ఒక దీపం
నీ ముఖం
నా అరచేతిలో ఒక దీపం
నీ ముఖం
నా అంజలిలో తొణికిసలాడుతున్న జలం
చేయి దించలేను
దోసిలి విప్పలేన
ఇది శిక్షా, వరమా తెలియదు
నువ్వు కళ్లకాన ఎత్తి పట్టుకున్న ఒక పువ్వు
కదల్లేను కళ్లు మూయలేను
ఇది తపస్సేమో
ఎప్పుడూ ఎక్కుపెట్టిన
విల్లంబులా ఉండటం -
నువ్వు తమాల వృక్షానివా
బోధి వృక్షానివా
జననాంతర సౌహృదాని
నమ్మకం లేదు
ఆ జన్మ దుఖావృత
ఆజ్యం మధ్య వెలుగుతున్న
వత్తి - నేనా - నువ్వా
గుండెలో దిగిన బాకు
ఒక పూల చెట్టు
ఏది సౌరభమో, ఏది వేదనో
అంతు బట్టక
జరిమానా పడ్డ జీవనసంధ్య -
నా అరచేతిలో
కువకువలాడుతున్న ఒక తేనెపిట్ట
నా దోసిలిలో గూడుకట్టిన ఒక కంచెకోడి
కదల్లేను మెదల్లేను
అలానే అలానే












Click it and Unblock the Notifications
