వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారా ఈ టైటిల్‌కి అర్హురాలు ః సుస్మిత

By Staff
|
Google Oneindia TeluguNews
లారాదత్తాకిమిస్‌ యూనివర్స్‌ రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కిరీటానికి ఆమె అన్ని విధాలా అర్హురాలు. ఇంకాచెప్పాలంటే షి ఈజ్‌ ది బెస్ట్‌ ఛాయిస్‌ ....ఈ మాటలుఅన్నది ఎవరో కాదు...స్వయానా మాజీ మిస్‌ యూనివర్స్‌సుస్మితాసేన్‌. దాదాపు ఆరుసంవత్సరాల విరామం అనంతరంమిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ భారతదేశాన్నివరించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్నసుస్మితాసేన్‌తో ఇండియా ఇన్హో ప్రత్యేక ఇంటర్వూ ...

లారాదత్తా విజయంపై మీ స్పందన ఏమిటి ?

ఈ పోటీ అంతా టి.విలో చూశాను. టి.విస్క్రీన్‌ మీద లారాని చూస్తుంటే, ఒక్క సారి ఆరు సంవత్సరాల వెనక్కి వెళ్లినట్టనిపించింది. ఆరేళ్ళ క్రితం, అచ్చం ఇలాగే ఆఖరి రౌండ్‌లో నెగ్గబోయే ముందు స్టేజ్‌పై నిలబడి లోనయిన ఉద్విగ్న స్థితి మరో సారి ఆవహించినట్టయింది. స్టేజ్‌మీద నుంచున్న లారా మదిలో ఎటువంటి భావాలు, భావోద్వేగాలు పుడుతున్నాయో వాటన్నిటినీ నేను అనుభవించగలిగాను...

మిస్‌ వరల్డ్‌ల కంటే మిస్‌ యూనివర్స్‌ల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి ? ( ఐశ్వర్య, డయానా, యుక్త....మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ సాధించారు)

నిజమే. ఈ రకమైన గ్యాప్‌కి ముఖ్య కారణం చెప్పాలంటే, మిగతా అందాలపోటీలతో పోలిస్తే మిస్‌ యూనివర్స్‌లో ప్రశ్నల రౌండ్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిజం చెప్పాలంటే కేవలం అందానికి మాత్రమే కిరీటం పెట్టినట్టయితే నాకు వచ్చుండేది కాదేమో ! కనుక మిస్‌ యూనివర్స్‌లో వ్యక్తిత్వానికి ఎక్కువ మార్కులు ఉంటాయి. నేను పాల్గొన్న సంవత్సరంలో 3 రౌండ్లను ప్రశ్నలకు కేటాయించారు. ఈసారి 2 రౌండ్లలో ప్రశ్నలు వేశారు. లారా చాలా చక్కటి సమాధానాలు కూడా ఇచ్చింది. మిస్‌ యూనివర్స్‌లో పోటీ చేయడానికి అందంతో పాటు ఏకాగ్రత, మనకు తెలిసిన విషయాలని చక్కగా, స్పష్టంగా జడ్జిలకు కమ్యూనికేట్‌ చేయగలిగే సామర్ధ్యం అవసరం.

మిస్‌ యూనివర్స్‌ కాకుండా ఇలా వ్యక్తిత్వానికి ప్రాముఖ్యతనిస్తూ జరిగే అందాలపోటీలు ఏవి ? అందం- వ్యక్తిత్వం రెండిట్లో దేనిది పై చేయిగా ఉండాలంటారు ?

మిస్‌ అమెరికా, మిస్‌ యు.ఎస్‌లు ఇలా జరుగుతాయి. రెండు ఒకే దేశానివి కాబట్టి ఒకటే అనుకోవద్దు. రెండూ వేరు వేరు ఈవెంట్‌లు. ఇక అందం, వ్యక్తిత్వాల విషయానికి వస్తే, అందాలపోటీని నిర్వహించే సంస్థ ఆలోచనా విధానం, పోటీ జరిగే పద్ధతి, లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది.

