చిరంజీవి-ఎన్టీఆర్br23 ఏళ్ళ క్రితం చిరును బ్రేక్ ఫాస్ట్ కు పిలిచిన ఎన్టీఆర్!.....

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న రోజుల్లో అంటే 1985 ప్రాంతాల్లో చిరంజీవి తెలుగు సినిమాల్లో తిరుగులేని హీరోగా ముందుకు దూసుకు వస్తున్నారు. అప్పుడు చెన్నైలోనే కాపురం ఉంటున్న చిరంజీవి ఒక షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి బంజారా హోటల్ లో బస చేశారు. ఆ సమయంలో ఆయనతో అదే హోటల్ లో ఉన్న ఆయన సమీప బంధువు చెప్పిన వివరం ఇప్పటి వరకు ఎక్కడా ప్రచురితం కాలేదు. ఆ వివరాలు ఈ కింద చదవండి.
షూటింగ్ ముగించుకు వచ్చిన చిరంజీవికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. "బ్రదర్, మీరు రేపు మా ఇంటికి అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)కు రావాలని ఆ కాల్ సారాంశం. చిరంజీవికి పెద్ద వాళ్ళంటే, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, ఒకింత భయం కూడా. తెల్లవారు జామునే లేచి, ఎన్టీఆర్ ఆహ్వానించిన సమయానికి ఆబిడ్స్ లోని ఎన్టీఆర్ నివాసానికి వెళ్ళే ముందు చిరంజీవి మనసులో ఎన్నో ఆలోచనలు. "అన్నగారు నన్నెందుకు పిలిచినట్టు" అని రూములో ఉన్న ఆ ఆత్మీయుడిని పదే పదే ఆశ్చర్యంగా అడగసాగారు.
చివరికి సమయానికి ఎన్టీఆర్ ఆబిడ్స్ నివాసానికి చేరుకున్న చిరంజీవి కారు అక్కడ ఆగగానే హీరో బాలకృష్ణ ఆయన కారు డోరు తెరచి నివాసంలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో టైలు కట్టుకున్న ఐఎఎస్ అధికారులతో, ఖాకీ దుస్తుల్లో ఉన్న ఐపిఎస్ అధికారులతో ఎన్టీఆర్ సీరియస్ గా చర్చిస్తున్నారు. ఆ ఉన్నతాధికారులకు ఒక ముఖ్య అతిధి రాబోతున్నారన్న విషయం తెలుసు కానీ, ఆయన ఎవరో స్పష్టంగా తెలియదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరైనా అయి ఉంటారని వారు ఊహిస్తుండగా చిరంజీవి లోపలికి ప్రవేశించడం, ఎన్టీఆర్ ఆయనను నవ్వుతూ పలకరించడం ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ చిరంజీవి నేరుగా బ్రేక్ ఫాస్ట్ ఉన్న హాలులోకి తీసు కెళ్ళారు. రెండు నిముషాలకే అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ స్వయంగా చిరంజీవికి ఇడ్లీ, వడ వంటి వారిని వడ్డించి " మీకు సినిమారంగంలో ఎంకా ఎంతో భవిష్యత్తు ఉంది, ఇంకా కష్టపడండి బ్రదర్ " అని చెప్పారట. ఆ తర్వాత ఎన్టీఆర్ తన విధుల్లోకి వెళ్ళిపోయారు.
ఎక్కడా రిపోర్ట్ కాని ఈ ఉదంతం ఆనాటి నుంచి ఈనాటి వరకు చిరంజీవి మనసులో ముద్రించుకుపోయింది. ఆయన తన పార్టీ ఆఫీసులో మదర్ థెరిసా, అంబేద్కర్ ల ఫోటోలతో పాటు ఎన్టీఆర్ ఫోటో చేర్చుకోడానికి ఇటువంటి ఉదంతాలు కారణం కావచ్చు. ఇద్దరూ మంచి కళాకారులు. తెలుగు కళామతల్లికి ఈ సందర్భంగా వందనం.












Click it and Unblock the Notifications
