ఇరాన్‌కు సహకరిస్తే ఊరుకోం.. భారత దంపతులపై అమెరికా ఆంక్షలు!
ఇరాన్ చమురు విక్రయాలు, సముద్రయాన ఆంక్షలను తప్పించుకునేందుకు సాయపడిన ఆరోపణలపై భారత్, టర్కీకి చెందిన పలు సంస్థలు, వ్యక్తులపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తీవ్రమైన ఆంక్షలు విధించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించి చట్టసభలను చేజిక్కించుకున్న వేళ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్'లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.
భారత దంపతులపై వేటు.. అసలేం జరిగిందంటే?
అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. చండీగఢ్‌కు చెందిన సునీల్ కుమార్ శర్మ, ఆయన భార్య జస్ప్రీత్ ప్రీతి షాహిద్‌లు ఓ నెట్వర్కుగా ఏర్పడి ఇరాన్ అక్రమ నౌకలకు సహకరించినట్లు సమాచారం. గయానా, ఈస్వాతిని, లావోస్ వంటి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి సముద్రయాన దొంగ ధ్రువీకరణ పత్రాలు నకిలీ జెండాలను కేటాయించారు. దీనివల్ల ఇరాన్ మిలిటరీ, దాని మద్దతు గల సంస్థల నౌకలు అంతర్జాతీయ భద్రత, పర్యావరణ నిబంధనల నుంచి తప్పించుకుని అక్రమంగా చమురు రవాణా చేశాయి. ఈ కేసులో సునీల్ కుమార్ శర్మ దంపతులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరు భారత పౌరులు, వారి నిర్వహణలోని 9 విభిన్న సంస్థలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

మాతో ఉండండి లేదా వ్యతిరేకంగా ఉండండి: అమెరికా హెచ్చరిక
టర్కీకి చెందిన 'ఫ్యూగో గ్రౌండ్ సర్వీసెస్' సంస్థ ఇరాన్ ఎయిర్ లైన్స్‌కు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించినందుకు దానిపై కూడా ఆంక్షలు పడ్డాయి. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. "మా ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. మీరు మాతో అయినా ఉండాలి లేదా మాకు వ్యతిరేకంగా అయినా ఉండాలి. ఇరాన్ పాలనకు నేల, నీరు, ఆకాశం ఏ మార్గంలో మద్దతు తెలిపినా వారిని వదిలిపెట్టేది లేదు" అని హెచ్చరించారు.
మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ.. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే ప్రసక్తే లేదని ట్రంప్ యంత్రాంగం ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది. నకిలీ జెండాలు కలిగిన నౌకలతో వ్యాపార లావాదేవీలు నడిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా ట్రెజరీ శాఖ అంతర్జాతీయ షిప్పింగ్ పరిశ్రమను అప్రమత్తం చేసింది.














Click it and Unblock the Notifications
