ఆశారాజు కవిత 'బతికున్న కల'

కాళ్లకు చుట్టుకొంటున్న
నీటి పాయలను తప్పించుకొంటూ
ఉరుముతున్న సాయంత్రం వర్షంలో
మోయలేని గొడుగు పట్టుకొని
అమ కోసం ఎదురు చూస్తూ
ఆ గల్లీ వద్ద బొద్దు పిల్లాడు
ఎక్కిళ్లు పడుతూ
దిక్కులు చూస్తూ
ఇప్పటికీ అక్కడే ఉన్నాడు
చార్మినార్ నీడలో
పరాషా అద్దాల దర్బారులో
పహిల్వాను తమ్ముడు
సాసర్లో పొగలు ఊదుకుంటూ
ఇరానీ మలాయి చాయి తాగి
రిక్షా తాత కోసం
సుపారీ నములుకుంటూ
ఇంకా వెదుకుతూనే ఉన్నాడు
నిండుగా నది పారుతుండగా
వణుకుతున్న రోగి మీద
తన చొక్కాను కప్పి
నిరాశ్రయుల నీడ ఫుట్‌పాత్‌కు మొక్కి
నిరుపేదల ఆశల మేడ
ఉస్మానియా దవాఖానా వైపు తిరిగి
పాతబస్తీ ప్రేమపూజారి
నయాపూల్ మీదే నిలబడి ఉన్నాడు
నుమాయిష్ రోజుల్లో
చలికాలం చివరిని నుంచుని
లాసా లంసా సువాసనల్లో ముంచి
మిస్సాక్ పెన్ను క్యాలెండర్ కోసం
జిందా తిలిస్మాత్ బొమ్మను దాటి
నవ్వుతూ సలాం చేసే
సులేమాన్ వాలంటీర్‌ని
అజంతా గేటు దగ్గర కలిసి
మరీ మరీ కరచాలనం చేసి
మారిన షాపుకు దారి అడుగుతున్నాడు
వలీమా వగైరా దావతులకు
దీపావళి పటాకులకు
హోళీ వన్నెల రంగులకు
బాల్యం నుండే అలవాటు పడిన
జులుపాల స్నేహలోలుడు
ముత్యాల బజార్లో దొరికి
గులాబీ పూలను
వాడిపోకుండా రాలిపోకుండా
కలల నిండా దాచుకొంటున్నాడు
ఒకసారి రాజేందర్ కుమార్‌లా
మరొకసారి జితేందర్ కుమార్‌లా
వయస్సుకు మించిన వేషాలేసి
రాజేష్ ఖన్నా స్వర్ణ యుగంలో
పత్తర్గట్టీ నుంచి సుల్తాన్ బజార్ దాకా
వారానికొక గురుషర్టును పరిచయం చేసి
యవ్వనానికి కొత్త శిల్పాన్నిచ్చిన
ముద్దు పేరుతో దగ్గరైనా రాజూ కాక
క్రిష్టా టాకీస్ రద్దీలో
ఈనాటికీ పరవశంతో
నూర్జాహాన్ పాటలు వింటున్నాడు
ఆకాశంలో పతంగులు వదలి
మూసీలో పూలతేరు నడిపి
సీతాకోక చిలుకలను
ఇంద్రధనుస్సు మీద మలిచి
ఎర్రపూల తెల్లదస్తీని
చందమామ తలకు చుట్టి
చరిత్ర సొగసులు చెరిగిపోకుండా
అహర్నిశలూ కాపలా కాస్తున్నాడు
అమ్మను కలవరించినంతగా
హైదరాబాదును ప్రేమించే
సూఫీ గాయకుడు
ఇప్పుడు కూడా టూరిస్టు గైడులా
జ్ఞాపకాలను పంచుతూ
ఆబిడ్సులో తిరుగుతున్నాడు
పాలపిట్ట సౌజన్యంతో....












Click it and Unblock the Notifications