆశ్చర్యపోయింది రాజేశ్వరి.

నిర్మల మౌనంగా భోజనం ముగించి లేచింది.

''ఏందే పొల్లా...! అపుడే నవ్వుతవు. అపుడే ముఖం మాడ్చుకుంటవు. ఇంత మాయెల్లమే ఏమైతదే నీకు?'' అనునయంగా అడిగింది రాజేశ్వరి.

నీరజ తల్లితో డబ్బుల విషయం గుసగుసలు పోయింది.

''ఎవలకు చెప్పకున్రి. ఇవి నేను బీడీలు చేసిన పైసలు'' అంటూ ఇరవైరూపాయలు నిర్మల చేతిలో పెట్టింది రాజేశ్వరి.

అమ్మ అలా చెప్పిందంటే ఆ డబ్బు వాపసు ఇవ్వకపోయిన చెల్లుతుందని నీరజకు తెలుసు. అదే విషయం నిర్మలకు గుసగుసగా చెప్పింది నీరజ. నిర్మల ముఖం మళ్లీ సంతోషంతో వికసించింది.

'పిచ్చిపిల్ల... ఈ కాస్తదానికే ఎంత బాధ పడిందో ! రేపు ఎలా బతుకుతదో' అనుకుంటూ అనునయంగా చూసింది రాజేశ్వరి.

ఇరువైరూపాయలు చేతిలో పడగానే ఎండకాలం చెప్పులులేని కాళ్ళకు చెప్పులు కొనుక్కోవాలనిపించింది. పరీక్షకు పోతూపోతూ తోవలో అదే మాట అంది నిర్మల.

''నువ్వు చెప్పులు తీసుకుంటే సినిమాకు, ఫొటోలకు నేనే పెడతా సరేనా?'' హామీ ఇచ్చింది నీరజ.

నిర్మలకు ఎంతో బరువు దిగినట్టయింది. కొత్త చెప్పులు తీసికొని కొత్త డ్రస్సు వెంటనే కుట్టించుకుని దాంతోనే ఫొటో దిగాలి అని నిశ్చయించుకుంది నిర్మల. మళ్లీ ఉత్సాహం తెచ్చుకుని గబగబా నడక సాగించింది.

పరీక్ష హాల్‌కాడ చివరిరోజుకూడా మల్లేశం హాజరుగా ఉండడం చూసి హుషారుగా నవ్వింది నిర్మల. మల్లేశం నకలు చిట్టీలు అందిస్తాడని కాదు గాని తనకు అలాంటి తమ్ముడు ఒకడు ఉన్నాడనే భావనే ఎంతో మనస్థయిర్యాన్ని ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. పరీక్షరాసి బయటకు వచ్చేదాక మల్లేశం తనకోసం కాచుకు కూచోవడం తనలో అభిమానాన్ని పెంచింది.

మల్లేశం వెనకే నీరజ తమ్ముడు రాజేష్‌ ఎక్కడినుంచో వూడిపడ్డాడు. ఇద్దరూ కలిసి వారిద్దరికోసం ఎదిరిచూడడం వాళ్ల దినచర్య అయిపోయింది. అందుకేనేమో మల్లేశం తాత, అమ్మ బీడీలకు దారం కట్టురా అనే అరుపులు తిట్లూ వాడి చెవికి ఎక్కనేలేదు. ఇంతా చేసి ఒక నకలు అందించింది లేదు. పోలీసులు అటు తరమడం వీళ్లు ఇటు మళ్లీ రావడంతోనే టైం సరిపోయేది. అయినా మల్లేశానికి అదోరకం సంతోషం.

ఆరోజు చివరి పరీక్ష. అన్నీ తేలిక ప్రశ్నలు రావడంతో గబగబా రాసేసింది నిర్మల. ఇంకా అరగంట ఉందనగానే పరీక్ష హాలునుండి బయటపడింది. అలా అయిదారుగురు పోగయ్యి అవి యివి ముచ్చటిస్తున్నారు. తమ ఫ్రెండ్స్‌ను చూసి కొంచెంసేపటికి ఈ గుంపులోంచి ఆ గుంపులోకి ఆ గుంపులోంచి ఈ గుంపులోకి మారుతున్నారు వాళ్లు. వాళ్లు అన్నలు తమ్ముళ్లు... వాళ్ల కోసం ఆ గుంపు చేరబోతున్నపుడల్లా ఆడపిల్లలు నవ్వులు ఆగిపోయి బిడియ పడుతున్నారు. అది గమనించి కొందరు వెనక్కివెళ్లి దూరంగా ఉండిపోయారు.

