పూర్తి కాని కథ

వస్తూనే ''ఇంకా నిద్ర పోలేదా? అర్థరాత్రి దాటింది. ఏం చేస్తున్నావు?'' అని అడిగాడు. కుర్చీలో కూర్చున్నాడు. అతని పక్కన ఉన్న కుర్చీని లాక్కుని ఎదురుగా కూర్చున్నాను.
అతను కలిసి పదేళ్లు దాటుతోంది. ఇప్పుడు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. పదేళ్ల క్రితం ఒకరిని విడిచి ఒకరం ఉండలేని స్థితి. విడిపోయి ఉండగలమా అనిపించేది. కానీ అంతా అలవాటపోతుంది. మనుషులం ఒకరినొకరం మరిచిపోతాం. కానీ జ్ఞాపకాలే మెదడును తొలుస్తూ ఉంటాయి. అతను ఏం మారలేదు. కనీసం మారినట్లయినా కనిపించడం లేదు.
నేను జవాబు చెప్పలేదు. లేచి టేబుల్ మీద ఓపెన్ చేసి పెట్టి ఉన్న డైరీ చూశాడు. ''ఇదేమిటి?'' అని అడిగాడు. మన అనుమతి లేకుండా అతను మన పర్సనల్ విషయాల్లోకి జొరబడతాడు.
ఒక్కొక్కప్పుడు ఈ పద్ధతి చిరాకు పెడుతుంది. కానీ ఈసారి చిరాకు పెట్టలేదు. సంతోషం వేసింది. కనీసం ఒక్కడైనా గుర్తించే రోజు వచ్చిందే అనుకున్నాను.
''ఎలిజీ రాసుకుంటున్నాను'' చెప్పాను.
''ఎవరి మరణానికి ఎలిజీ?'' అని అడిగాడు డైరీ తీసి రెండు చేతులతో పట్టుకొని.
''నాదే. నా ఎలిజీ నేనే రాసుకుంటున్నాను'' అని అతని కళ్లలోకి చూశాను. ఈ మాటలకైనా అతను ఆశ్చర్యపోతాడని అనుకున్నాను. కానీ అతని ముఖంలో గానీ, కళ్లలో గానీ ఏ భావమూ కనిపంచలేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా అతను ఏమీ మారలేదా? మిన్ను విరిగి మీద పడినా చలించకపోవడం అతనికి స్వతహాగా వచ్చిందో, అతను నమ్మిన సిద్ధాంతం ఇచ్చిందో నాకు ఏనాడూ అర్థం కాలేదు. ఏదైనా సంఘటనకు పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో స్పందించడం మానవసహజం. కానీ అతనికి స్పందనలు ఉన్నాయనే విషయం అతనికి తెలుసో, లేదో తెలియదు.
''ఆ టైమ్ వచ్చిందంటావా?'' అన్నాడు నిర్లిప్తంగా.
''టైమ్ రాలేదని ఎలా అనుకోగలవు?'' అన్నాను.
''ఇంకా చేయాల్సిన పనులు చాలా వున్నాయి.'' అన్నాడు.
''ఏమున్నాయి? వీరమరణం పొందడం తప్ప'' అన్నాను. నా అంతరాంతరాల్లో దాగి వున్న కోరిక బయటపడినందుకు కాస్తా సిగ్గుపడ్డాను. అతను ఏమనుకుంటున్నాడోనని అతని వైపు చూశాను. నాది వృధా ప్రయాస అని నాకు తెలుసు. డైరీ టేబుల్ మీద పెట్టేసి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
''ఉక్క పోస్తోంది'' అన్నాడు. అతనికి కూడా మానవ స్పందనలు ఉన్నాయని అనిపించింది. లేచి ఫ్యాన్ వేశాను.
''టీ తాగుతావా?'' అని అడిగాను. నా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా గది నాలుగు మూలలా చూసి, లోపలి గదిలోకి తొంగి చూసి ''ఎవరూ లేరా?'' అని అడిగాడు.
''ఎవరుంటారు?'' అని జవాబిచ్చాను.
