హైలైట్ సీన్ ఇదే: వాళ్లల్లో వాళ్లకు ఎన్ని ఉన్నా.. !!
Rohit Sharma kisses Hardik Pandya : టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు అందుకున్న రెండో జట్టు ఇదే. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే.
ఏడు పరుగులతో..
శనివారం రాత్రి బార్బడొస్‌లో జరిగిన ఫైనల్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగలు వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.

చివరి మ్యాచ్..
ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తరువాత విజృంభించాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ న్యాయం చేశాడు. 31 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47 పరుగులతో రాణించాడు.
మెరుపు ఇన్నింగ్..
చివర్లో శివం దూబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 16 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 27 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 170ని దాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లల్లో కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్ట్జే రెండు చొప్పు. మార్కో జెన్‌సెన్, కగిసొ రబడ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
బెంబేలెత్తించిన క్లాసెన్
178 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా కూడా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కుకున్నారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 58 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. వారిద్దరూ అవుట్ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టనిపించింది గానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డు నిలిచాడు.
వారిద్దరి అవుట్‌తో..
27 బంతుల్లోనే అయిదు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు. అతను ఉన్నంత సేపూ మ్యాచ్‌పై ఆశల్లేవు. 151 పరుగుల వద్ద క్లాసెన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉండటం కలవరపాటుకు గురి చేసినా చివరి ఓవర్ తొలిబంతికి అతనూ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది.
చివరి ఓవర్‌లో హైడ్రామా..
మ్యాచ్ గెలవాలంటే చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. తొలి బంతిని వైడ్ ఫుల్ టాస్‌గా సంధించాడు. లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు మిల్లర్. అది సక్సెస్ కాలేదు. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా దాన్ని అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తరువాత టీమిండియా గెలవడానికి ఎంతో సమయం పట్టలేదు.

హార్దిక్‌ను ముద్దాడిన రోహిత్..
మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యాను ముద్దాడాడు రోహిత్ శర్మ. టీవీ కామెంటేటర్‌తో అతను మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా వచ్చి పాండ్యాను ముద్దు పెట్టుకున్నాడు. ఈ రకంగా థ్యాంక్స్ చెప్పినట్టయింది. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐపీఎల్‌లో గొడవలు..
ఐపీఎల్ 2024 సీజన్‌లో వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కేప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి మరీ హార్దిక్ పాండ్యా చేతికి జట్టు పగ్గాలను అప్పగించడం దీనికి కారణం. రోహిత్, హార్దిక్ అభిమానులు పరస్పరం సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ సైతం చేసుకున్నారు. ఇప్పుడు దేశం కోసం వారిద్దరూ ఒక్కటయ్యారు. జట్టును గెలిపించారు.












Click it and Unblock the Notifications