ఇంకో రెండ్రోజుల్లో పాక్‌తో మ్యాచ్- ఈ పరిస్థితుల్లో..
Pakistan vs New Zealand: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చేసింది. తొలి మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో తలపడుతోంది పాకిస్తాన్. కరాచీ స్టేడియం దీనికి వేదిక. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. తొలి గేమ్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠభరితంగా మారింది. పాకిస్తాన్ తన రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొట్టబోతోండటమే దీనికి ప్రధాన కారణం. భారత్‌ను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ మీద పాకిస్తాన్ ఎలా ఆడుతుందనే విషయం మీదే అందరి దృష్టీ నిలిచింది.
వచ్చే ఆదివారం భారత్- పాకిస్తాన్ తలపడనున్నవిషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా ఈ ఫోరు సాగనుంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గత ఏడాది జూన్ 9వ తేదీన ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఆ తరువాత ఈ రెండు జట్లూ తలపడబోతోండటం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌పై గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్ టీమ్.
ఈ పరిస్థితుల్లో టీమిండియాలో జోష్ నింపే వార్త వెలువడింది. జట్టు వైస్ కేప్టెన్ శుభ్‌మన్ గిల్.. ప్రమోషన్ పొందాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. టాప్ పొజీషన్‌లో నిలిచాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్.. దిగజారాడు. రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతంగా ఆడటమే అతని ర్యాంకింగ్ మెరుగుపడటానికి కారణమైంది. ఈ మూడింట్లోనూ అతను చెలరేగాడు. మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లో 87, రెండో దాంట్లో 60 పరుగులు చేశాడు. ఆ సిరీస్ మొత్తానికీ టాప్ స్కోరర్ అతనే. మొత్తం 259 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు గిల్.
ఫలితంగా అతని పాయింట్లు భారీగా పెరిగాయి. 796 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. వన్డే ర్యాంకింగుల్లో అగ్రస్థానానికి చేరుకోవడం గిల్‌కు ఇదే తొలిసారి. ఒకరకంగా ఇన్ని పాయింట్లను సాధించడం కూడా ఫస్ట్ టైమే. 773 పాయింట్లతో బాబర్ ఆజమ్ రెండో పొజీషన్‌కు దిగజారాడు.












Click it and Unblock the Notifications