''ఇల్లు మారలేదు సరే. జీవితాన్నైనా మార్చుకోలేదా?'' అని అడిగాడు. నిజానికి మార్చుకుందామనే ప్రయత్నించాను. మార్చుకుందామని చేసిన ప్రయత్నంలో గుండె ఎప్పటికప్పుడు చీరుకుపోతూ వచ్చింది. ఆ గాయాలు ఇంకా సలుపుతూనే ఉన్నాయి. కానీ ఈ విషయం అతనికి ఎట్లా చెప్పేది. చెప్తే మాత్రం అర్థం అవుతుందా? ప్రతిదానికి లాజిక్ ఉంటుందనేవాడికి ఏం చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? మౌనం వహించాను.
నిజానికి అతను చాలా పవర్‌ఫుల్. అతని పక్కన రెండు గంటలు నడిస్తే చాలు ఎవరైనా సరే అతను చెప్పినట్లు నడుచుకోవాల్సిన స్థితిలోకి చేరుకుంటారు. వారి ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా వారితో తనకు ఇష్టమైన పనులు చేయించుకునే అపూర్వమైన విద్యేదో అతనికి అబ్బింది. అతని సాన్నిహిత్యంలో ఎవరైనా సరే గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతారు. అతని నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నం కూడా విఫలమే అవుతుంది. తప్పించుకోవాలని ప్రయత్నించేవారిని ఒడిసి పట్టుకునే నేర్పు అతనికి ఉంది. ఎవరి చేతనైనా సరే యంత్రంలా పని చేయించే నైపుణ్యం కూడా అతనికి ఉంది. దాన్నే అతను మానవ వనరుల నిర్వహణ అంటాడు. మేనేజ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అనే పదానికి అతను చేసిన తెలుగు అనువాదం అది. నాకెప్పుడూ అతని మాటలు అర్థం కాలేదు. మనుషులను మేనేజ్ చేయడమేమిటని నేను అనుకుంటూ ఉంటాను. అతనికి ఈ విద్య ఎట్లా అబ్బిందా అని నేను గతంలో ఆశ్చర్యపడిపోయేవాడ్ని.
''ఏమిటి ఇలా వచ్చావు? దారి తప్పావా? దారి మరిచావా?'' అని అడిగాను కాస్తా కటువుగా. నాలోని ద్వేషాన్ని మాటలు పట్టిస్తూనే ఉన్నాయి.
అతను నవ్వాడు. నవ్వి గొంతు సవరించుకున్నాడు. ''ఈ మధ్య పెద్ద ఉద్యమం మొదలు పెట్టాను. సామాజిక రంగంలో కృషి చేయాలని నిర్ణయించుకని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను'' అని అన్నాడు. మనస్సుల్లోనే కాదు మాటల్లోనూ కృత్విమత్వం మనల్ని ఎంతగా కాటేసిందో అతని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
''చేసింది సరిపోలేదా? నువ్వింకా అలసిపోలేదా?'' నా మాటలూ అలాగే.
''మనషికి అలసిపోవడం అనేది ఉంటుందా? అలసిపోతే వెనకబడిపోమూ?! శక్తినంతా కూడదీసుకుని ఈ సమాజాన్ని మార్చకపోతే ఎట్లా?'' అన్నాడు.
''సమాజం మారుతుందంటావా? సమాజమంటే మనుషులే కదా! ఈ మనుషులను మనం మార్చగలమా? అంటే వ్యక్తి నడవడిని, ప్రవర్తనను మార్చే శక్తి మనకు ఉందా? అధికార మార్పిడి జరిగి మన ప్రభుత్వం వస్తే మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రజలు భుజాల మీద మోస్తారు. అంటే పాలకవర్గంగా మారింతర్వాతనే ఏదైనా సాధ్యం. పాలకులకు ప్రజలు దాసోహమంటారు. దాసోహం అనేట్లు చేసుకోవడానికి ముందు అధికారం కావాలి'' అని అన్నాను. లేచి డైరీ తీసుకుని మూసేశాను. ఎందుకు మూసేశానో నాకే అర్థం కాలేదు. అంత పొడుగ్గా మాట్లాడటం వల్లనో, సమాజాన్ని మార్చే కొత్త సిద్ధాంత ప్రతిపాదన చేయడం వల్లనో శరీరం వణకడం ప్రారంభించింది. చివర్లో గొంతు కాస్తా తడబడింది కూడా. మిగతావారికి తనకు ఉన్న తేడానే అది.
