బీసీలు ఎటువైపు?brవైఎస్, చిరులపై అనుమానాలతో టిడిపి వైపు బీసీలు?

కోస్తా ఆంధ్రలో కాపులు గత ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కట్టగట్టుకుని ఓట్లు వేశారు. కమ్మ వారికి వ్యతిరేకంగా రాజశేఖరరెడ్డి కాపు నాయకులను ఈ ప్రాంతంలో ప్రోత్సహించారు. రెండు దశాబ్దాల క్రితమే పిసిసి అధ్యక్షుడిగా తొలిసారి పనిచేసిన వైఎస్ అన్ని జిల్లాల్లో తన సొంత కేడర్ ను తయారు చేసుకున్నారు. ఆయన నాటిన మొక్కలు గత ఎన్నికల నాటికి పెద్ద వృక్షాలై ఆయనకు అండగా నిలిచాయి. ఇప్పుడు కోస్తా కాపులు చిరంజీవి పార్టీలో చేరడమే కాదు, పల్లెటూళ్ళలో ఇతరుల మనసులు మార్చి చిరంజీవి వైపు ఆకర్షితులయ్యేలా చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే పూర్తిగా రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమే జరిగే అవకాశాలున్నాయి.
అయితే కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని శెట్టి బలిజ (గౌడ), యాదవ, పద్మశాలి, మత్స్యకారులు వ్యవసాయదారులైన కాపు నాయకులను వ్యతిరేకిస్తున్నారు. ఇటు రాజశేఖరరెడ్డి కానీ అటు చిరంజీవి కానీ కాపుల వైపే మొగ్గు చూపడంతో బీసీ కులాల వారు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ వైపు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యే అవకాశముంది. గతంలో వంగవీటి మోహన్ రంగా నాయకత్వంలో కమ్మ వారికి వ్యతిరేకంగా వ్యవహరించిన బిసీ కులాలకు ఇప్పుడు ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాల్సిన అగత్యం ఏర్పడింది.
భారీ అంచనాల మధ్య ప్రజల ముందుకు వచ్చిన చిరంజీవి పార్టీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికార ప్రతినిధులైన పరకాల ప్రభాకర్ (కాపు), డాక్టర్ మిత్రా (రెడ్డి) అగ్ర వర్ణాలకు చెందిన వారు కావడంతో కేడర్ లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మరో విశేషం- చిరు పార్టీ వ్యవసాయ రంగ అధ్యయన కమిటీకి అధ్యక్షుడుగా యలమంచిలి శివాజీ (కమ్మ) నియమితులయ్యే అవకాశాలున్నాయి.
ఈ నేపధ్యంలో చిరు పార్టీ బీసీలను ఎంత వరకు ఆకర్షించగలదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి అభిమానుల్లో అన్ని కులాల వారు, వర్గాల వారు ఉన్నారు. కానీ అభిమానులు కాని వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం అంత తేలిక కాదు. అందుకు పటిష్టమైన ఎజెండా ఉండాలి. ఎన్టీఆర్ తమను ప్రోత్సహిస్తున్నారని ఆనాడు బీసీ కులాలు భావించబట్టే ఆయనపై ఓట్ల వర్షం కురిసింది. చిరు ప్రజా యాత్రలకు వచ్చే స్పందనను బట్టి మిగితా విషయాలపై ఒక అవగాహనకు రావచ్చు.












Click it and Unblock the Notifications
