జస్ట్ 5 రోజుల గ్యాప్ లో IPL 2024, T20 వరల్డ్ కప్? క్రికెట్ అభిమానులకు పండగే !
ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు టీ20 పండుగ ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఒకే ఏడాది ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ కూడా రావడంతో అభిమానులకు టీ20 మేనియా తప్పేలా లేదు. అదీ కేవలం 5 రోజుల గ్యాప్ లోనే ఈ రెండు మెగా టోర్నీలు కూడా ఉండబోతున్నట్లు తాజాగా బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు చేసుకుంటే తప్ప అభిమానులు దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ పండుగకు సిద్ధమైపోవచ్చు.
ఈ ఏడాది ఐపీఎల్ ను మార్చి 22న ప్రారంభించి మే 26తో ముగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందులో సూత్రప్రాయంగా ఈ తేదీల్ని ఖరారు చేశారు. అయితే దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండబోతున్నాయి. దాదాపు ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లోనే ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే ఐపీఎల్ షెడ్యూల్ పై ప్రభావం చూపడం ఖాయం. అయితే ఎన్నికలు దశల వారీగా జరుగుతాయి కాబట్టి వాటి షెడ్యూల్ ఆధారంగా తేదీలు, వేదికలు ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మే 26తో ఐపీఎల్ ఫైనల్ ముగిసిపోతే ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అంటే ఈ రెండు మెగాటోర్నీల మధ్య ఉన్న గ్యాప్ కేవలం 5రోజులే. ఈ 5 రోజుల్లో అన్ని జట్లూ తమ ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఐసీసీ మెగా టోర్నీకి సిద్ధం కావాల్సి ఉంటుంది. మరి ఈ గ్యాప్ సరిపోతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఫిక్స్ అయిన సిరీస్ ల షెడ్యూల్స్ ను పరిగణనలోకి తీసుకుంటే తప్పని పరిస్ధితి.
దీంతో మార్చి 22న ప్రారంభించి మే 26తో ముగించాలని భావిస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ ను లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాత అధికారికంగా ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది. ఎలాగో వచ్చే నెల రెండోవారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది. ఈ ప్రకటన తర్వాత ఐపీఎల్ తేదీలు ఖరారవుతాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications