CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..!
ఐపీఎల్ 2026(IPL 2026)లో భాగంగా నిన్న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)చిత్తుగా ఓడిపోయింది. దీంతో టోర్నీలో హ్యాట్రిక్ ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి భారీగా పరుగులు సమర్పించుకున్న చెన్నై.. ఆ తర్వాత ఛేదనలో మెరుపులు మెరిపించినా కొండంత స్కోరు ముందు తేలిపోయింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (ruturaj gaikwad) ఓటమిపై స్పందించాడు.
ఆర్సీబీ విధించిన 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే వికెట్లు కోల్పోయింది. దీంతో ఇక కోలుకోవడం కష్టమని అంతా భావించారు. కానీ సర్ఫ్ రాజ్ ఖాన్ అర్ధసెంచరీ, చివర్లో ప్రశాంత్ వీర్ మెరుపులతో 200 పరుగుల మైలురాయి దాటగలిగింది. అయినా 43 పరుగుల తేడాతో మ్యాచ్ కోల్పోయింది. దీనిపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ ఓటమికి కారణం ఎవరో చెప్పేశాడు.

ఆర్సీబీ చేతిలో ఓటమి తర్వాత, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆ ఓటమికి పూర్తి బాధ్యతను తనపైనే వేసుకున్నాడు. ఒకవేళ తాను ఓపెనర్‌గా మరింతగా రాణించి ఉంటే తాము లక్ష్యాన్ని ఛేదించి ఉండేవాళ్ళమని రుతురాజ్ తేల్చిచెప్పేశాడు. కాబట్టి ఈ రోజు ఓటమి ఖచ్చితంగా నాదే అన్నాడు. గైక్వాడ్ తో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా వరుసగా మూడోసారి విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో మెరుపుల తర్వాత శాంసన్ ఐపీఎల్ లో అదే ఫామ్ కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. ఇదే చెన్నైకు శాపంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications