బెర్ముడా ట్రయాంగిల్ ను మించిన మిస్టరీ: అటుగా వెళ్లాలంటే పక్షులు కూడా దడుసుకుని ఛస్తాయ్..!!
నింగిలో స్వేచ్ఛగా విహరించే పక్షులకు ఎటువంటి అడ్డంకులూ ఉండవు. రెక్కలు విప్పుకొని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగిరిపోతుంటాయి. ఖండాలను సైతం దాటుకుంటాయి. పెలికాన్ వంటి కొన్ని రకాల పక్షులు ప్రపంచ పటంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ తిరుగుతుంటాయి. వాటికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
అలాంటి పక్షులు కూడా ఎగరలేని, అటు వైపుగా కన్నెత్తి చూడని ప్రదేశం ఈ భూమ్మీద ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అదే వాలెస్ లేన్. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య ఉన్న అదృశ్య రేఖ ఇది. ఈ రెండు ఖండాలను వేరు చేసే ఈ లేన్ మీదుగా పక్షులు ఎగరలేవు. వన్యప్రాణులు ఈ ఊహాజనిత సరిహద్దును ఎప్పటికీ దాటవు. ఈ పరిణామం ఇప్పటిది కాదు- 10 మిలియన్ల సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది.

సుమారు 30 మిలియన్ సంవత్సరాల కిందట ఆస్ట్రేలియన్ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్‌ను ఢీకొని ఒక ద్వీప సమూహం ఏర్పడటంతో ఇలాంటి వాతావరణం నెలకొంది. సముద్ర ప్రవాహాన్ని మార్చివేసింది. కొత్త ప్రాంతీయ వాతావరణాన్ని ఏర్పరిచింది. ఒక వైపు- ఇండోనేషియా, మలేషియాలో కోతులు, ఏనుగులు, పులులు, ఖడ్గమృగాలు పరిణామం చెందాయి.
మరోవైపు, న్యూ గినియా, ఆస్ట్రేలియాలో మార్సుపియల్స్, మోనోట్రీమ్స్, రోడెంట్లు, కాకాటూలు వృద్ధి చెందాయి. అరుదైన జీవజాతులు ఆవిర్భవించాయి. ఈ రెండు ఖండాల్లోనూ సమృద్ధిగా ఉన్నాయి. ఈ రెండూ ఈ వాలెస్ లేన్ దాటి రాకపోకలు సాగించలేవు. చివరికి పక్షులు కూడా.
సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ 19వ శతాబ్దం మధ్యలో ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు. ఆయన పేరే దీనికి పెట్టారు. బాలి, లోంబోక్ మధ్య ఉన్న ఈ జలసంధి 24 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. వాలెస్ లైన్ ఆసియా ఖండంలోని ఒక షెల్ఫ్‌ను ఆస్ట్రేలియన్ టెక్టోనిక్ ప్లేట్‌లోని షెల్ఫ్ నుండి వేరు చేస్తుంది.
ఇది ఒక భౌగోళిక రేఖ మాత్రమే కాదు, వాతావరణ, జీవ రేఖ కూడా. లోంబోక్ జలసంధి వంటి లోతైన సముద్ర మార్గాలు ప్రతి షెల్ఫ్‌ను వేరు చేయడం సహజం. పక్షులు, వణ్యప్రాణులు, ఇతర జంతువులను సైతం వేరు చేయడం దీని ప్రత్యేకత. ఈ జలసంధి మీదుగా పక్షులు ఎగరకపోవడం అనేది విచిత్రం.
పక్షులు, సరీసృపాలు, ఇతర జంతువుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఏ అదృశ్య శక్తి వాటి సంచారానికి అడ్డుపడుతున్నాయనే విషయాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోతున్నారు. వాతావరణం దీనికి ఓ కారణంగా పరిగణిస్తోన్నారు గానీ దీనికి శాస్త్రీయబద్ధ వివరణలు లేవు.












Click it and Unblock the Notifications