అతను లేచి వంటింట్లోకి వెళ్లాడు. అతని వెనకే నేను వెళ్లాను. గిన్నెలన్నీ వెతికాడు. ఏమీ కనిపించలేదు. ''వండుకోలేదా? ఏం తింటావు?'' అని అడిగాడు.
నేను మాట్లాడలేదు. నిజానికి కడుపులో ఆకలిగానే ఉంది. వండుకునే ఓపిక లేదు. బయటికి వెళ్లి తినొచ్చే ఒపిక అంతకన్నా లేదు.
''ఇంత బద్దకుస్తుడివి ఉద్యమాలేం చేస్తావు?'' అని దెప్పి పొడిచాడు. నిజానికి నాకు ఉద్యమాలు చేయాలని లేదు. నాకు కావాల్సిందేదో నాకు స్పష్టంగా తెలుసు. కానీ అది సాధించడమెలాగో తెలియడం లేదు. అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది.
''అన్నం వండరాదూ?'' అని అడిగాడు.
''నా వల్ల కాదు'' అని చెప్పాను.
''ఇంటికి వచ్చినవాడ్ని తిండి పెట్టకుండా వెళ్లగొట్టడం ఏం మర్యాద?'' అన్నాడు.
''మర్యాద కాదనుకో. కానీ వండి పెట్టేవాళ్లు ఇక్కడ లేరు కదా! నీకు చాతనైతే వండు. నాకూ ఇంత పెట్టు'' అన్నాను.
అతని ముఖం ధుమధుమలాడింది. చిరాకు పడ్డాడు. బ్యాగు తగిలించుకుని వెళ్లిపోయాడు.
*************
అన్నీ సీతనే కనిపెట్టుకుని చూసుకునేది నాకు. నిన్నటి దాకా ఆమే వండి పెట్టింది. దగ్గరుండి తినిపించేది. రోజుకో రకమైన మాంసం కూర వండేది. పంది మాంసమే కాదు, గొడ్డు మాంసం కూడా వండేది. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుందో!
నేను రహస్య జీవితం గడుపుతున్నప్పుడు నాకు దగ్గరైంది. ఆ బంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. బయటకు వచ్చాక కూడా అది కొనసాగుతుందని అనుకున్నాను. కానీ ఎక్కువ కాలం నిలువలేదు. ఆమె వెళ్లిపోయింది. ఎక్కడికి వెళ్లిందనేది చెప్పడం నాకు ఇష్టం లేదు.
*************
అతను వెళ్లిపోయాక నాకు ఓ అనుమానం వచ్చింది. నా ఐడియాను వాడు కొట్టేస్తాడేమోనని భయమేసింది. వాడు మొదట ఎలిజీ రాసుకుంటే నా గతేం కాను అని అనిపించింది. డైరీ తీసి ఎలిజీ రాయడం ప్రారంభించాను. అర్థరాత్రి దాటిన తర్వాత గానీ అది పూర్తి కాలేదు. ఒకటికి పది సార్లు అది నా చేత చదవబడ్డది. చాలా గొప్పగా రాయబడిందే అని అనిపంచుకుని నిద్రపోయాను.
తెల్లారి లేచేసరికి గుర్తొచ్చింది- ఎలిజీ రాసిన తేదీని నోట్ చేయలేదని. అలా నోట్ చేయకపోవడం వల్ల చరిత్రలో గొప్ప తప్పిదం జరిగిపోయి వుండేదని అనిపించింది. వెంటనే డైరీ తీసి డేట్ వేశాను. ఫిబ్రవరి 29, 2004. మొదట అనుకోలేదు గానీ ఈ డేట్‌కు ఏదో ప్రత్యేకత ఉందని రాస్తున్నప్పుడు అనిపించింది. లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరికి 29వ తేదీ వచ్చింది. అనుకోకుండా తన ఎలిజీ ఆ రోజు పూర్తి కావడం గొప్పగా అనిపించింది.