ఎండ జోరుగా ఉంది. తల మీద పరీక్ష ప్యాడులు అడ్డంపెట్టుకుంటున్నారు కొందరు. ఈ రోజు ఏ టైంకు ఏ ప్రోగ్రామో మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. అంతలో బెల్లుగొట్టేశారు. నీరజ కూడా వచ్చేసింది. పదిమంది ఫ్రెండ్సు కలిసినచోట ఎవరో స్వీటు తినిపిస్తాననడంతో అందరు హోటల్‌కేసి దారితీసారు. మల్లేశం, రాజేష్‌ వాళ్లని అనుసరించారు. నవ్వులు కేరింతలతో సాగుతున్నారు వాళ్లు. హోటల్‌కాడ మగవాళ్ల రద్దీ చూసి నవ్వులన్నీ టక్కున ఆగిపోయాయి.

మగవాళ్లు ఇటుకేసి ఎగాదిగా చూసారు. ఆడపిల్లలందరూ బిడియపడిపోయారు. నాకు ఆకలి అవుతుంది. నాకు వద్దంటే నాకు వద్దు అంటూ చిన్నబోయిన మొహాలతో ఎవరిళ్లకు వాళ్లు బయలుదేరారు.

నిర్మల నేరుగా బట్టల దుకాణానికి దారితీసింది. శంకరయ్యమామ ఎటో పోయినట్టున్నారు. గుమాస్తా పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. మామయ్య లేనందుకు లోలోన సంతోషించింది నిర్మల. ఎలాంటి బిడియం లేకుండా తనకు నచ్చింది తీసుకోవచ్చు అనుకుంది. బట్టలన్నీ నీరజ కుప్పవేయించింది.

మల్లేశం ''అక్కా! నీకు ఇదైతే మంచిగుంటది, అది మంచిగుండది'' అని పేచీలు పెట్టాడు. ముగ్గురుకి నచ్చిన డ్రెస్స్‌ని సెలక్టు చేసుకుంది నిర్మల.

చెప్పులు కూడా మంచివి సెలక్టు చేశారు. వస్తూ వస్తూ దారిలో డ్రస్సు అర్జంటుగా కుట్టడానికి ఓ ఫ్రెండు ఇంట్లో ఇచ్చింది. అయినా తృప్తి తీరలేదు నిర్మలకు. ఇంటికి చేరగానే మరో రంది పట్టుకుంది. నవ్వుతూ వస్తుందని అనుకున్న నిర్మల ఏడుపు ముఖంతో రావడం ఆశ్చర్యం కలిగించింది రాజేశ్వరికి.

''ఏందే కోడలా? ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటవేందే? కాల్లు గడుక్కపోండ్రి. అన్నం తిందురు'' అంటూ పళ్లాలు సర్ది అన్నం వడ్డించింది.

''నేను మల్లస్త'' అంది నిర్మల.

''ఇంత ఎండలో మల్ల యాడికే?''

''మాయింటిదాక పోయస్త. మనీఆర్డర్‌ గిట్ట వచ్చిందేమో'' అంది నిర్మల.

పరీక్షలయిపోవడంతో తల్లి మీదికి ధ్యాస మళ్లిందని గ్రహించింది రాజేశ్వరి. తనలోని తల్లిపేగుని కదిల్చినట్టయి మనసు కలుక్కుమంది. జాలితో హృదయం నిండిపోయింది.

''నీ ఎగిర్తం సల్లగుండ. ఇంటిదాకా వస్తే ఇక్కడికి రాక ఆగుతాదే? యియ్యాల్ల గాకపోతే రేపొస్తది. వస్తే మాత్రం ఆగుతాదే లచ్చవ్వకన్నా చెప్పకుండా పోతడా?''

అన్నం కలుపుతుంటే మళ్లీ ఏదో గుర్తొచ్చింది నిర్మలకు బొటబొటా కన్నీళ్లు కారాయి.

''ఛీ పిచ్చిపిల్ల గీయింత దానికే ఏడుస్తారే?''

నిర్మల భయం మరొకటి, నీరజ రేపే వాళ్ల అమ్మమ్మవూరు రాయికల్‌కు వెళ్లిపోతుంది. ఇంట్లో రేపట్నించి తానొక్కర్తే వుండాలి. నీరజ లేకుండా ఇక్కడ తానొక్కర్తే ఉండడం, తినడం తనకు తగని భయం. కనక తానే ఇంట్లో వంట చేసుకోవాలి. నీరజతోపాటు రాజేశ్‌కూడా అమ్మమ్మ యింటికెళ్లిపోతాడు. నీరజ యిల్లు బంధువుల యిల్లుగా కాకుండా క్లాసుమేటు యిల్లుగానే పరిచయం నిర్మలకు. దాంతో నీరజ లేకుండా ఈ యింట్లో ఉండడం మరీ బెరుకు. ఏమీ పలకలేదు నిర్మల.

