ఇస్రో ప్రతిష్ఠాత్మక మిషన్ తాత్కాలిక బ్రేక్..
ISRO: అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఓ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వాయిదా వేసుకుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మిషన్ ను బుధవారానికి వాయిదా వేసుకుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఆ మిషన్.. యాక్జియమ్ 4. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి నలుగురు వ్యోమగాములను తీసుకెళ్లడానికి ఇస్రో.. ఈ మిషన్ ను చేపట్టింది. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారాన్ని తీసుకుంది. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈ సాయంత్రం 5:45 నిమిషాలకు అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్ కు బయలుదేరాల్సి ఉంది.

దీనికోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో వాళ్లంతా అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ- చివరి నిమిషంలో వాయిదా వేసుకోవాల్సొచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.
బుధవారం సాయంత్రం 5:30 గంటలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ ఐఎస్ఎస్ కు వెళ్తుందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ తెలిపారు. ఈ మిషన్ కు భారత్ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్నారు.
శుభాన్షు శుక్లాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరక్ష పరిశోధకుడు స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్.. ఐఎస్ఎస్ కు వెళ్లాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధన కేంద్రానికి బయలుదేరి వెళ్లడం పెగ్గీ విట్సన్ కు ఇది రెండోసారి. సునీత విలియమ్స్ తరువాత విధి నిర్వహణలో అత్యధిక సమయంలో ఐఎస్ఎస్ లో గడిపిన అనుభవం ఆమెకు ఉంది.
అంతరిక్ష పరిశోధనల్లో 60కి పైగా అంశాలపై సైంటిఫిక్ స్టడీస్ నిర్వహించాలనేది ఈ మిషన్ ఉద్దేశం. భారత్, అమెరికా, పోలాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, బ్రెజిల్, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 31 యూరోపియన్ దేశాల నుండి ఆయా అంశాలను ఇస్రో- నాసా స్వీకరించాయి.












Click it and Unblock the Notifications