హర్భజన్ గురించి శ్రీశాంత్ బయటపెట్టిన నమ్మలేని నిజాలు..!
క్రికెట్ మైదానంలో పదిహేడేళ్ల క్రితం జరిగిన ఆ 'చెంపదెబ్బ' సెగలు ఇంకా తగ్గలేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన 'స్లాప్‌గేట్' ఉదంతం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టీమ్ ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తాజాగా తన మాజీ సహచరుడు హర్భజన్ సింగ్‌పై విరుచుకుపడ్డారు. తనను కొట్టిన ఘటనను భజ్జీ ఒక 'బిజినెస్'లా మార్చుకున్నాడని, ఆ వివాదాన్ని వాడుకుని కోటి రూపాయల వరకు సంపాదించాడని శ్రీశాంత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మలయాళ వార్తా సంస్థ 'మాతృభూమి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. "నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ, తను తప్పును మర్చిపోను. మర్చిపోతే అవతలి వ్యక్తి అదే తప్పును మళ్లీ చేస్తారు. భజ్జీ విషయంలో అదే జరిగింది" అని శ్రీశాంత్ పేర్కొన్నారు. 2008 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత హర్భజన్.. శ్రీశాంత్ చెంపపై కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మైదానంలోనే శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం.

ప్రకటనల కోసం 'స్లాప్‌గేట్' వాడుకున్నారా?..
ఇటీవలి కాలం వరకు వీరిద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని అందరూ భావించారు. కానీ, ఒక యాడ్ (ప్రకటన) కోసం హర్భజన్ ఆ పాత వివాదాన్ని మళ్ళీ తెరపైకి తేవడం శ్రీశాంత్‌కు ఆగ్రహం తెప్పించింది. ఆ ప్రకటన ద్వారా హర్భజన్ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లాభపడ్డాడని శ్రీశాంత్ ఆరోపించారు. అంతేకాకుండా, ఆ యాడ్ ప్రమోషన్ కోసం తనకు కాల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టమని భజ్జీ అడగడం శ్రీశాంత్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో వెంటనే హర్భజన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసినట్లు శ్రీశాంత్ వెల్లడించారు.
అదంతా కేవలం నటన మాత్రమే!..
హర్భజన్ సింగ్ బయటి ప్రపంచానికి చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తారని, కానీ అదంతా కేవలం నటన మాత్రమేనని శ్రీశాంత్ ఘాటుగా విమర్శించారు. "చాలా ఇంటర్వ్యూల్లో అతను నా కూతురి గురించి, నా గురించి గొప్పగా మాట్లాడతాడు. జనం అతన్ని గొప్ప వ్యక్తి అనుకుంటారు. కానీ అది నటన అని నాకు తెలుసు. ఆ నటనను శ్రీశాంత్ అంగీకరించడు" అని ఆయన స్పష్టం చేశారు. తనకు అతనితో ఎలాంటి అవసరం లేదని, భజ్జీతో తన బంధం పూర్తిగా తెగిపోయిందని క్లారిటీ ఇచ్చారు.
మళ్ళీ తెరపైకి పాత గొడవలు..
గత ఏడాది ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ ఆనాటి స్లాప్‌గేట్ వీడియోను షేర్ చేయగా.. హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరూ కలిసి వచ్చి మోడీని విమర్శించారు. మా మధ్య అంతా బాగానే ఉందని లోకానికి చెప్పారు. కానీ ఇప్పుడు శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, లోలోపల నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉందని అర్థమవుతోంది. ఇద్దరు ప్రపంచ కప్ విజేతల మధ్య నెలకొన్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.














Click it and Unblock the Notifications