''మీ అమ్మరాకపోతే మీ అక్కదగ్గరికి పోదువులేవే'' ఊరడింపుగా అంది రాజేశ్వరి.

తల అడ్డంగా వూపింది నిర్మల.

అక్క దగ్గరికి పోవచ్చు నిజమే. అక్క ఎంతో బాగా చూసుకుంటుంది కూడా. కాని ఆ యింట్లో ఎప్పుడూ పనే. క్షణం తీరికుండదు. చెల్లెలు అన్నమాటేగానీ పనిమనిషి తీరుగా ఎపుడు పనిచేస్తూనే వుండాలి. తనతోటిది అక్క కూతురు ప్రగతి ఒక్కపనికీ వంగదు. మగరాయుడిలాగా తిరుగుతుంటే తానేమో అన్నీ చేసిపెట్టాలి. ఆ యింటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటారు. అందరూ ఖరీదైన వాళ్లు. ఖరీదైన యిరుగు పొరుగు తను వాళ్లందరిమధ్యా అచ్చం పనిపిల్లలాగే వుంటుందికూడా. ఆయింటికెళ్తే ఎందుకో శ్వాస ఆడినట్టుగా వుండదు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది.

''అట్లయితే నీరజతోటి నువ్వుగూడ రాయికల్‌కు పోవే. మా అవ్వ మంచిగ అరుసుకుంటది. మావదినె కూడ మంచిదేనే మొన్న చూస్తివి గదనే మా వదినెను'' అంటూ యాదిజేసింది రాజేశ్వరి.

నిర్మల ఏమ్మాట్లాడలేదు ఏమో ఆవూరు కొత్త. నీరజ తప్ప తెల్సిన వాళ్లెవరూ వుండరు.

''అమ్మ దగ్గరికే పోత'' అంది నిర్మల ఏదో ఆలోచిస్తు.

''అట్లయితే అట్లనే గానీ, మూడు నాలుగు రోజులు చూసి ఎవలన్న పట్నంబోయేటప్పుడు పంపిచ్చేటట్టు మీ మామకు చెప్త తియ్యి. మరి ఏడ్వకు ఊర్కో'' సముదాయించింది రాజేశ్వరత్త.

ఆమాటతో కొంత ఊరట కల్గింది. కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ మామూలు మనిషయ్యే ప్రయత్నం చేసింది నిర్మల.

వీళ్లకోసమని తెప్పించిన జిలేబి పెట్టింది రాజేశ్వరి.

''నోరు తెరువే కోడలు పిల్లా'' నవ్వింది రాజేశ్వరి.

నిర్మల నోరు తెరిచేసరికి తల్లీ కూతుళ్లిద్దరు చెరో జిలేబి ఒకసారిగా నిర్మల నోట్లో కుక్కారు. నిర్మల ముహంపై రసమంతా పడి జిగట, జిగటగా వుంది.

''ఛీ ఫో'' అని నవ్వింది నిర్మల. రాజేశ్‌ నవ్వి పరుగున వెళ్లి అద్దం తెచ్చాడు.

''ఎట్లున్నవో ఓసారి చూసుకో'' అంటూ నవ్వాడు రాజేశం.

అద్దంలో తన మొఖం తాను చూసుకుని ముసిముసినవ్వులు నవ్వింది నిర్మల.

ఆరోజు అన్ని ప్రోగ్రాముల్లో ఉత్సాహంగా పాల్గొంది నిర్మల. కొత్తవోణి, లంగా జాకెట్టు నిర్మలకు ఎంతో బాగా కుదిరినాయి. అందరూ అభినందించారు. అది మల్లేశం పట్టుపట్టి ఎన్నిక చేసిన డ్రెస్సు కావడంతో మల్లేశానికి భలే సంతోషంగా వుంది.

ఫ్రెండ్స్‌ నాలుగు గ్రూపులతో గ్రూపు ఫొటోలు దిగారు. చూస్తుండగానే సమయం గడిచిపోయింది. ఫస్టు షో సినిమాకు టైమవుతోంది.

రాజేశ్వరత్త ఎంతవద్దన్నా మరుసటిరోజే సొంత వంట ప్రారంభించింది నిర్మల. మల్లేశం తల్లి లచ్చవ్వకూడా తమయింట్లోనే తినుమని చెప్పినా విన్పించుకోలేదు. ఆరోజు నీరజ అక్కడే వుండి పనంతా చేసి అక్కడే భోంచేసింది.

