వాహనాల ఇన్సూరెన్సులపై తీపికబురు.. ఇకపై మీకు నచ్చినట్టే.. డిసెంబర్ 15నుండి అమల్లోకి కొత్తవిధానం!
వాహనదారులకు శుభవార్త. మోటారు బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మోటారు బీమా పాలసీలన్నీ ఒకే ప్యాకేజీ కింద కలిసిపోవడం వల్ల, తాము ఏ అంశానికి ఎంత ప్రీమియం చెల్లిస్తున్నామనే స్పష్టత సామాన్య వాహనదారులకు ఉండేది కాదు. ఈ అయోమయానికి తెరదించుతూ ఐఆర్డీఏఐ సరికొత్త 'నాలుగంచెల మోటారు బీమా' విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ 4-Tier Motor Insurance వాహనదారులకు అనేక బెనిఫిట్స్ అందిస్తూ బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చునే పిలియన్ రైడర్లు లేదా కార్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు తీవ్రంగా గాయపడటం, మరణించడం తరచూ జరుగుతుంటుంది. అయితే ప్రాథమిక థర్డ్‌పార్టీ పాలసీల్లో వీరి రక్షణకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో క్లెయిమ్ సెటిల్మెంట్లలో అనేక న్యాయపరమైన వివాదాలు తలెత్తేవి.

దీనిని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రయాణికులు, పిలియన్ రైడర్ల రక్షణను విడదీసి చూపేలా నిర్దిష్ట పాలసీ నిబంధనలు తీసుకురావాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ నిబంధనలు 2026 డిసెంబరు 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ నూతన విధానం ప్రకారం మోటారు బీమా పాలసీని నాలుగు స్పష్టమైన విభాగాలుగా విభజించారు.
మొదటిది తప్పనిసరి అయిన థర్డ్‌పార్టీ లయబిలిటీ కాగా, రెండోది ప్రయాణికులు మరియు పిలియన్ రైడర్ల బీమా, మూడోది వ్యక్తిగత ప్రమాద బీమా, నాలుగోది ఓన్ డ్యామేజ్ & దొంగతనం కవరేజ్. ప్రతి విభాగానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని బీమా పత్రాల్లో విడివిడిగా స్పష్టంగా చూపాలని కంపెనీలను ఆదేశించారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్లలో 'కస్టమర్ ఆప్షన్ ఫారం', 'కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్' అందించడం తప్పనిసరి చేశారు.
ఇందులో వినియోగదారులు తమకు నచ్చిన విభాగాన్ని స్వయంగా ఎంచుకోవచ్చు. పాత పాలసీ ఉన్నవారు కూడా మధ్యలో రద్దు చేయకుండానే, అదనపు ప్రీమియం చెల్లించి కొత్త కవరేజీలను కలుపుకునే వెసులుబాటు కల్పించారు. ఈ సంస్కరణతో వాహనదారులు తమ అవసరాలకు తగినట్లుగా ప్రీమియం చెల్లించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. డిసెంబరు 15 నుంచి ఈ విధానం 'బీమా సుగమ్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం కానుంది. దీనిద్వారా పాలసీల కొనుగోలు, రెన్యూవల్, క్లెయిమ్ ప్రక్రియలు మరింత సులభంగా, పారదర్శకంగా మారనున్నాయి.













Click it and Unblock the Notifications
