తెలుగు కవి: అద్దంలోపల
నిటారుగా నిలబడిన గాజు అద్దం
చినుకుని జార్చినా ఆకులని విప్పార్చి చూపించినా
మనసులేని ప్రతిబింబాలు ఆసక్తిగా కనిపిస్తాయి
దేహం ముఖంతో నిలబడగానే
వెలుగు, మసక, నీడల తెరలు తొలగించుకుని
శరీరంలోకి ప్రవేశిస్తుంది
ఒక పరాకు ఒక చిరాకు
ఒక అందం ఒక సందేహం
వీధి తలుపు తోసుకువచ్చిన గాలిలా నిమురుతాయి

కళ్లలో ఉన్న జీవితం
బుగ్గమీద నీటిచినుకులా జారుతూ ఆగిపోతుంది
విడిపోయిన జడపాయలు
బుజాలు వీడీ నేలని చేరుకున్న పమిట
ఏ కారణాన్ని వినిపించని ఏకాంతం
నడుము చుట్టూ బిగుసుకున్న చేతులు
ఎక్కడో దాక్కున్న చేతులు
వెలుతురులో ఆగిపోయిన చేతులు
ఆ క్షణాలని దులిపి పవిటలా వేసి
అంచులని సరిచేసి చెంపలపై చేతులానించాయి
సందేహంగానే
ఒక మైకం
శరీరంలోకి ప్రవేశించింది
ఎప్పటిది ఇది?
ఎన్ని సార్లు అడిగినా
నిజం చెప్పదు
నిటారుగా నిలబడ్ద గాజు అద్దం
ముఖం లేని ముఖంతో విసిగిస్తూ....
- రేణుక అయోల












Click it and Unblock the Notifications