Smiling Buddha: పోఖ్రాన్ అణు పరీక్షతో అగ్రదేశాలకు భారత్ పంపిన మాస్ మెసేజ్..!!
1998 మే 11న..అది రాజస్థాన్‌లోని థార్ ఎడారి. సూర్యుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్న వేళ. భారత్ ప్రపంచ రాజకీయాల్లో తన స్థాయిని శాశ్వతంగా మార్చేసిన ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదే పోఖ్రాన్ టెస్ట్. పోఖ్రాన్‌లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించింది.ఈ పరీక్షలనే తర్వాత 'శక్తి' సిరీస్‌గా పిలిచారు. ఆ ఒక్క చర్యతో భారత్ ప్రపంచ దేశాలకు చాలా స్పష్టమైన సందేశాన్ని సంకేతాలను పంపింది. ఇక తమ దగ్గర కూడా అణ్వాయుధాలు తయారు చేసుకునే సామర్థ్యం ఉందంటూ సిగ్నల్స్ ఇచ్చింది.ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన వ్యూహాత్మక మౌనానికి ముగింపు పలికి, బహిరంగ అణుశక్తి దేశంగా కొత్త దశలోకి అడుగుపెట్టింది.ఇకపై ఏ అగ్రరాజ్యమైనా సరే.. భారత్‌ను బెదిరించి తలవంచించే పరిస్థితి ఉండదనే సంకేతాన్ని ప్రపంచానికి పంపింది.దీనికి పునాది ఎప్పుడు పడింది..?
ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ
1974, మే 18..సరిగ్గా బుద్ధ పూర్ణిమ రోజు.రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఒక్కసారిగా భూమి కంపించింది.కానీ అది భూకంపం కాదు,ఒక దేశపు ఆత్మగౌరవ గర్జన.'స్మైలింగ్ బుద్ధ'(Smiling Buddha)పేరుతో భారత్ తన మొదటి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. "బుద్ధుడు నవ్వాడు" అంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి శాస్త్రవేత్తల నుంచి సంకేతం అందింది. ఆ నవ్వు వెనుక ఒక శక్తి ఉంది, ఆ శక్తి ప్రపంచ రాజకీయ యవనికపై భారత్ స్థానాన్ని శాశ్వతంగా మార్చేసింది.

1960వ దశకంలో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం తర్వాత భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. అప్పటి అణుశక్తి కమిషన్ చైర్మన్ హెచ్.ఎన్. సేత్నా, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్ రాజా రామన్న నేతృత్వంలో ఈ రహస్య ఆపరేషన్ మొదలైంది. కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ ప్రయోగం కోసం పోఖ్రాన్ ఎడారిని ఎంచుకున్నారు. మే 18 ఉదయం 8:05 గంటలకు భూమి అంతర్భాగంలో అణు విస్ఫోటనం జరిగింది. దీనిని భారత్ 'శాంతియుత అణు ప్రయోగం'(Peaceful Nuclear Explosion) గా అభివర్ణించింది.
ఇందిరా గాంధీ: ఉక్కు మహిళ సాహసం
ఈ ఆపరేషన్ వెనుక అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర మరువలేనిది. అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల నిఘా కళ్లు కప్పి, ప్రపంచ దేశాల ఆంక్షలకు భయపడకుండా అణు పరీక్షకు పచ్చజెండా ఊపడం సామాన్యమైన విషయం కాదు. అప్పట్లో భారత్ ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, జాతీయ భద్రత విషయంలో ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె తీసుకున్న ఆ ధైర్య సాహసోపేతమైన నిర్ణయమే భారత్‌ను 'న్యూక్లియర్ క్లబ్'లో చేర్చింది. ఐదు అగ్రరాజ్యాలు (P5) కాకుండా అణు పరీక్ష జరిపిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.
ప్రపంచ రాజకీయాల్లో మారిన సమీకరణాలు
స్మైలింగ్ బుద్ధ తర్వాత ప్రపంచం భారత్‌ను చూసే కోణం మారిపోయింది. అప్పటివరకు భారత్‌ను కేవలం ఒక పేద, వ్యవసాయ దేశంగా చూసిన పాశ్చాత్య దేశాలు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, భారత్ తన స్వయంప్రతిపత్తిని చాటుకుంది. దక్షిణాసియాలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ పరీక్ష ద్వారా "మేము శాంతిని కోరుకుంటాం, కానీ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోం" అనే బలమైన సంకేతాన్ని భారత్ పంపింది.
అప్పుడు 'స్మైలింగ్ బుద్ధ'..ఇప్పుడు 'విశ్వగురు'
1974 నాటి పరిస్థితులతో నేటి పరిస్థితిని పోలిస్తే భారత్ ఎంతో ఎదిగింది. ఆనాడు స్మైలింగ్ బుద్ధ వేసిన పునాది వల్లే, 1998లో వాజ్‌పేయి హయాంలో 'పోఖ్రాన్-2' సాధ్యమైంది. నేడు భారత్ కేవలం అణు దేశం మాత్రమే కాదు, అంతరిక్షం నుంచి రక్షణ రంగం వరకు స్వయం సమృద్ధి సాధిస్తోంది. నాడు ఆంక్షలు విధించిన దేశాలే నేడు భారత్‌తో రక్షణ ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న పోరాటానికి ఆనాటి అణు పరీక్షే తొలి అడుగు.
'స్మైలింగ్ బుద్ధ' కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, అది భారత దేశ సత్తాకు నిదర్శనం. ఆ నవ్వులో గర్వం లేదు, కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంది. చరిత్రను మలుపు తిప్పిన ఆ ఘటన జరిగి దశాబ్దాలు గడిచినా, నేటికీ ప్రపంచ వేదికపై భారత్ గళం వినిపిస్తుందంటే దానికి కారణం ఆనాడు పోఖ్రాన్ గడ్డపై వినిపించిన ఆ అణు విస్ఫోటనమే. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు తలొగ్గని ఆనాటి పట్టుదలే నేటి నవభారతానికి మార్గదర్శి.














Click it and Unblock the Notifications