కవిత: ఊరు లేత్తాంది శవం లెక్క

Posted By:
Subscribe to Oneindia Telugu

కాలం కాలం లెక్కుండదేమో
అయ్ పాయ్ తీ
మనిషి మనిషి లెక్కుండడేమో
పోనీతీ
మరి ఊరు వూరులెక్కుండదా ఏందీ..
సింగరేణి బొగ్గు కంపెనీ ఓపెన్కాస్టయి
ఎర్రగుంటపల్లి ని
పసువుల మందల సొర్రిన తోడేళ్లగుంపు లెక్క
నేల నేలంతా కుతికె పడుతున్నది -
ఇగ వూరుంటదా ?
**
ఎర్రగుంటపల్లి ఎర్రవాగు సలపలవాగు ఇప్పలవాగు రాళ్లవాగు పారాడి
తడిసి పండిన నేల
కాసిపేట మందమర్రి కల్యానిఖని సోమగూడెం బెల్లంపల్లి రామకృష్ణాపూర్ శ్రీరాంపూర్ భూముల్ని
బొగ్గు బావులు బావుల్ని చేసి సొరంగాలు చేసిన కంపెని పందికొక్కులెక్క బగ్గబలిసి
ఇప్పుడు సొరంగం వొదిలి ఓపెన్ కొచ్చింది -
బావులు సొరంగాలు తొవ్వుడు కాదు
ఇప్పుడు ఓపెన్ ఓపెన్ గా వూర్లు వూర్లను బొందలు చేసి దుబ్బగుట్టలు పోసుడే
**
పసులు జీవాలు పెంచి పోసించిన వూరు
పంటలు పండించి నేలను ముద్దాడిన వూరు
కూలీ నాలీ చేసీ బతుకు ఎల్లదీసిన వూరు
పొలిమేరల్లో సింగరేనోడు కట్టిన బంకర్లకు
కండ్లల్ల దుఃఖాన్ని
కడుపుల కోపాన్ని
మనసుల మంటల్ని మింగుతాంది

Anwar poem on the distruction of villages

**
ఊరంటే తల్లి చనుబాలధార కదా
మాంసం లెక్క పీక్కుతిని బొక్కలు చూరచూర చేస్తానవ్
ఊరంటే వూయలలాగా ఊగిన అమ్మవొడి కదా
సొరంగాలు సొరంగాలు తొవ్వీ సుడిగుండాలు చేస్తానవ్
ఊరంటే అవ్వకు అవ్వరా
ఊరంటే కన్నతల్లికే కన్నపేగురా
**
నువ్వు సావడానికి ముందే నీ అవ్వ సచ్చిందనుకో
నాలుగు రోజుల్ని చీకటి రాత్రుళ్లుగా గడిపెస్తావేమో -
నీకంటే ముందే నీ అయ్య పోయిండనుకో
ఓ రెండు రోజులు మౌనంగనో దుఃఖంగనో
సావు మోసినట్టుగనో బతికేస్తావేమో -
నీ కొడుకో బిడ్డో భార్యో పెంచుకున్న కుక్కో దోస్తో
వున్నట్టుండి వుండకుండా పోయిండనుకో ...
అనుకో ...
కష్టమో నష్టమో నరకమో అనుభవిస్తావేమో ?
సగం సచ్చిపోతవేమో
సగం నాశనమయితవేమో
సగం గాలికి కట్టేపోసలా వూగుతవేమో
సగం పాగల్ వై రోడ్డుమీద పిచ్చిపిచ్చిగా వురుకుతవేమో
ఓహో
పరేషాన్గనో బెచైన్గనో బీమార్గనో
నిజంగ వుండీ లేనట్టుగనో
పోనీ
కొన వూపిరితోనో బతికేస్తుంటవు కదా -
మరి
మరి
గదే నువ్వు పుట్టినూరు నీకంటేముందే పుట్టిమునిగితే.. ?
ఇంకెందుకురా బతుకు ?
ఇంకెందుకురా శరం ?
**
తాతలు పుట్టి పెరిగిన
తండ్రులు ఆడి గెలిచిన
తల్లులు కని పెంచిన
నువ్వు పుట్టి పెరిగిన ఊరు బొందలగడ్డైతే
నీ బొందెక్కడుంటదిరా ?
**
ఊరు నిర్వాసితం ..!
రాత్రంతా ఆలోచించూ -
రెండు రోజులు నిద్రాహారాలు మాని వూహించూ ..
పుట్టి పెరిగిన వూరు పుట్టిమునుగుతాంటే
ఇగేం బతుకు ?
ఇగెందుకు బతుకు ?
**
ఆరుద్ర సొర్రిం తర్వాత వూరు బాగుకోసం
వూరంతా ఒక్కటై ఆచారపు బలి సైడ్ పిల్లలు చేసిండ్లు -
**
* ఎర్రగుంటపల్లి ఎర్ర గొల్లోల్లకు తోడుగా
ఒక్క మందెచ్చులోళ్లున్నా బాగుండు
ఓపెన్ కాస్ట్ గొంతును గావుపట్టి
గాంధారి మైసమ్మ గుట్టకు ఈరంగం చేసేటోడు

- అన్వర్


• ఎర్రగుంటపల్లి - మందమర్రి మండలంలోని ఎర్ర గొల్లోల్ల గ్రామం. సింగరేణి కంపెని కంటే ముందు సింగరేణి కంపెని కంటే ముందు పొందిచ్చిన ఊరు. ఊరి పొలిమేరల్లో.. సింగరేణి ఒపెంకస్ట్ చేస్తూ బంకర్లను తొవ్వుతోంది. ఊరు లేత్తాంది అని వణుకుతున్నరు ప్రజలు. 426 రోజులుగా (10.07.2016 ) ఊరును కాపాడుకోడానికి నిరాహార దీక్షలు చేస్తున్నరు.
* సైడు పిల్లలు - బలి ఇవ్వడం

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A prominent poet Anwar expresses his anguish at the distruction of villages.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి