కెవిపికి రాజ్యసభ సీటు ఖరారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిరకాల మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ సభ్యత్వం ఖరారయినట్టే. గతంలో రెండు సార్లు ఆయనకు రాజ్యసభ్యత్వం ఇప్పించాలని వైఎస్ ప్రయత్నించినా సఫలం కాలేదు. రాష్ట్రం నుంచి ఆరుగురు రాజ్యసభకు ఎన్నికవుతారు. ఇందులో ఒక స్ధానానికి టిడిపి పోటీ చేస్తోంది. మరొక స్ధానాన్ని కాంగ్రెస్ సిపిఐకి కేటాయించింది. మిగితా నాలుగు స్ధానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులు ఎన్నికవుతారు. ఇందులో ఒక స్ధానాన్ని రాష్ట్రేతర కాంగ్రెస్ నాయకుడికి కేటాయిస్తారు. కెవిపికి ఒక స్ధానం ఇచ్చాక ఇంకా రెండు స్ధానాలు ఉంటాయి. కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందో లేదోనన్నది సోనియాగాంధీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
రాష్ట్రంలో వైఎస్ తరఫున అన్నీ కెవిపి రామచంద్రరావే చేస్తున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. తమిళనాడులో జయలలిత నెచ్చెలి శశికళ రాజ్యాంగేతర శ క్తిగా పనిచేస్తుండగా, ఇక్కడ కెవిపి ప్రభుత్వంలో అనీ తానే అయి చక్రం తిప్పుతున్నారు. రాజశేఖరరెడ్డికి ఆయన మీద అచంచల విశ్వాసం ఉంది. ప్రభుత్వంతో పని పడిన బహుళ జాతి సంస్ధలు కెవిపినే ఆశ్రయిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులే కాదు, మంత్రి పదవుల విషయంలోనే ఆయన వైఎస్‌ను ప్రభావితం చేస్తున్నారు. ఆయనకూ దాసరి నారాయణ రావుకూ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. దాసరి స్ధానంలో మరో కాపు నాయకుడికి రాజ్యసభ స్ధానం కేటాయించి ఇటు దాసరికి చెక్ పెట్టి, అటు కాపు కులాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నది కెవిపి-వైఎస్ వ్యూహంలా కనిపిస్తోంది.
రాజ్యసభ స్ధానాల నామినేషన్లకు ఆఖరు తేదీ మార్చి 17. కెవిపి రామచంద్రరావు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చి మార్చి 17న ఢిల్లీలో ఉంటారు. అదే రోజు వైఎస్ ఢిల్లీ వెళ్ళనున్నారు. వీరిద్దరూ అధిష్టానవర్గంతో చర్చించి కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను ఖరారు చేస్తారు.












Click it and Unblock the Notifications
