వైజాగ్ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్- ఢిల్లీ నుంచి తరలివచ్చిన వన్డే మ్యాచ్..!
విశాఖపట్నంలో (Visakhapatnam) క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీ వేదికగా జరగాల్సిన భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ (India vs Sri Lanka ODI) వేదికను చివరి నిమిషంలో మార్చింది. దీంతో సేఫ్ స్పాట్ గా ఉన్న విశాఖపట్నానికి కేటాయిస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైజాగ్ క్రీడాభిమానులు భారత్-శ్రీలంక వన్డేను ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం లభించింది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ సంఘానికి బీసీసీఐ సమాచారం ఇచ్చింది.
వచ్చే నెలలో భారత్ లో శ్రీలంక టూర్ కు రానుంది. ఈ టూర్ లో భాగంగా భారత్ లో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇందులో డిసెంబర్ 13న జరిగే తొలి వన్డేకు ఢిల్లీని వేదికగా బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీలో వాతావరణ కాలుష్యం కూడా తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ నిర్వహించలేమని ఢిల్లీ క్రికెట్ సంఘం బీసీసీఐకి తేల్చిచెప్పేసింది. దీంతో బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికగా విశాఖపట్నాన్ని ఎంపిక చేసింది.

భారత టూర్ లో భాగంగా శ్రీలంక జట్టు మూడు వన్డేలతో పాటు మరో మూడు టీ20 మ్యాచ్ లు కూడా ఆడనుంది. ఆయా మ్యాచ్ ల వేదికలన్నీ ఇప్పటికే ఖరారయ్యాయి. అయితే ఇందులో ఢిల్లీ వేదిక విషయంలో మాత్రమే సమస్యలు తలెత్తడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే నెల రోజులకు పైగా సమయం ఉన్నందున విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని ఈ మ్యాచ్ కు సిద్దం చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. గతంలో విశాఖపట్నంలో పలు అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగాయి. అలాగే భారత్ ఇక్కడ ఆడిన దాదాపు అన్ని మ్యాచ్ ల్లోనూ గెలుపొందింది. దీంతో భారత్ కు అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో శ్రీలంకతో వన్డే జరగబోతోంది.














Click it and Unblock the Notifications
