క్రికెట్ లోకంలో తీవ్ర విషాదం: 19 ఏళ్ల క్రికెటర్ ఆత్మహత్య!
ఇండియాలో ఐపీఎల్ 2026 సందడి నెలకొన్న నేపథ్యంలో క్రికెట్ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ యువ క్రీడాకారిణి జీవితం విషాదాంతమైంది. పుదుచ్చేరిలో నివసిస్తున్న 19 ఏళ్ల ఏంజెల్ గంగ్వానీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. చెన్నైలో జీఎస్టే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కాశ్మీర్ కుమార్ కూతురు అయిన ఏంజెల్.. ఉన్నత చదువులతో పాటు క్రికెట్లో రాణించాలనే లక్ష్యంతో పుదుచ్చేరికి వచ్చింది. అక్కడ వెల్రాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతూనే, క్రికెట్ మైదానంలో తన సత్తా చాటాలని నిరంతరం శ్రమించేది.
ఎంపిక కాలేదని వేదన
ఏంజెల్ గంగ్వానీకి క్రికెట్ అంటే ప్రాణం. ఎలాగైనా ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే పట్టుదలతో ఆమె థిలాస్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో నిత్యం శిక్షణ పొందేది. ఈ క్రమంలోనే ఇటీవల థుటిపేట్‌లో నిర్వహించిన పుదుచ్చేరి టీ20 మహిళా క్రికెట్ జట్టు సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొంది. అయితే, అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారిణుల తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఏంజెల్ తీవ్ర నిరాశకు గురైంది. తన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని.. జట్టుకు ఎంపిక కాలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే ఆమెలో మార్పు వచ్చిందని.. ఒంటరిగా గడుపుతూ ఎవరితోనూ మాట్లాడటం లేదని ఆమె ఉంటున్న ఇంటి యజమాని పోలీసులకు వివరించారు.

ఆసుపత్రికి చేరేలోపే మృతి
బుధవారం ఎప్పటిలాగే క్రికెట్ ప్రాక్టీస్ ముగించుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏంజెల్ తన అద్దె గదికి చేరుకుంది. రాత్రి సమయం దాటిపోతున్నా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కోచ్ కతిర్వేల్‌కు అనుమానం కలిగింది. దీంతో ఆయన నేరుగా ఏంజెల్ గదికి వెళ్లి చూడగా.. ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కోచ్, మరికొందరు స్థానికులు కలిసి ఆమెను కతిర్కామంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని.. ఆసుపత్రికి చేరేలోపే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
అన్ని కోణాల్లో పోలీసుల విచారణ
ఈ హృదయ విదారక ఘటనపై డి.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతానికి సెలక్షన్ ట్రయల్స్‌లో వైఫల్యం, మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నప్పటికీ.. పోలీసులు ఇతర కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఆమె ఫోన్ కాల్ డేటాను, ఇతర సాక్ష్యాలను సేకరిస్తున్నారు. చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారిణి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆమె కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. క్రికెట్ రంగంలో ఒత్తిడిని తట్టుకునేలా యువ క్రీడాకారులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.












Click it and Unblock the Notifications