క్రీడలకూ మతానికీ లింక్? వరల్డ్ కప్ వివాదంపై టాలీవుడ్ హీరోయిన్ ఫైర్!
టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026ను గెలుచుకున్న తర్వాత, ట్రోఫీని అహ్మదాబాద్‌లోని హనుమాన్ దేవాలయంలో దర్శనం కోసం తీసుకువచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జై షా పాల్గొన్న ఈ ఆలయ సందర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా,.. సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ వాటిని ఖండించారు.
సిగ్గుచేటు చర్య-కీర్తి ఆజాద్
కీర్తి ఆజాద్ తన ఎక్స్ ఖాతాలో ఈ చర్యను 'సిగ్గుచేటు'గా అభివర్ణించారు. "టీమిండియాకు సిగ్గుండాలి. 1983లో మేము గెలిచినప్పుడు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు జట్టులో ఉన్నారు. ట్రోఫీని భారత మాతృభూమికి తీసుకొచ్చాం. ఇప్పుడు భారత క్రికెట్ ట్రోఫీని ఎందుకు లాగుతున్నారు? మసీదుకు ఎందుకు కాదు? చర్చికి ఎందుకు కాదు? గురుద్వారాకు ఎందుకు కాదు?" అని ఆయన ప్రశ్నించారు. కీర్తి ఆజాద్ తన వాదనను కొనసాగిస్తూ,..ఈ జట్టు సూర్యకుమార్ యాదవ్ లేదా జై షా కుటుంబానికి కాదని, యావత్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. "సిరాజ్ ఎప్పుడూ మసీదుకు, సంజూ ఎప్పుడూ చర్చికి ట్రోఫీ తీసుకెళ్లలేదు. సంజూ కీలక ఆటగాడు, ఉత్తమ ఆటగాడు. ఈ ట్రోఫీ ప్రతి మతానికి చెందిన 14 లక్షల మంది భారతీయులది. ఇది ఒక మతం విజయాన్ని జరుపుకునే వేదిక కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

ప్రముఖ నటి ఖుష్బూ కౌంటర్
కీర్తి ఆజాద్ కామెంట్స్ తర్వాత దేశవ్యాప్తంగా చర్చ మొదలుకాగా,.. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రోఫీ గెలిచిన దానికంటే వివాదం అనవసరమన్నారు. "ట్రోఫీ గెలిచినందుకు అల్లాహ్‌కు, భగవంతుడికి, ఏసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెప్పండి. మన భారత జట్టు మరోసారి ట్రోఫీ గెలిచినందుకు దేవుడికి తలవంచి కృతజ్ఞతలు తెలియజేయాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రోఫీని ఆలయం లేదా చర్చికి తీసుకెళ్లడంలో ఎలాంటి తప్పు లేదని ఖుష్బూ సుందర్ పేర్కొన్నారు. "సంజూ శాంసన్ ట్రోఫీ గెలిచి, గుండెపై సిలువ గుర్తు చేసుకుని ప్రార్థించాడు. అలాగే, కెప్టెన్ సూర్యకుమార్ మైదానంలోని మట్టిని నుదుటిపై పెట్టుకున్నాడు. ఇది రాజ్యాంగంలో రాయకపోయినా, భారతీయులుగా మన భావాలను, భారతదేశం పట్ల మనకున్న సర్వోన్నత గౌరవాన్ని తెలియజేస్తుంది" అని ఆమె ఉదాహరణలిచ్చారు.
మతాన్ని బట్టి ట్రోఫీ సందర్శనను విమర్శించడం సంకుచిత ఆలోచన అని ఖుష్బూ సుందర్ గట్టిగా చెప్పారు. "ప్రతి ఒక్కరికీ వారి సొంత మతం ఉండవచ్చు. కానీ ఈ ట్రోఫీ మొత్తం భారత జాతికి, దేశానికి గర్వకారణం. దీనిపై మతపరమైన చర్చలు చేసే వారి ఆలోచన చాలా చిన్నది, సంకుచితమైనది" అని ఆమె స్పష్టం చేశారు. భారత క్రికెట్ జట్టు మార్చి 8, 2026న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి T20 ప్రపంచ కప్పును గెలుచుకుంది.












Click it and Unblock the Notifications