వెంటనే నాకు ఓ అనుమానం వచ్చింది. అతను ఎటు వెళ్లాడు? ఏం చేస్తుంటాడు? రాత్రికి రాత్రి నన్ను తలదన్నే పని ఏదైనా చేస్తాడేమోననే అనుమానంతో ఆ ప్రశ్నలు మొదలయ్యాయి.
వెంటనే బాత్‌రూమ్‌లోకి వెళ్లి పనులు పూర్తి చేసి రావడానికి అరగంట సమయం పట్టింది. బాత్‌రూమ్‌లో చాలా సమయం ఖర్చవుతున్నది. ముఖం కడుక్కుని నెత్తి మీద నాలుగు మగ్గులు కుమ్మరించుకుని రావడానికి మరో అరగంట సమయం పట్టింది. టైమంతా అనవసరంగా వృధా అవుతున్నదే అని అనిపించింది. రేపటి నుంచి ఈ పనులన్నీ మానేయాలని అనుకున్నాను.
జరిగిందేదో జరిగింది. వెంటనే ఉరుకులు పెట్టక తప్పదు. సరాసరి శంకర్‌మఠ్‌లో ఉన్న రాజేష్ ఇంటికి వెళ్లాను. ఇంట్లోనే డిటిపి పెట్టుకుని బుక్‌వర్క్ చేస్తుంటాడు రాజేష్. వెళ్లేసరికి రాజేష్ లేడు.
''కూర్చోండి సార్!'' అంది రాజేష్ భార్య సుమతి. చిరాకేసింది. రాజేష్ నా టైమంతా వేస్ట్ చేశాడనిపించింది.
''ఎప్పుడొస్తాడు?'' అని అడిగాను నిలబడే.
''పిల్లలను స్కూళ్లో దించడానికి వెళ్లాడు. ఓ పది నిమిషాల్లో వస్తాడు. మీరు కూర్చోండి'' అందామె.
''మళ్లీ వస్తా'' అంటూ వెనుదిరిగి షర్ట్ జేబులో చేయి పెట్టాను. సెల్ దొరకలేదు చేతికి. అది ఎక్కడో పోయిందనే విషయమే మర్చిపోయాను. ఎడమ చేయిని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడసాగాను. ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో నాకే తెలియదు. అదొక అలవాటు అనే విషయం కూడా నేను గ్రహించలేకపోయాను. రోడ్డు మీద అలా నడుస్తూ ఇరానీ హోటల్‌లో కాలు పెట్టాను. చేయి చెవి దగ్గరి నుంచి తీసేసి కుర్చీలో కూర్చొని చుట్టూ చూశాను. అందరూ నా వైపే చూస్తున్నట్లనిపించింది. అప్పుడు గానీ అర్థం కాలేదు నేను చేసిన పనేమిటో! సర్దుక్కూర్చుని టీ ఆర్డర్ చేశాను. టీ చప్పరిస్తూ దీర్ఘంగా ఆలోచించసాగాను. జేబులోంచి సిగరెట్టు తీసి అంటించాను. రెండు దమ్ములు లాగేసరికి మనసు కాస్తా తేటపడినట్లు అనిపించింది. గోల్డ్ ఫ్లాక్ అనే సిగరెట్టును ఇంగ్లాండు కంపెనీ వాడు ఏ ముహూర్తాన తయారు చేయడం మొదలు పెట్టాడో గానీ అది వదలడం లేదు.
సిగరెట్టు చివరి దాకా తాగి కింద పడేసి చెప్పు కాలి కింద నలిపేశాను. అలా నలుపుతున్నప్పుడు ఈ ప్రపంచాన్ని కాళ్ల కింద తొక్కి అణిచేస్తున్నట్లు అనిపించింది. లేచి టీ డబ్బులు పే చేసి బయటకు నడిచాను.
వెళ్లే సరికి రాజేష్ ఉన్నాడు. తృప్తిగా గాలి పీల్చుకున్నాను. ''ఏమిటి సార్ ఇలా వచ్చారు?'' అన్నాడు రాజేష్. ఆ మాటల్లో వర్క్ చేయించి డబ్బులు ఇవ్వలేదు; చేసిన వర్క్ తీసుకుపోలేదు అనే అర్థం స్ఫురించింది. రాజేష్ మీద కోపం వచ్చింది.