అందాలపోటీలని వ్యతిరేకించే వారికి మీ సమాధానం ఏమిటి ?

ఫెమినిస్టులు, ఇంకా అనేక మంది నుంచి ఇటువంటి వ్యాఖ్యలు, ధర్నాలు వగైరాలు...విన్నాను. చూశాను. కాకపోతే ప్రస్తుతం వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇటువంటి పోటీలలో పాల్గొంటున్నప్పుడు నీ భావాలు ఎలా ఉంటాయి ? అని ఎవరైనా అడిగితే మాత్రం, సచిన్‌ టెండుల్కర్‌, ఇంకా ఇతర క్రికెటర్లు, క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతటి గర్వంగా భావిస్తారో నేనూ అంతే ! దేశపు కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింప చేసినట్టుగానే నేను అనుకుంటున్నాను. స్వదేశానికి ప్రాతినిధ్యం వహించగల అవకాశం రావడం, అలాగే దేశం తరపున పోటీలో పాల్గొని విజయం సాధించడం నిజంగా గర్వకారణమే. అందుకు అందాలపోటీలు అనర్హమైనవి మాత్రం కావు.

అందాలరాణుల కిరీటాలతో భారతదేశానికి ఎరవేసి, తమ వ్యాపార పబ్బాలను పశ్చిమదేశాలు గడుపుకోవాలని చూస్తున్నాయని, అందుకే ఇటీవలి కాలంలో భారతదేశానికి ఇన్ని కిరీటాలు దక్కుతున్నాయనే ఆర్ధికవిశ్లేషణ ఒకటుంది. దీనికి మీరేమంటారు ?

నేను కచ్చితంగా ఒప్పుకోను. అందాలపోటీల్లో వచ్చే కిరీటాల్ని ఎవ్వరూ బలవంతంగా ఫిక్స్‌ చెయ్యలేరు. 500 మిలియన్‌ ప్రజలు ఈ ఈవెంట్‌ని టి.విలో చూస్తారు...వారందరి కళ్లను మోసం చెయ్యడం కూడా కష్టమే. భారతదేశానికి ఇన్ని కిరీటాలు దక్కుతున్నాయంటే అది మన దేశం, అలాగే ఆయా పోటీల్లో పాల్గొన్న అభ్యర్ధినుల ప్రతిభే కారణం. అందాల పోటీలో పాల్గొనాలని అనుకునే అమ్మాయికి వెనిజులా దేశంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు శిక్షణనిస్తారు. ఇదే కనుక ఛీటింగ్‌ అయితే ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు.

అందాలరాణుల లిస్ట్‌ మన దేశంలో రాను రాను పెరుగుతోంది....ఈ టైటిల్స్‌ నేపథ్యంలో బ్యూటీకల్చర్‌ ప్రభావం దేశంపై ఉంటుంది కదా... దీని వల్ల వచ్చే పరిణామాల గురించి వ్యాఖ్యానించండి ?

స్ఫూర్తి అనేది తప్పకుండా ఉంటుంది. అందాల పోటీలకు సంబంధించి తొలి రోజుల్లో ఈ పోటీలో పాల్గొనడంతో అప్పట్లో మాకంతా అయోమయమే. ఏ పద్థతిలో మనం తయారవ్వాలి. ఎటువంటి పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది ? ఎలా స్పందించాలి ? అనే అంశాలపై అనాడు అంత అవగాహన లేదు. కానీ నేటి పరిస్థితి అలా కాదు. అందాల రాణుల కిరీటాలు దక్కుతున్న కొద్దీ, రాబోయే కాలంలో ఇటువంటి వాటిలో పోటీ చేయాలనుకునే వారు మరింత ప్రొఫెషనల్‌గా అప్రోచ్‌ అవగలుగుతారు. ప్రస్తుతం మన దేశానికి లభిస్తున్న ఈ టైటిల్స్‌ వారిని గైడ్‌ చేయడానికి ఉపయోగపడగలవు.

ఎస్‌. హిమబిందు

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X