ఐపీఎల్ స్టార్ కు బీసీసీఐ పిలుపు- జట్టులో మార్పులు
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మధ్యలో ఇండియా-ఏ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ యుద్ధవీర్ సింగ్ గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో పేసర్ అశోక్ శర్మను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ ముక్కోణపు సీరిస్ లో టీమిండియా ఏ లీగ్ కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొన్నటి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడాడు అశోక్ శర్మ. తన అద్భుతమైన వేగం, పదునైన బౌలింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అతను కనబర్చిన మెరుగైన ప్రదర్శనకు ప్రతిఫలంగానే ఇప్పుడు ఇండియా-ఏ జట్టులో ఆడే ఈ సువర్ణావకాశం లభించింది. కీలకమైన సమయంలో జట్టులోకి వచ్చిన అశోక్ శర్మ, తన పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తాడనేది వేచి చూడాలి.

యుద్ధవీర్ సింగ్ గాయం తీవ్రత
బీసీసీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ నెల 13న ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు యుద్ధవీర్ సింగ్ గాయపడ్డాడు. కుడి భుజంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు 11న జరిగిన ఫీల్డింగ్ సెషన్ లో సైతం ఇదే భుజానికి స్వల్పంగా గాయమైంది. వైద్య పరీక్షలు నిర్వహించిన నిపుణులు అతనికి 'రోటేటర్ కఫ్' సమస్య ఉన్నట్లు తేల్చారు. పూర్తిస్థాయి కోలుకోవడానికి వీలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ లో వెళ్లనున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ట్రై-సిరీస్‌లో ఇండియా-ఏ ప్రదర్శన ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్-ఏ చేతిలో ఓటమితో టోర్నీని ప్రారంభించిన భారత్, ఆ తర్వాత జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక-ఏ జట్టుపై కూడా విజయం సాధించలేకపోయింది.
శ్రీలంకలోని దంబుల్లా పిచ్‌లు సాధారణంగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులలో లైన్ అండ్ లెంగ్త్‌ను నిలకడగా సాధించే బౌలర్లు రాణించగలరు. ఐపీఎల్‌లో కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న అశోక్ శర్మకు ఈ పరిస్థితులు బాగా ఉపయోగపడతాయి. నూతన బంతితో పాటు డెత్ ఓవర్లలో కూడా యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌లతో కలిసి వికెట్లు తీయడంలో అతను కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
భారత సవరించిన జట్టు వివరాలు
| విభాగం | ఆటగాళ్ల వివరాలు |
|---|---|
| బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు | తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, అనుకుల్ రాయ్ |
| వికెట్ కీపర్లు | ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్ర |
| బౌలర్లు | విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్, అశోక్ శర్మ |












Click it and Unblock the Notifications