''ఏడాది కింద ఓ కవితల పుస్తకం వేయాలని డిటిపికిచ్చాను, చూడు! అది అర్జంట్‌గా పుస్తకంగా రావాలి'' అన్నాను. పర్స్ తీసి ఐదు వందల రూపాయల కట్ట పడికిట్లో పట్టుకున్నాను. రాజేష్ మొహం వైపు చూశాను. అతను నా వైపు చూడనట్లు నటిస్తున్నాడనేది అర్థమవుతూనే ఉంది.
కంప్యూటర్ ఆన్ చేసి ఫైల్ వెతికి తీశాడు. ''ఇదే కద సార్?'' అని అడిగాడు. వెంటనే జవాబు ఇవ్వలేదు నేను. వేళ్లను నాలుకతో తడి చేసి ఐదు వందల రూపాయల కట్ట వదులు చేసి లెక్కపెట్టసాగాను. మొత్తం లెక్క పెట్టి నాలుగు నోట్లు తీసి ''ఇవి తీసుకో!'' అని రాజేష్ చేతికి ఇచ్చి మిగతా కట్టను పర్స్‌లో పెట్టి జేబులో పెట్టుకున్నాను.
''ఫైల్ దొరికిందా?'' అని అడిగాను.
''దొరికింది, సార్! ఇదే కదా!'' అని అన్నాడు ఉత్సాహంగా.
''ఇదే. వెంటనే పుస్తకం తేవాలి. ఎప్పటి వరకు ఇవ్వగలవు?'' అని అడిగాను.
''ఎంత సేపు సార్, మొత్తం టైప్ చేసి ఉంది సెట్ చేయడానికి ఓ గంట చాలు'' అన్నాడు రాజేష్.
''ముందు మాట ఒకటి రాయాలి''
''మీరు రాసి ఇస్తుంటే ఎప్పటికప్పుడు టైప్ చేస్తాను'' చెప్పాడు.
కాసేపు ఆగాను. నా మౌనంలోని అంతరార్థం ఏమిటో అర్థం కాక అతను అయోమయంలో పడ్డాడు. తప్పు మాట్లాడానా అనే భావం అతడ్ని పీడించసాగింది. ఇంతలో సుమతి రెండు కప్పుల్లో టీ తెచ్చింది.
''టిఫిన్ ఏమీ లేదా?'' అడిగాను.
ఈ ప్రశ్నకు ఆమె బిత్తరపోవడం గమనించాను. అయినా నేను తొణకలేదు, బెణకలేదు. అసలు పట్టించుకోనట్లే ఉన్నాను.
గట్టిగా నవ్వాను. భార్యాభర్తలిద్దరూ ఆ నవ్వుకు ముడుచుకుపోయారు. సిగ్గుపడిపోయారు. ''మీరు సరిగా తినరు. అందుకే ఇలా వున్నారు. అసలు మీరు వంట సరిగా చేసుకుని తింటారా?'' అన్నాను. దీంతో వారు మరింత కుంచించుకుపోయారు.
''ఉప్మా చేయరాదూ?'' అన్నాడు రాజేష్ భార్య సుమతితో.
''సరే. ముందు టీ తాగండి'' అని చెప్పి వంటింట్లోకి వెళ్లింది సుమతి.
''నరేష్ పుస్తకానికి నేను ముందుమాట రాశాను. నేను చెప్తుంటే అతను రాసుకున్నాడు. వేలాది ప్రసంగాలు చేశాను కదా, చెప్పడం బాగా అలవాటయింది. నేను చెప్తూ పోతుంటాను. నువ్వు టైప్ చెయ్యి'' అన్నాను.
పూర్తిగా దారిలోకి వచ్చాడు రాజేష్. ''సరే, మీరు పక్కకు కూర్చొని చెప్తూ వెళ్లండి'' అన్నాడు.
అలా పక్కకు కూర్చొని చెప్తూ పోయాను. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్లీ సాయంత్రం టిఫిన్- టీ, రాత్రి భోజనం- ఇలా మధ్యమధ్యలో కానిస్తూనే చెప్తూ పోయాను. అర్థరాత్రి 12 గంటల దాకా సాగింది.
