Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు పిల్-సుప్రీం షాకింగ్ కామెంట్స్..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో ప్రపంచంలో ఎక్కడా ద్వైపాక్షిక టోర్నీలు, సిరీస్ లు ఆడకూడదని కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే రెండు కంటే ఎక్కువ దేశాలు పాల్గొనే టోర్నీలకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. అయితే తాజాగా దుబాయ్ లో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఈ నెల 14న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ పైనా విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులోనూ ఈ నెల 14న జరగాల్సిన భారత్-పాక్ ఆసియాకప్ మ్యాచ్ రద్దు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఊర్వశీజైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్ధులు ఈ పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ మ్యాచ్ రద్దు చేయాలని కోరుతూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తక్షణం సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఆడకుండా ఆదేశాలు ఇవ్వాలని వీరు కోరారు.

ఆసియా కప్ లో భాగంగా ఈ నెల 14న జరిగే భారత్-పాక్ మ్యాచ్ ఓ దారుణమని, దీనిపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అయితే బెంచ్ పై ఉన్న న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి దీనిపై అంత అత్యవసర విచారణ ఎందుకని ప్రశ్నించారు. ఇది కేవలం ఓ మ్యాచ్ మాత్రమేనన్నారు. దాన్ని అలాగే చూడాలన్నారు. ఈ ఆదివారం మ్యాచ్ జరుగుతుందని, ఏం చేయగలమంటూ వ్యాఖ్యానించారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారత పౌరులు, సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవం, ప్రజల భావోద్వేగాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని పిటిషనర్లు తెలిపారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంతో క్రీడల్లో పాల్గొనడం సాయుధ దళాల నైతికతను దెబ్బతీస్తుందని, ఉగ్రవాద బాధితులు, అమరవీరుల కుటుంబాలకు వేదన కలిగిస్తుందని వాదించారు. క్రికెట్‌ను జాతీయ ప్రయోజనాలు, పౌరుల జీవితాలు లేదా సాయుధ సిబ్బంది త్యాగాల కంటే ఎక్కువగా ఉంచలేమని పిటిషనర్లు వాదించారు. అయితే ఈ విషయంపై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది.












Click it and Unblock the Notifications