T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..!
భారత్-న్యూజీలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ డారిల్ మిచెల్ పైకి బంతిని విసిరి కొట్టాడు. మిచెల్ కొట్టిన బంతిని నేరుగా తీసుకుని అతనిపైకి అర్ష్ దీప్ విసిరాడు. దీంతో మిచెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్ష్ దీప్ పైకి రావడం, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్ధితిని సద్దుమణిగేలా చేయడం జరిగాయి. అయితే దీనిపై ఐసీసీ స్పందించింది.
కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ పై అర్ష్ దీప్ సింగ్ బంతిని విసరడం ద్వారా ఐసీసీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అయింది. అయితే అర్ష్ దీప్ సింగ్ ఆ ఓవర్ ముగియగానే మిచెల్ వద్దకు వెళ్లి సారీ చెప్పేశాడు. మ్యాచ్ ముగిశాక కూడా మిచెల్ ను కలిసి మరోసారి జరిగిన ఘటన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దీంతో వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కూడా కనిపించింది. అయితే ఐసీసీ మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కాబట్టి అర్ష్ దీప్ పై ఇవాళ చర్యల్ని ప్రకటించింది.

అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఐసిసి టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1ను ఉల్లంఘించినందుకు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్ష్‌దీప్ ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయ సిబ్బంది విషయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘించినట్లు తేలింది. ఇది అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో అనుచితమైన మరియు/లేదా ప్రమాదకరమైన రీతిలో ఆటగాడిపై లేదా సమీపంలో బంతిని (లేదా క్రికెట్ పరికరాలకు సంబంధించిన ఏదైనా ఇతర వస్తువు) విసరడానికి సంబంధించినది. జరిమానాతో పాటు, అర్ష్‌దీప్ క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కలిపారు. ఇది 24 నెలల కాలంలో అతను చేసిన మొదటి ఉల్లంఘనగా పరిగణిస్తారు. మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇంకా కఠిన చర్యలుంటాయి.












Click it and Unblock the Notifications