టీమిండియాకు ఇంకా అందని ఆసియా కప్..! నక్వీకి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్ ..!
గత నెలలో దుబాట్ వేదికగా జరిగిన ఆసియా కప్ ను అలవోకగా గెల్చుకున్న టీమిండియా విజేతలకు ఇచ్చే ట్రోఫీని మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా అయిన మొహసిన్ నక్వీ నుంచి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో నక్వీ దాన్ని హోటల్ రూమ్ కు తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత తన వద్దకు వచ్చి అధికారికంగా ఈ ట్రోఫీని తీసుకోవాలని షరతులు కూడా పెట్టాడు. చివరికి ట్రోఫీని పంపేస్తామని కూడా చెప్పాడు. అయినా ఇంకా ట్రోఫీ మన వాళ్లకు అందలేదు.
ఈ నేపథ్యంలో ఆసియా కప్ ట్రోఫీని భారతదేశానికి అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారిక ఇమెయిల్ చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నఖ్వీ నుంచి దీనిపై ప్రతిస్పందన ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఆయన వైపు నుంచి స్పందన లేకపోతే మాత్రం అధికారిక మెయిల్ ద్వారా ఈ విషయాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రక్రియలో తాము దశలవారీగా ముందుకు వెళ్తున్నామని, దీన్ని ఇకపైనా కొనసాగిస్తామని తెలిపారు.

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత జట్టు నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించడంతో ఆసియా కప్ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా.. ఏసీసీ ఛీఫ్ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో, బీసీసీఐ... నఖ్వీ ప్రవర్తనను ఖండించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ టోర్నీ విజేతకు ఆసియా కప్ 2025 ట్రోఫీని అధికారికంగా అందజేయాలని, దానిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అదుపులో ఉంచాలని కోరారు.

ఆసియా కప్ ట్రోఫీ ప్రదానం రోజు జరిగిన ఘటనలపై ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాలకు నక్వీ క్షమాపణలు చెప్పాడు. అయితే ట్రోఫీని మాత్రం ఇంకా భారత్ కు అప్పగించలేదు. ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లు గెల్చుకున్న మెడల్స్ ను కూడా ఇవ్వలేదు. దీనిపై ఇప్పుడు ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అసలే ఐసీసీ ఛైర్మన్ గా మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షా ఉన్నారు.












Click it and Unblock the Notifications