మహాసముద్రంలో ఎర్ర నీళ్లు పోస్తే.. అదృశ్య రహస్యం బయటపడింది!
మహాసముద్రాల లోపల నీరు ఎలా కదులుతుంది? పై పొరల్లో ఉండే పదార్థాలు కిందికి ఎంత వేగంగా వెళ్తాయి? వంటి రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ప్రయోగానికి తెరలేపారు. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రానికి సమీపంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ అద్భుత ప్రయోగం జరిగింది. నీటి ప్రవాహాల తీరుతెన్నులను కళ్లకు కట్టేలా చూసేందుకు పరిశోధకులు ఏకంగా 75 కిలోల ఎరుపు రంగు రసాయనాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ ప్రయోగం ద్వారా సముద్రపు నీటి అడుగున ఎవరికీ కనిపించని ఒక పెద్ద అడ్డుగోడ ఉందని పరిశోధకులు నిరూపించారు.
కేవలం రంగు నీళ్లు ఎలా కదులుతున్నాయో చూసేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేయలేదు. సముద్రపు నీటి ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తు ద్వారా పట్టుకునేందుకు 'రోడామిన్' అనే రసాయనాన్ని శాస్త్రవేత్తలు వాడారు. మార్తాస్ విన్యాడ్ తీరానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగం చేపట్టారు. ఒక పరిశోధన నౌక ద్వారా సుమారు 130 గ్యాలన్ల రోడామిన్-ఇథనాల్ మిశ్రమాన్ని సముద్రం పైభాగంలో ఉన్న నీటి సాంద్రతకు సమానంగా ఉండేలా సముద్రంలోకి పంప్ చేశారు. ఈ రంగు నీరు ఎలా కదులుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సముద్రపు ప్రవాహాలు, ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు.

పై పొరల్లోనే నిలిచిపోయిన ఎరుపు రంగు.. బలమైన మిక్సింగ్ ప్రక్రియ
సముద్రం పైభాగంలో గాలి, అలల తాకిడి కారణంగా నీరు నిరంతరం కలగలుపుతూ ఉంటుంది. దీనినే శాస్త్రవేత్తలు 'మిక్స్డ్ లేయర్' అని పిలుస్తారు. ఈ పై పొరలో వాతావరణానికి, సముద్రానికి మధ్య ఉష్ణోగ్రతలు, గ్యాస్లు నిరంతరం మార్పిడి జరుగుతుంటాయి. తాము వదిలిన ఎరుపు రంగు రసాయనం సుమారు 33 గంటల పాటు పరిశీలిస్తే.. అందులో 99 శాతం రంగు ఆ పై పొరలోనే ఉండిపోయినట్లు గుర్తించారు. పై భాగంలో నీరు ఎంత వేగంగా కలుస్తుందో ఈ ప్రయోగం స్పష్టంగా చూపించింది.
సముద్రపు అడుగున కనిపించని అదృశ్య గోడ!
పై పొరల్లో వేగంగా కరిగిన రసాయనం, దాని కింద ఉన్న దట్టమైన నీటి పొరలోకి వెళ్లేసరికి చాలా నెమ్మదించింది. పై పొరల్లో జరిగే కలయికతో పోలిస్తే.. కింది పొరల్లో అది సుమారు 140 రెట్లు తక్కువ వేగంతో కదులుతున్నట్లు తేలింది. అంటే సముద్రం పై భాగంలోని నీరు సులభంగా కదిలినప్పటికీ, కిందకు వెళ్లేసరికి నీటి సాంద్రతలో వచ్చే మార్పుల వల్ల ఒక బలమైన అడ్డుగోడలా ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పై నుంచి కిందికి పదార్థాలు వెళ్లడానికి రోజుల సమయం పడుతుందని, అది కూడా నిరంతరంగా జరగకుండా అక్కడక్కడా విడతలుగా జరుగుతుందని ఈ ప్రయోగం ద్వారా తెలిసింది.
ఈ ప్రయోగం ఎందుకు అంత ముఖ్యం?
సముద్రాల ద్వారా ఉష్ణోగ్రతలు, పోషకాలు, కాలుష్య కారకాలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయో అంచనా వేయడానికి ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక రంగు నీళ్ల ప్రవాహాన్ని గమనించడం ద్వారా మహాసముద్రాలు లోపల ఎలా పనిచేస్తాయో పెద్ద రహస్యమే వీడినట్లయింది. ఉపరితలం ఎంత అశాంతిగా, అలలతో కనిపించినప్పటికీ.. సముద్రపు లోపలి పొరలు మాత్రం అత్యంత ప్రభావవంతమైన సరిహద్దులుగా పనిచేస్తాయని ఈ అద్భుత ప్రయోగం నిరూపించింది.














Click it and Unblock the Notifications