''ఎన్ని పేజీలు వచ్చింది?'' అని అడిగాను.
''యాభై పేజీలు'' చెప్పాడు.
''అంటే వన్ యయ్త్‌లో వంద పేజీలన్నమాట'' అని తృప్తిగా గాలి పీల్చుకున్నాను.
''కవితలు యాభై పేజీలే వస్తాయి'' చెప్పాడు రాజేష్.
''ఫరవాలేదు. ముందుమాట అంటే అందరిలాగా రాస్తానా? చరిత్ర, సామాజిక విశ్లేషణ వంటి అన్ని విషయాలు రావాలి. ఒక సమగ్ర దృక్పథం వ్యక్తం కావాలి.'' అన్నాను.
రాజేష్ ముఖం పీక్కుపోయింది. భార్యాపిల్లలు ఎప్పుడో నిద్ర పోయారు. లేచి 'వెళ్తా' అని చెప్పి బయటపడ్డాను. ఇంటి వైపు వస్తుంటే మనసులో పుస్తకం రూపు దిద్దుకోసాగింది. ఈ పుస్తకాన్ని చూసి అదిరిపోతారని అనిపించింది. బహుశా ఇంత గొప్పగా ఇంత వరకు ఏ పుస్తకం వచ్చి వుండదు. వచ్చి వుండదేమిటి రాలేదు. అంతే, రావడానికి వీల్లేదు. ఇంతటితో వదులుతానా? నా తడాఖా ఏమిటో చూపిస్తాను. నేనేం మామూలు మనిషినా? ప్రజలు నెత్తి మీద పెట్టుకుని పూజించే వ్యక్తిత్వం నాది. దాన్ని గుర్తించేలా చేయాలి. తప్పదు.
ఇంట్లో కాలు పెట్టానో లేదో అతను కనిపించాడు. తాళం వేసినట్లు గుర్తుంది. అతనెలా లోపలికి వచ్చాడో అర్థం కాలేదు. కీ చైన్ తీసి చూశాడు. బండి కీతో పాటు ఇంటి కీ కూడా ఉంది. అశ్చర్యాన్ని లోలోపలే అణుచుకున్నాడు.
''అలా వెళ్లిపోయినవాడివి మళ్లీ రావేమో అనుకున్నాను'' అన్నాను.
అతను నా కళ్లలోకి కొరకొరా చూశాడు. ఆ చూపులకే శక్తి ఉంటే నేను మాడి మసైపోయి వుండేవాడిని.
''అయినా తాళం వేసి ఉంది కదా లోపలికి ఎలా వచ్చావ్?'' అని అడిగాను.
పకపకా నవ్వాడు. ''సామాన్యులకు తాళాలు అడ్డం వస్తాయి గానీ నాలాంటి మేధావులకు, సామాజిక కార్యకర్తకు ఎలా అడ్డొస్తాయి?'' అని అన్నాడు.
''నిజమే అనుకో! నువ్వు అంత మేధావివా అని..'' నా మాట పూర్తయిందో లేదో ఒక పెద్ద పుస్తకం తీసి టేబుల్ మీద గిరాటేశాడు. పెద్దగా చప్పుడు చేస్తూ ఆ పుస్తకం కొంత దూరం టేబుల్ మీద జారింది. ఆంధ్రా బ్యాంక్ వాళ్ల డైరీలా ఉంది.
''తీసి చూడు!'' అన్నాడు.
ఆ పుస్తకం కంట పడేసరికి నా గుండె సగం జారిపోయింది. వీడేదో నాకు ఎసరు పెట్టేట్లే ఉన్నాడనిపించింది.
''మీనాక్షి కలిసిందోయ్'' అంటూ మరో బాంబు వేశాడు.
వీడు నా క్యారెక్టర్‌ను కూడా దెబ్బ తీయడానికి పూనుకున్నాడనేది అర్థమై పోయింది. మీనాక్షి పేరెత్తితే నా వెన్నెముక సగం వంగిపోతుంది. చూపులు స్థిరంగా నిలవవు. గుండె దిటవుగా ఉండదు. నడి వయస్సులో నా జీవితంలోకి ప్రవేశించిన స్త్రీ మీనాక్షి. ఆమె గురించి మాట్లాడటం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఆ విషయం అతనికి తెలుసు. అందుకే ఆ ప్రస్తావన తెచ్చాడు.
