గ్రీన్ మటన్ కర్రీ: ఘుమఘుమలాడే పచ్చి మసాలాతో ఇలా చేస్తే అద్దిరిపోద్ది!
నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ ను ఎప్పుడూ రకరకాలుగా వండుకుని తినాలని భావిస్తారు. కారంతో కాకుండా పచ్చి కారంతో , పచ్చి మసాలాలతో తయారు చేసే గ్రీన్ మటన్ కూర చాలా బాగుంటుంది. ఒకసారి తింటే పదే పదే కావాలని అనిపిస్తుంది. అటువంటి గ్రీన్ మటన్ కూర ఎలా వండాలి అనేది తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
లేత మటన్ చాప్స్ (లేదా బోన్ పీసెస్) - 1 కేజీ
ఉల్లిపాయ - 1 (సన్నని తరుగు)
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 4 టేబుల్ స్పూన్లు
నీరు - తగినంత
పచ్చి మసాలా పేస్ట్ కోసం:
ఉల్లిపాయలు - 4 (ముక్కలుగా కోసినవి)
వెల్లుల్లి రెబ్బలు - 3 గడ్డలు (పొట్టు తీసినవి)
అల్లం - 3 అంగుళాల ముక్క
పచ్చిమిరపకాయలు - 8 నుంచి 10 (మీ కారానికి తగినట్లు)
నల్ల మిరియాలు - 1 టేబుల్ స్పూన్
గసగసాలు - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
లవంగాలు - 5 నుంచి 6
యాలకులు - 2
తాజా పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
తాజా కొత్తిమీర - గుప్పెడు
తాజా పుదీనా ఆకులు - ఒక గుప్పెడు

తయారీ విధానం:
మటన్ ముక్కలను పసుపు, కొద్దిగా ఉప్పు వేసిన నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ప్రెజర్ కుక్కర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు పసుపు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు శుభ్రం చేసిన మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి అధిక మంటపై 3-4 నిమిషాలు వేయించాలి. దీనివల్ల మటన్‌లోని నీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై సుమారు 3 విజిల్స్ రానివ్వండి.
ఆపై ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు వేసి పచ్చివాసన పోయేలా వేయించండి.
ఉల్లిపాయలు కాస్త రంగు మారాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, వేసి మరో నిమిషం పాటు వేయించండి.చివరగా తాజా కొబ్బరి తురుము, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి ఒక్క నిమిషం పాటు కలిపి వెంటనే స్టవ్ ఆపేయండి.
ఆకుకూరలు మరీ ఎక్కువగా వేగితే గ్రీన్ కలర్ తగ్గిపోతుంది. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆపై వెడల్పాటి మందపాటి పాత్రలో ఉడికించిన మటన్ ముక్కలను ఆ నీటితో సహా వేయండి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న తాజా గ్రీన్ మసాలా పేస్ట్‌ను ఇందులో వేసి బాగా కలపాలి.
మసాలా పచ్చిదనం పోయి, మటన్ ముక్కలకు పట్టేలా మీడియం మంటపై ఉడికించండి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. మంటను సిమ్‌లో పెట్టి నూనె పైకి తేలేంత వరకు, మటన్ ముక్కలు వెన్నలా మెత్తగా అయ్యేంత వరకు 10-12 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి. చివరగా కావాలనుకుంటే అర చెక్క నిమ్మరసం పిండుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే.. కమ్మనైన గ్రీన్ మటన్ కర్రీ రెడీ!













Click it and Unblock the Notifications