నాలుగోరోజు నిర్మల హైదరాబాద్‌ వెళ్లడానికి నిర్ణయమైంది. మళ్ళీ ఎన్నాళ్లకో అని యిల్లూ వాకిలి పేడ, ఎర్రమట్టితో ఎంతో శుభ్రంగా అలికి ముగ్గులేసింది. మల్లేశం బకెట్లకొద్దీ నీళ్లు చేది తెచ్చిపోశాడు. నీరజ రెండురోజుల క్రితమే రాయికల్‌ వెళ్లి పోవాలనుకున్నా నిర్మల కోసమే వుండిపోయింది. అన్నం తిని సర్దుకుంది నిర్మల. లచ్చక్కకి వీడ్కోలు చెప్పడానికి వెళ్లింది.

''సిన్నీ (చిన్నమ్మ) కొంచెం యింటికెయి జూడున్రి, తాతా... కొంచెం యింటికెయి జూడు'' అంటూ తాతకు విన్పించాలని గట్టిగా అరిచింది.

''అక్కడేమన్న బీడీలున్నాయే?''

లచ్చవ్వ ఏవూరు పేరు తీసినా మొదటవేసే ప్రశ్నయిదే. ఆమెతో బీడీల పని, అంతగా జీర్ణమైపోయినట్టుంది.

''ఏమో నాకు తెలువది''

''మల్లెప్పుడస్తవే''

''టెన్త్‌ రిజల్టు వచ్చినంక వస్తా''.

''కాలేజీల అక్కడనే చేరుతవా ఏందే'' చేజారిపోతున్న వజ్రాన్ని చూస్తూ బాధపడి పోతున్నట్టుగా అడిగింది లచ్చవ్వ.

ఏదో వరసకలుపుకోవడంతో నిర్మల కూతురైంది గానీ, బొంబాయిలో ఉన్న రాజేశానికి నిర్మలని చేసుకోవాలను కుంటోంది లచ్చవ్వ. కాలేజిదాక చదువుకుంటే కొడుకు యిష్టపడకపోవచ్చు. దీని మనస్సూ మారిపోవచ్చు.

''ఎందుకే ఇంకా సదువాలనుకుంటవు? సదివి ఏంజేస్తవే పంతులమ్మ వైతవా?'' చివరి పరీక్షలో చివరి ప్రశ్నలా అడిగింది లచ్చవ్వ.

''అయితే ఏందే తప్పా యే సిన్నీ?''

లచ్చవ్వ మనసు కలుక్కుమంది. వీనిమాట వూరికేపోదు వీడు అన్నదల్లా అవుతూ వుంటుంది. వాళ్లన్న దగ్గర ఉండి నిర్మల హైదరాబాద్‌లోనే కాలేజి చేస్తుందేమో... తన కొడుక్కు చేసుకోవచ్చనుకున్న ఆశ వదులుకుంది.

''నువ్వు టీచర్‌వైతే నాకు టివిషన్‌ చెప్తవా అక్కా'' అంటూ నవ్విండు మల్లేశం.

''వీని మాట బోసిపోదు నవ్వు తప్పక పంతులమ్మవైతవే''

రాజేశ్‌, నీరజా, మల్లేశం బస్టాండుదాకా వచ్చారు. బస్సు కదిలేదాకా అక్కడే వున్నాడు మల్లేశం.

బస్సు కదిలింది. ఏదో పోగొట్టుకున్నవాడిలా డీలా పడిపోయాడు మల్లేశం.

అమ్మతోపాటు అన్నయ్య, వదినలతో హైదరాబాదులోనే ఉండి చదువుకోవాలని నిర్మల ఆశ. ఆ ఆశ నెరవేరుతుందో లేదో...! అమ్మ మాట అన్నయ్య వింటాడో, అన్నయ్య, వదినల మాటే గెలుస్తుందో...! అని ఒక పక్క భయం. మరో పక్క హైదరాబాద్‌ వెళుతున్నందుకు సంతోషం.

తమ ఊరికి ఇక వీడ్కోలు ఇస్తున్నట్టుగా టాటా బాయ్‌ బాయ్‌ చెప్తూ చెయ్యి ఊపింది నిర్మల.

హైదరాబాద్‌లోనే ఉండి చదువుకుంటా అని నిర్మల హఠం చేసింది. గారాలు పోయింది. ఆమ్మ ఏడుస్తూ నేను జగిత్యాలకు పోతా అని బయల్దేరింది. దాంతో తల్లి వెంట నిర్మల జగిత్యాలకు వెళ్లక తప్పలేదు. ఎందుకు జగిత్యాలకు అని ఎంత అడిగినా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని తల్లి నోరు విప్పలేదు.

అలా గోడకు కొట్టిన బంతిలా సెలవులు పూర్తి కాగానే తల్లీ, కూతుళ్లు మళ్లీ జగిత్యాలకు తిరుగు ప్రయాణం అయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An eminent writer BS Ramulu in his Telugu short story described the social evolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more