తప్పలేదు. పుస్తకం చేతుల్లోకి తీసుకొని పేజీలు తిప్పాను. పుస్తకం చూసి అదిరిపోవడం నా వంతైంది. నేనే అంటే నన్ను మించినవాడు అనిపించింది.
''నువ్వు నాకు కనిపించని ఈ పదేళ్లు కూడా నన్ను వెంటాడుతున్నావా?'' అని అడిగాను.
గర్వంగా నవ్వాడు. ''నీ గురించి నీకు తెలియని విషయాలు చాలా వున్నాయి. నీకు తప్ప సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగంలోని వారందరికీ నీ విషయాలు తెలుసు'' అన్నాడు.
''నీ మానాన నిన్ను వదిలేస్తే అందర్నీ మింగేస్తావని అందరికీ తెలుసు. నీ పేరు ఎక్కడా కనపడకుండా, ఎక్కడా వినిపించకుండా ఎలా చేయాలో నాకే కాదు, వాళ్లకు కూడా తెలుసు'' అన్నాడు.
వాళ్లు చేసే పనులకు నేను రెచ్చిపోతూ వస్తున్నాను. ఆ విషయం నాకు తెలుసు. మీనాక్షికి తెలుసు. ఎంత రెచ్చిపోయినా రావాల్సినంత పేరు రావడం లేదు. దక్కాల్సిన కీర్తికిరీటాలు దక్కడం లేదు. నిజానికి నాకు ఒక్క సాహిత్యంలో నోబెల్ బహుమతి రావాలి. ఇది నా గట్టి నమ్మకం.
''పుస్తకం ఎలా ఉంది?'' అని అడుగుతూ కనుబొమలెగరేశాడతను.
ఇన్నర్ టైటిల్ చూశాను. ''ప్రపంచ సాహిత్యం- తెలుగు సమాజం- ఒక తాత్విక దృక్పథం'' అని ఉంది.
''నువ్వు వందేళ్లదే రాశావు. నేను వెయ్యేళ్లు తీసుకున్నాను'' అన్నాడు.
పేజీ మధ్యలో రచయిత ''గానుగెద్దుల పశుపతి'' అని ఉంది.
పేజీ కిందికి వస్తే ''గ్లోబల్ ప్రచురణలు, హైదరాబాద్'' అని ఉంది.
పేజీ తిరిగేశాడు. ఇన్నర్ టైటిల్ పేజీ వెనక ఖాళీగా ఉంది. మూడో పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా ఉంది-
''ప్రపంచ సాహిత్యవేత్త, సామాజిక శాస్త్రవేత్త, సర్వరంగ నిష్ణాతుడు, మహా మేధావి
గానుగెద్దుల పశుపతిగారికి
అంకితం'' అని ఉంది.
నాకన్నా రెండాకులు ఎక్కువ చదివనిట్లనిపించింది.
చేతి సంచి తీసి మరో రెండు పుస్తకాలు అలాంటివే తీసి టేబుల్ మీద పెట్టాడు. ఒక్క రోజులో ఇన్ని పుస్తకాలు ఎలా తెచ్చాడో నాకు అర్థం కాలేదు.
''పదేళ్ల కృషి- ఎవరూ పట్టించుకోవడం లేదు. అన్నీ మూడు విభాగాలుగా చేసి ఇలా తెచ్చాను. నిన్ననే నీకు చెప్దామనుకున్నా. కనీసం నువ్వు తిండైనా పెట్టడానికి సిద్ధంగా లేవు. కోపమొచ్చి వెళ్లిపోయాను. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే ఎంతైనా మనవాడే కదా అనిపించింది. అంతే ఇలా వచ్చేశాను'' అని చెప్పాడు.
సమాజం నిజంగానే వ్యక్తిగత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపించింది.
- కాసుల ప్రతాప రెడ్డి












Click it and Unblock the Notifications