బోణీ కొడితేనే పాకిస్తాన్‌కు బేరం: తుదిజట్టులో..!!
Pakistan vs New Zealand: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చేసింది. నేడు తొలి మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ ఏలో భాగంగా ఈ ట్రోఫీకి ఆతిథ్యాన్ని ఇస్తోన్న పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడబోతోంది. కరాచీ స్టేడియం దీనికి వేదిక. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు పోరు మొదలవుతుంది. మార్చి 9వ తేదీన ఫైనల్.
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. తొలి గేమ్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠభరితంగా మారింది. పాకిస్తాన్ తన రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొట్టబోతోండటమే దీనికి ప్రధాన కారణం. టఫ్ఫెస్ట్ రైవల్ భారత్‌ను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ మీద పాకిస్తాన్ ఎలా ఆడుతుందనే విషయం మీదే అందరి దృష్టీ నిలిచింది.
వచ్చే ఆదివారం భారత్- పాకిస్తాన్ తలపడనున్నవిషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా ఈ ఫోరు సాగనుంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గత ఏడాది జూన్ 9వ తేదీన ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఆ తరువాత ఈ రెండు జట్లూ తలపడబోతోండటం ఇదే తొలిసారి.
న్యూజిలాండ్‌పై గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్ టీమ్. దీనికోసం మెరికల్లాంటి ప్లేయర్లను తుదిజట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్ కమ్ కేప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, మాజీ కేప్టెన్ బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా.. వంటి బ్యాటర్లు, బౌలర్లతో బలంగా ఉందా జట్టు.
తొలి మ్యాచ్ ఆడబోయే తొలి జట్టులో- మహ్మద్ రిజ్వాన్ (కేప్టెన్- వికెట్ కీపర్), ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్, సవూద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, ఖుష్దిల్ షా, తయ్యబ్ తాహిర్, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, మహ్మద్ హస్నైన్‌కు చోటు దక్కొచ్చు.
న్యూజిలాండ్ తుదిజట్టులో- డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కేప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ, విలియం ఓరూర్కీ ఆడే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications