కవిస్వరం: కొత్త అనిల్ కుమార్ కవిత
వర్తమాన కాలంలోని అసలు సమస్యేమిటో కొత్త అనిల్ కుమార్ తన కవితలో చెప్పారు. కవిత మనసును స్పృశించేలా ఉంది. కొన్ని ప్రతీకలు చాలా అందంగా పడ్డాయి. బాధేమీ లేకపోయినా ఏదో బాధ ఉండడమే ఆధునిక జీవితంలోని విషాదం. ఆ విషాదాన్ని కొత్త అనిల్ కుమార్ చాలా సున్నితంగా చెప్పారు. అపార్టమెంట్ల జీవితం నగరజీవితానికి ప్రతీకగా కనిపిస్తుంది. నిజానికి, అపార్టమెంట్ల జీవితం కలిసి జీవించడమనుకుంటాం గానీ వెలివేయబడ జీవించడమని గుర్తించాల్సిన అవసరాన్ని ఈ కవిత గుర్తు చేస్తుంది.
బహుశా Apart అనే పదం నుంచి Apartment అనే పదం పుట్టి ఉంటుంది. అపార్టుమెంట్ అనే పదం పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఈ కవిత గుర్తు చేస్తుంది. Apart అంటే దూరంగా అని అర్థం. మనిషి మరో మనిషికి మాత్రమే కాదు, మరో మనసుకు దూరంగా కూడా జీవించడానికి పనికి వచ్చేవే అపార్టమెంట్లు. మనషులు కలుస్తారు గానీ మనసులు కలవ్వు.
ఆపార్టమెంటులోకి వెళ్లిన తర్వాత ఎవరి ఫ్లాట్‌లో వారు తలుపులేసుకని కూరుకుపోవాల్సిందే. ఈ విషయాన్ని కవి వివిధ ప్రతీకలతో చాలా సమర్థంగా చెప్పారు. వాకిళ్లు, దాని ముందు వేసే ముగ్గులు రూపాంతరం చెందిన వైనాన్ని కూడా కొత్త అనిల్ కుమార్. చివరగా, మనిషి బ్రతికే స్థలమే తగ్గిందనుకున్నా, మనసు బతికే స్థలమూ తగ్గింది అని అంటారు. మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు తగ్గిపోవడాన్ని ఆయన తద్వారా చెప్పారు.
మొత్తం మీద, మనుసును తాకే కవిత ఇది. కొత్త ఎడిటింగ్ అవసరమని అనిపించింది. కవితను ఎడిట్ చేస్తే మరింత సాంద్రంగా తయారయ్యే అవకాశం ఉంది.
- కాసుల ప్రతాప రెడ్డి

@@ అపార్ట్ మెంట్లు @@
ఎప్పటికి ఏవో జ్ఞాపకాల కదలికలతో
మనసంతా సందడిగా ఉంటుందెందుకో
సందడి అంటే సంబురం కాదు గాని
ఏవో గుర్తుకొస్తుంటాయి
అనవసరంగా అన్నీ యాది చేసుకునే
నిరంధి జీవితం కాదు గానీ
ఏదో రంధి మదిని కదిలించేలా చేస్తుంది
ఈ దినసరి మానవ యంత్రం
నడిచి నడిచి చల్లబడాలంటే
తిరిగి గూడు చేరి తలుపు లేసుకోవలసిందే తప్ప
మందలించే మనిషుండదు
అవును మరి,
ప్రపంచీకరణ విసర్జించిన మనుషుల పుట్టలనే అపార్ట్ మెంట్లలో ...
నిన్న మొన్నటి వరకున్న వంద వాకిల్లని
ఫ్లాట్లుగా మారిపోయాయి
వాకిళ్ళ పై ఉన్న పిండి ముగ్గులన్ని
పెయింట్ గీతలయినాయి
ఆత్మీయ మనసులన్ని అపార్ట్ మెంట్ జాలిలో
వడ పోయబడ్డాయి
గల్లిలన్నీ మాయమై
విలాసం మిగిల్చిన విల్లాలైనాయి
ఎవరి మనసులు వారికే ఎవరి చూపులు వారికే
హద్దులు నిర్దేశింపబడిన అత్మీయప్రవర్తన
లోపల ప్రేమలున్నా మించకూడదు
చొరవలు కరువైన కృత్రిమ జీవితాలు
ఒకప్పుడు మనసుల్లోకి మనుషులు అలవోకగా చొచ్చుకేల్లెవారు
ఒకరింటి గుమగుమలు దారిని చీల్చుకుని
ఇంకొకరింట్లోకి వెళ్లి నిండిపోయేవి
ఇప్పుడంత పెద్ద దారులు లేకున్నా
ఈ స్నేహ పరిమళాలు దర్వాజాలు దాటలేవు
దాటినా...
మనిషి మనిషికి కనిపించినంత సేపే
చక్కగా అతికించుకున్న పలకరింపులు
అందంగా అలకరించుకున్న చిరునవ్వులు
ఆ గూళ్ళలో ప్రేమలు లేవని నేననను
ప్రేమను పాటిస్తున్నారనేదే నా బాధ
మనసుకు వేరే బాధ లేక కాదు
ఈ అనుభవాల యేరు గుండెను తడి
చేస్తూ వెళ్ళడమే బాధ
కుదుట పడ్డ మనసు
ఇలాంటి వెతలతో మళ్లీ పదనౌతుంది
లక్షణంగా గడిపేస్తున్న జీవితంలో
నాకేం బాధ లేదు గానీ
లక్ష్యాన్ని నిర్దేశించుకుని బ్రతికే యంత్రాలు
ప్రేమకు కొంత 'space'ను నిర్దేశించుకుని
జీవించడమే కొంత బాధ నాకు
మనిషి బ్రతికే స్థలమే తగ్గిందనుకున్న
మనసు బ్రతికే స్థలమూ తగ్గింది .
- కొత్త అనిల్ కుమార్
15 / 5 / 2014












Click it and Unblock the Notifications