RCB బిగ్ గిఫ్ట్: ఐపీఎల్ మ్యాచ్ లపై AI కన్ను
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ సొంత మ్యాచ్‌లను రెండు కొత్త స్టేడియాల్లో ఆడనుంది. భద్రత కారణాలతో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్, ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలు ఇకపై ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్‌లుగా మారనున్నాయి.
ఐపీఎల్ 2025 టైటిల్ సాధించిన తర్వాత బెంగళూరులో చోటు చేసుకున్న విషాదకర సంఘటనల నేపథ్యంలో ఫ్రాంఛైజీ మళ్లీ బెంగళూరుకు తిరిగి రావడానికి సుముఖత చూపడం లేదనే వార్తల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి, ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఆర్సీబీ తన సొంత మ్యాచ్‌లన్నింటినీ చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతూ వస్తోంది. గత ఏడాది విజయోత్సవ వేడుకల అనంతరం స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మెరుగుదలకు తాజా చర్యలు చేపట్టింది. స్టేడియం లోపల, బయలా 300 నుండి 350 AI ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కు ప్రతిపాదనలను పంపించింది. ఈ ఏఐ కెమెరాలకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని తెలిపింది. సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు అవసరమౌతాయని పేర్కొంది.
ఈ టెక్నాలజీ.. వీడియో, ఆడియో, టెక్స్ట్ డేటాను విశ్లేషిస్తుంది. స్టేడియం లోపల, వెలుపలా, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన అంశాలపై సత్వర నిర్ణయాలను తీసుకోవడానికి ఈ డేటా సహాయపడుతుందని ఆర్సీబీ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం టెక్నాలజీ సంస్థ స్టాకుతో జతకట్టింది ఆర్సీబీ. ఆటోమేషన్, డేటా ఆధారిత భద్రత రంగంలో పని చేస్తోందీ సంస్థ. ఫేషియల్ రికగ్నిషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విషయంలో అనేక రాష్ట్రాల పోలీసు దళాలతో కొలాబరేట్ అయింది.












Click it and Unblock the Notifications