ధన్యవాదాలు

ధన్యవాదాలు
వేకువ రేకులు విప్పే వింత వింత భంగిమల్ని చూడమన్నావ్
ధన్యవాదాలు
మనకు మనంగా నిర్మించుకున్న చీకటి గోడల్ని కూల్చమన్నావ్
ధన్యవాదాలు
మన పాదాల కాంతిలో బాటలు వెలగాలని చెప్పావ్
ధన్యవాదాలు
అందుకేనేమో రాత్రి చదివిన గ్రంథాల్లోంచి
ఊడిపడిన వాక్యాల్ని దహనం చేసి పచ్చపచ్చని వృక్షాల మధ్య
స్పచ్ఛ స్వేచ్ఛా వాయువునై వీస్తున్నాను
బుడిబుడి అడుగుల ఎర్రని ఆ పిల్లాడికి అభిముఖంగా నడుస్తూ
అచ్చమైన కాంతుల్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను
భ్రమాన్విత తపోముద్రలో నన్నాక్రమించిన చీకటిని బహిష్కరిస్తున్నాను
వ్యాధుల నిదానం చెప్పావ్
ధన్యవాదాలు
వెన్నెల పొగరును చూడమన్నావ్
ధన్యవాదాలు
అలల అలజడుల నుంచి కదలికల్ని నేర్చుకోమన్నావ్
ధన్యవాదాలు
నిజం కదూ
ఆకాశాన్ని జయించే రహస్యం పక్షుల్లోనే ఉంది కదూ
యవ్వనెప్పుడూ విస్తరించే హృదయానిదే కదూ
మృత్యువాంఛా రహస్యం ముసలితనమే కదూ
చిరు మొగ్గల కేరింతల ఆహ్వానం వినిపించినందుకు
ధన్యవాదాలు
ఉజ్జ్వలత్వవు అంచుల్లో నుంచుని ఉవ్విళ్లూరించే కలను చూపించినందుకు
ధన్యవాదాలు
పాత కథనం వదలమన్నావ్
కొత్త కదనం తప్పదన్నావ్
ధన్యవాదాలు