మాడభూషి శ్రీధర్ కవిత: రేణుగానం
వాడి ఇనుప బూట్ల కింద నలిగిపోతావు జాగ్రత్త...
తొక్కకుండా పక్కనించి పోవడం వాడిబాధ్యత కాదా..
చెప్పుకున్నా ఎవరూ వినరు కనుక తప్పుకోవడమే బాధ్యత
అంతలో అతని కాలు నెత్తిమీదే పడింది.
తొక్కి అట్లాగే నిలబడ్డాడు, అంతా చీకటి.
బతుకుతానో లేదో తెలియదు.
హమ్మయ్య కాలుతీసి కదిలాడా రక్కసి మనిషి
చెప్తే వినలేదు, నలిగిపోయావా నేస్తం...
మాట రావడం లేదు, కళ్లుతెరవలేనంత నీరసం
కళ్లుతెరిచినా ఏదీ కనిపించడం లేదు.
కొనఊపిరి కొంత కొట్టుమిట్టాడుతున్నది.
అల్లంత దూరంనుంచి అమ్మ చూసింది.
చల్లని అలల చేతులతో తలనిమిరింది
తల స్నానం చేయించి జీవం పోసింది.. లోపల బడబానలం రగులుతున్నా..

వళ్లంతా తడిమి కంట తడి తుడిచినాడు,
వెచ్చదనం నింపాడు..లోపల అగ్నిగోళాలు పగులుతున్నా.
ఇలా వళ్లంతా నీలి చీర కట్టుకున్న అమ్మ
అలా నింగంత కాషాయపు శాలువతో నాన్న
తొక్కిళ్లనుంచి తప్పించి పొత్తిళ్ల దాచిన ధరిత్రి
తడలనుంచి రక్షించి వెలుగులిచ్చిన రవి
తిన్నెలమీద తన్నులు తింటున్న
నన్నే కాదు కోట్లాది జీవరాశిని కాస్తున్న మాతా పితరులు
ఇంకనేను ఊరుకోను మదమత్తులై కళ్లుమూసుకుపోయి
ఎగిరి ..జీవుల్ని తొక్కేస్తున్న రాక్షసుల కళ్లల్లోపడతాను.
ఇసుక తుఫాను సృష్టించి ముష్కరుల్ని తరుముతాను.
ఆగ్రహోదగ్ర ఉత్తుంగ తరంగ సునామీ రచిస్తాను
నేను అణువును, ఇసుక రేణువును
సిలికాన్ లోయల్లో రాగాలు పలికే వేణువును
మహతోమహీయమైన అంతరిక్షానికి ప్రణమిల్లే
అణోరణీయమైన పరమాణువును.
చైతన్యానికి నూక్లియస్ ను
పోరాటంలో నూక్లియర్ బాంబును
నేను అణువును ఇసుక రేణువును.
(మెరీనా బీచ్ లో మెరిసిన ఆలోచనలకు హొటల్ గదిలో ఇచ్చిన రూపం)












Click it and Unblock the Notifications