రెడీ అయిన ఇస్రో- సునీతకు సమాచారం
Sunita Williams: భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. క్షేమంగా తిరిగివచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లో గడపనున్నారు.

ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న టైమ్ జోన్ ప్రకారం..సాయంత్రం 5:57 నిమిషాలకు క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్‌లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారి విల్మోర్‌తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్‌లో ఉన్నారు. ఈ క్యాప్సుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది.
తొలుత నిగ్ హేగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్పుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సుల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీమ్ అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది.
సునీత విలియమ్స్ భూమ్మీదికి చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. అంతర్జాతీయ కేంద్రంలో తొమ్మిది నెలల సుదీర్ఘ మిషన్ తరువాత సురక్షితంగా భూమికి తిరిగి రావడం ఓ అద్భుత విజయమని ప్రశంసించింది.
నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు, అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టయిందని, ఈ రంగంలో వాటి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. సునీత విలియమ్స్ దృఢ సంకల్పం, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ఔత్సాహికులకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుందని ఇస్రో కితాబిచ్చింది.
🚀 Welcome back, Sunita Williams! 🌍
— ISRO (@isro) March 19, 2025
Your safe return after an extended mission aboard the ISS is a remarkable achievement. A testament to NASA, SpaceX, and the USA’s commitment to space exploration! Your resilience and dedication continue to inspire space enthusiasts around the…
తన సహోద్యోగుల తరపున సునీత విలియమ్స్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ అభివృద్ధి చెందుతోందని, ఖచ్చితంగా సునీత విలియమ్స్ అనుభవం, నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటోన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications