గంభీర్ వారసుడిగా కొత్త పేరు ? నో చెప్పేసిన తెలుగోడు ?
ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా ప్రదర్శన అభిమానుల్ని అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా టెస్టు సిరీస్ లలో టీమిండియా ఆటతీరు నాసిరకంగా మారడంతో బీసీసీఐ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ (Team india Head Coach) గా గౌతం గంభీర్ స్దానంలో సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తెరవెనుక పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ తెలుగు మాజీ క్రికెటర్ కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ సంవత్సరం టీమ్ ఇండియా ఆసియా కప్ టీ20 టోర్నీ, ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ గెల్చుకున్నా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సైతం కోల్పోయింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో ఎదురైన 0-2 వైట్ వాష్ భారత్ కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. గతేడాది చివర్లో న్యూజీలాండ్ చేతిలో 0-3 తేడాతో ఎదురైన టెస్టు సిరీస్ ఓటమి కూడా గౌతం గంభీర్ కోచింగ్ పై అనుమానాలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ క్రికెట్ ఎక్సలెన్స్ లో హెడ్ ఆఫ్ క్రికెట్ పదవిలో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తన పదవితో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. తద్వారా టీమిండియా హెడ్ కోచ్ బాధ్యత తనకు వద్దని చెప్పేసినట్లు తెలుస్తోంది. అయినా బీసీసీఐ వర్గాలు లక్ష్మణ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం 2027 ప్రపంచ కప్ వరకు గంభీర్ ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్తున్నాయి. గంభీర్ పై తమకు నమ్మకం ఉందని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది.

అయితే భారత క్రికెట్లో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. తాజాగా టీ20 వరల్డ్ కప్ కు టీమ్ ఎంపికలో శుభ్ మన్ గిల్ ను అనూహ్యంగా పక్కనబెటేసిన తర్వాత బీసీసీఐ వైఖరి మరోసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గా అనూహ్య పేర్లను పరిశీలిస్తున్నట్లు చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. వాస్తవానికి 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసేవరకూ గంభీర్ తో బీసీసీఐకి కాంట్రాక్ట్ ఉంది. అయినా త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన ఆధారంగా గంభీర్ పై మరో రివ్యూ ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications